Share News

నిఘా–నియంత్రణ

ABN , Publish Date - Aug 12 , 2026 | 01:49 AM

విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘానికి నివేదించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న పక్షంలో, దానిని స్వాగతించవలసిందే. ప్రస్తుత స్థితిలో ఈ సవరణ బిల్లు...

నిఘా–నియంత్రణ

విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘానికి నివేదించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న పక్షంలో, దానిని స్వాగతించవలసిందే. ప్రస్తుత స్థితిలో ఈ సవరణ బిల్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నది కనుక, దానిని పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్న స్థితిలో, అది నెగ్గే సూచనలు కూడా లేని నేపథ్యంలో, జేపీసీకి అప్పగించడం ద్వారా ప్రభుత్వం తాత్కాలికంగా ఈ వివాదం నుంచి బయటపడగలదు.

బిల్లు చుట్టూ సాగుతున్న విమర్శలు, ప్రతివిమర్శలు మరికొంతకాలం సద్దుమణగవచ్చు కానీ, లోతైన చర్చ జరగాల్సిన ఒక అంశంమీద ఇప్పటికీ రచ్చమాత్రమే జరుగుతూండటం విచారకరం. దేశభద్రత దృష్ట్యా విదేశీ విరాళాలను నియంత్రించే సర్వాధికారాలు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ఈ బిల్లులో ప్రతిపాదిస్తున్న సవరణలు సహేతుకంగా లేకుండా, తీవ్రస్థాయి నియంత్రణకు, దుర్వినియోగానికి వీలుకల్పిస్తున్నాయని విపక్షాల వాదన. దేశ సరిహద్దులు దాటివచ్చిన ఈ విదేశీ నిధులు ఎక్కడనుంచి వస్తున్నాయి, ప్రకటిత లక్ష్యానికీ, నిర్దిష్ట ప్రయోజనాలకే అవి ఉపకరిస్తున్నాయా, లేక అడ్డతోవలు తొక్కి దేశానికి నష్టం చేస్తున్నాయా? అన్నది పర్యవేక్షించడమే తమ సవరణల లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ వాదనను విపక్షాలే కాదు, ప్రభుత్వేతర సంస్థలనుంచి పౌరహక్కుల సంఘాలవరకూ ఎవరూ విశ్వసించడం లేదు. విదేశీ సాయాన్ని కాదనడమో, కాలదన్నడమో తమ లక్ష్యం కాదని పాలకులు చెబుతున్నప్పటికీ, మోదీ ప్రభుత్వం గత పుష్కరకాలంగా ఎఫ్‌సీఆర్‌ఏతోనూ, ప్రభుత్వేతర సంస్థలతోనూ ఎంత కఠినంగా వ్యవహరించిందో తెలిసిందే. ఆ కారణంగా ఈ బిల్లుమీద భయాలు, తెరవెనుక లక్ష్యాలమీద అనుమానాలు కలగడం సహజం. ఆరేళ్ళక్రితం సవరణలతో ఈ చట్టానికి బీజేపీ ప్రభుత్వం మరింత సానబట్టిన ఫలితంగా దేశంలో విదేశీనిధులు అందుకుంటున్న పేరొందిన సంస్థలూ, ప్రముఖుల సంఖ్య ఇప్పటికే బాగా కుదించుకుపోయింది. తమకు గిట్టని సంస్థల ఎఫ్‌సిఆర్‌ఏ రిజిస్ట్రేషన్లను రద్దుచేయడం, మళ్ళీ పునరుద్ధరించకపోవడం ఒక పద్ధతి ప్రకారం జరిగిందని, మరోపక్క అస్మదీయ సంస్థలకు లైసెన్సులు ఇవ్వడంలో చేతికి ఎముకలేనట్టుగా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపాదిత సవరణలు చేయనంతమాత్రాన ఎఫ్‌సీఆర్‌ఏ తీవ్రంగా దుర్వినియోగమైపోతుందనడానికి నిర్దిష్టమైన ఆధారాలేమీ లేవు. ఒక అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు న్యూఢిల్లీ శాఖనుంచి మాత్రమే లావాదేవీలన్నీ సాగుతూ ఎఫ్‌సీఆర్‌ఏ వ్యవస్థ ఇప్పటికే అత్యంత పకడ్బందీగా నడుస్తోంది.


దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రమేయాన్ని అడ్డుకొనేందుకు ఉద్దేశించిన ఈ చట్టం గత యాభైయేళ్ళలో కాలానుగుణంగా మారుతూ వచ్చింది. విరాళాల స్వీకరణ, చట్టబద్ధమైన వినియోగం, పారదర్శకమైన లావాదేవీలు దాని ఆశయం. ఇప్పటికే అనేకసార్లు దానిని సవరించారు. గత సవరణల తరువాత అది మరింత పదునెక్కి ప్రత్యర్థులమీద కక్షసాధింపునకు ఉపకరించి, దుర్వినియోగమైందన్న ఆరోపణలు కాదనలేనివి. కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని రద్దుచేస్తున్నప్పుడు ఆప్తుడుగా ఉన్న ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్‌వాంగ్‌చుక్‌ తదనంతరకాలంలో లద్దాఖ్‌కు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమంటూ ప్రజల పక్షాన ఉద్యమిస్తే, ఆలింగనం చేసుకున్నవారే ఆయనను శత్రువుగా పరిగణించి, ఈ విదేశీ విరాళాల చట్టాన్ని ప్రయోగించారు. తెచ్చుకున్న విదేశీనిధులను దేశవ్యతిరేక కార్యకలాపాలకోసం వినియోగించిన దేశద్రోహిగా ఆయనపై ముద్రవేసి జైలుకు పంపారు. ఆ తరువాత ఈ ఆరోపణలన్నీ ఉపసంహరించుకొని ఆయనను వదిలేశారు కూడా.

ఒక స్వచ్ఛంద సంస్థకు రిజిస్ట్రేషన్‌ నిలిపివేసిన పక్షంలో, అది అప్పటివరకూ విదేశీ నిధులతో నిర్మించిన ఆస్తిపాస్తులన్నీ స్వాధీనం చేసుకొని, వాటి నిర్వహణ, విక్రయం ఇత్యాది సర్వాధికారాలనూ దఖలుపరచుకొన్న ఒక శక్తిమంతమైన అథారిటీని నెలకొల్పడం ఈ సవరణ బిల్లులోని ఒక ప్రధాన ప్రతిపాదన. అలా నిర్మితమైన పాఠశాలలు, ఆస్పత్రుల వంటివి పూర్తిగా విదేశీనిధులతోనే కాక, స్థానిక విరాళాలు కూడా అందులో భాగంగా ఉంటాయి కనుక, ఈ కొత్త వ్యవస్థమీద, దానిద్వారా ప్రభుత్వానికి దక్కే విశేషాధికారాలమీద చాలా అనుమానాలున్నాయి. విదేశీనిధుల దుర్వినియోగాన్ని ఎవరూ అంగీకరించరు, క్షమించరు. కానీ, తమను ప్రశ్నించేవారిని హద్దుల్లో ఉంచేందుకు, పౌరసమాజాన్ని నియంత్రించేందుకు ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూపోతున్నదన్న విమర్శలకు కేంద్రం ఇకనైనా తావివ్వకూడదు.

ఇవి కూడా చదవండి..

దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్‌ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..

అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..

Updated Date - Aug 12 , 2026 | 01:49 AM