యోధులకు అన్యాయం
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:00 AM
భారత క్రీడారంగంలో తీవ్ర సంచలనం రేపిన మహిళా రెజ్లర్ల లైంగింక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతాపార్టీ నాయకుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌ను...
భారత క్రీడారంగంలో తీవ్ర సంచలనం రేపిన మహిళా రెజ్లర్ల లైంగింక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతాపార్టీ నాయకుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌ను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సహనిందితుడు వినోద్ తోమర్‌ను కూడా కోర్టు వదిలేసింది. ఆరోపణలకు సంబంధించి ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపలేదని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రకటించారు. కేసు ఆరంభం నుంచి అన్ని వ్యవస్థలు ఎలా వ్యవహరించాయో తెలిసిందే కనుక, ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. నిజానికి, మహిళా మల్లయోధులు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా పోరాడారని అనడం కంటే, ఆయన చుట్టూ కంచుకోటలాగా నిలబడిన వ్యవస్థమీద వారు పోరాడవలసి వచ్చిందనడం సబబు.
ఈ తీర్పు మహిళా రెజ్లర్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేయలేదని వారి వ్యాఖ్యలే స్పష్టంచేస్తున్నాయి. ఏళ్ళ తరబడి, చివరకు ఈ మహాశక్తిమంతుడిమీద కనీసం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయించడానికి కూడా వీధినపడి పోరాటాలు చేయాల్సివచ్చిన నేపథ్యంలో ఈ తీర్పును వారు ఊహించేవుంటారు. సమస్తశక్తులూ అతడికి అండగా నిలిచాక కేసు వీగిపోక ఏమవుతుందని వినీశ్ ఫోగాట్ వంటివారు వ్యాఖ్యానిస్తున్నారు. ఉన్నతన్యాయస్థానాల్లో అమీతుమీ తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించడం మెచ్చదగినది. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నకాలంలో బ్రిజ్‌భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఈ మహిళలు బహిరంగంగా ప్రకటించి, పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకపోయింది. మంత్రులను కలుసుకొని విజ్ఞప్తులు చేయడానికీ అవకాశం దక్కలేదు. అత్యాచార నిందితుడు కొత్తపార్లమెంట్ భవనంలో ఆశీనుడై ఆరంభోత్సవ వేడుకలు చూస్తూవుంటే, కూతవేటు దూరంలో అతడి బాధితులంతా పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నారు. ఆ వెలుగుజిలుగుల భవనంవైపు చూస్తూ, పోలీసువ్యానులో తరలిపోతున్న వీరంతా ‘నయా దేశ్ ముబారక్’ అంటూ చేసిన వ్యాఖ్య ఎన్నటికీ చెరిగిపోనిది. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామన్న హామీతో జంతర్‌మంతర్ దగ్గర వీరి నిరసనలను విరమింపచేశారు కానీ, నాలుగునెలలు గడిచినా ఆ హామీకి దిక్కూమొక్కూ లేకపోవడంతో మళ్ళీ రెజ్లర్లు ఆందోళనలకు దిగాల్సివచ్చింది. వర్షాలకు కార్పెట్లు తడిసిపోతే, మంచాలు తెచ్చుకున్నందుకు మళ్ళీ పోలీసులతో దెబ్బలుతిన్నారు. ఎంతో కష్టపడి సాధించిన పతకాలను గంగలో ముంచేయడానికి కూడా వారు సిద్ధపడ్డారు. బాధితుల్లో ఒక మైనర్ ఉన్నప్పటికీ కనీసం ఎఫ్‌ఐఆర్‌ను కూడా నమోదు చేయని ఆ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెడితేగానీ చివరకు ఢిల్లీ పోలీసులు కదలలేదు.
ఆ తరువాత బాధిత మైనర్ బాలిక ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో పోక్సో కేసునుంచి రద్దయి, బ్రిజ్‌భూషణ్ దర్జాగా జైలునుంచి బయటకు వచ్చేశారు. తాను తప్పుడు ఆరోపణలు చేశానని ఆ మైనర్ బాలిక ఒప్పుకోవడంతో పాటు, అన్ని విధాలుగా ఆమెను ప్రశ్నించి, నిందితుడిమీద ఆరోపణల్లో నిజం లేదని తేల్చామని ఢిల్లీ పోలీసులు కోర్టుకు చెప్పుకున్నారు. తదనంతరం బ్రిజ్ భూషణ్ వందలాది వాహనాలతో అయోధ్యవెళ్ళి, పవిత్రస్నానం ఆచరించారు. పదిహేనువందల పేజీల సుదీర్ఘచార్జిషీటులో ఢిల్లీ పోలీసులు ఎన్ని ఆరోపణలు చేసినా, వాటిని నిరూపించే ఆధారాలు లేవనీ, బాధితుల వాదనలో పొంతనలేదన్న పేరిట మిగిలిన ఆ కేసు కూడా ఇంతకాలం తరువాత వీగిపోయింది. బాధితులు పేర్కొన్న సంఘటన కాలంలో బ్రిజ్ భూషణ్ అక్కడ లేనేలేరని ఆయన తరఫు న్యాయవాదులు నిరూపించగలిగారట.
ట్రయల్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయడానికి సిద్ధపడుతున్న బాధితులకు కనీసం అక్కడైనా న్యాయం దక్కాలి. కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్న ఈ కాలంలో, ఉన్నతస్థానాల్లోనూ, అధికార కేంద్రాల్లోనూ ఉన్నవాళ్ళు ఏమైనా చేయగలరనీ, వారిని అన్ని వ్యవస్థలూ వారిని రక్షిస్తాయన్న అభిప్రాయం కలగడం సముచితం కాదు. కఠోరశ్రమతో అంతర్జాతీయవేదికలమీద దేశానికి పతకాలనూ, కీర్తిప్రతిష్ఠలను సంపాదించిపెట్టినవారికి అన్యాయం జరగకూడదు.
ఇవి కూడా చదవండి...
కిడ్నాప్ కేసు.. గుజరాత్‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్
పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్
Read Latest AP News And Telugu News