కొత్త సౌభ్రాతృత్వం
ABN , Publish Date - Jul 02 , 2026 | 01:23 AM
‘మనిషి సృష్టించిన సమస్యలతో ఇప్పటికే బాగా ఇబ్బందులలో ఉన్న పేద దేశాలు ఇప్పుడొక కొత్త ప్రాకృతిక వినాశనాన్ని ఎదుర్కోబోతున్నాయి. వాతావరణ మార్పే ఆ విపత్తు’ అని ఐదు దశాబ్దాల క్రితం ఐక్యరాజ్యసమితి...
‘మనిషి సృష్టించిన సమస్యలతో ఇప్పటికే బాగా ఇబ్బందులలో ఉన్న పేద దేశాలు ఇప్పుడొక కొత్త ప్రాకృతిక వినాశనాన్ని ఎదుర్కోబోతున్నాయి. వాతావరణ మార్పే ఆ విపత్తు’ అని ఐదు దశాబ్దాల క్రితం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధిసభ ప్రత్యేక సమావేశంలో అమెరికా రాజనీతిజ్ఞుడు ఒకరు హెచ్చరించారు. జాగృత వాణి. అయితే ఆ ముప్పు ముంగిట ఉన్నది పేద దేశాలేనా? కాదని కాలం తరచు పదే పదే స్పష్టం చేస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా యూరోపియన్ దేశాలలో పౌర జీవనాన్ని మున్నెన్నడూ లేని రీతిలో అస్తవ్యస్తం చేస్తున్న భీకర వడగాలులే అందుకొక తాజా నిదర్శనం.
విపరీత స్థాయిలో మండుతున్న ఎండా కాలాన్ని యూరోపియన్లు చవి చూస్తున్నారు. గతంలో మూడు శతాబ్దాలకొక పర్యాయం మాత్రమే వీచిన అటువంటి చండ్రగాడ్పులు ఇప్పుడు ఒక దశాబ్ది కాలంలోనే ఒకటి కంటే ఎక్కువసార్లు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పుతున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదల రికార్డులు బద్దలు గొడుతుండడంతో ఈ వైపరీత్యం కొత్త సాధారణ పరిస్థితి కాబోదు కదా అని సామాన్యులు ఆందోళన చెందుతుంటే యూరోప్ వాతావరణం మౌలికంగా మారిపోతుందా అని వైజ్ఞానికులు తర్కిస్తున్నారు. సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో పెరిగినట్టు వివిధ అధ్యయనాలు ధ్రువీకరించిన కొద్ది రోజులకే యూరోప్‌లో సూర్యుడి భగ భగలు తీవ్రమయ్యాయి. వందలాది నగరాలలో రోజువారీ ఉష్ణోగత్రల కనీస సగటు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించిపోవడం చాలామంది యూరోపియన్లకు కొత్త అనుభవం. ధనికులు–పేదలు, పిన్నలు–పెద్దలు అందరూ అత్యుగ్ర ఉష్ణోగ్రతల నుంచి ఉపశమమనం పొందేందుకు ప్రయాసపడుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఎడతెగని ఘర్షణలతో నెలకొన్న ఇంధన సంక్షోభంతో సతమతమవుతున్న యూరోపియన్లకు ఈ వడగాడ్పులు ప్రాణాంతకమయ్యాయి. వివిధ యూరోపియన్ దేశాలలో ఎండల తీవ్రతకు చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే నాలుగు అంకెల్లో ఉన్నది. ఇంధన, వాతావరణ సంక్షోభాలు రెండూ శిలాజ ఇంధనాల వినియోగంతో ముడివడివున్నవి కావడం గమనార్హం. కాలుష్య కారక వాయువులను ఉద్గారించని హరిత ఇంధనాల వాడకానికి త్వరితగతిన మారడమే ఆ రెండు ఉత్పాతాలకు ఒక సహేతుకమైన పరిష్కారం. యూరోపియన్ ప్రభుత్వాలు, ప్రజలు ఈ విషయమై ఇప్పటికైనా చిత్తశుద్ధితో శ్రద్ధాసక్తులు చూపని పక్షంలో సుదీర్ఘకాలం పాటు ఏటా ఉగ్రవేసవినే చవిచూడవలసివస్తుంది, సందేహం లేదు.
వాతావణ మార్పు, భూతాపం ప్రతికూల ప్రభావాలను అరికట్టేందుకు యూరోపియన్లు ఇంతవరకు ఒక దృఢ సంకల్పంతో పూర్తి స్థాయిలో పూనుకోలేదనే చెప్పాలి. కనుకనే వారు శిలాజ ఇంధనాలను యథేచ్ఛగా వాడుతూనే ఉన్నారు. వాటి వినియోగం నిలిచిపోయినప్పుడు లేదా గణనీయంగా తగ్గిపోయినప్పుడు మాత్రమే ఉగ్ర వేసవికాలాలు పునరావృతం కావు.
యూరోపియన్లకు వాటిల్లిన వేసవి క్షేశాలపై సానుభూతి చూపడమే కాకుండా, వాటిని అధిగమించే మార్గాలనూ అన్వేషించడం అవసరం. ప్రకృతిపై సార్వభౌమత్వం సాధించాలని మానవుడు ప్రయత్నించడం ఎంత పురాతనమో మనిషిపై ప్రకృతి పగపట్టడం కూడా అంతే ప్రాచీన వ్యవహారం. భౌతిక జగత్తుపై తనకు ఆధిపత్యం ఉందనే భ్రమను మానవుడు విడనాడనంతవరకు మనిషి పర్యావరణ సంక్షోభాల పాలవుతూనే ఉంటాడు. ప్రకృతితో సామరస్యం ముఖ్యం. దాన్ని సాధించడమెలా? వాతావరణ మార్పును పూర్తిగా నిరోధించడమే. అందుకు సామాజిక వ్యవస్థలు, జీవావరణం పట్ల ఒక కొత్త సౌభ్రాతృత్వ వైఖరితో వ్యవహరించాలి. మానవాళిని స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం వైపు నడిపించిన యూరోప్ నుంచే ఆ వెలుగుబాట ప్రారంభమవగలదని ఆశిద్దాం.
ALso Read:
18 నగర వనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
2026 హజ్ యాత్రికులకు రూ. లక్ష సబ్సిడీ విడుదల