Share News

కాలుష్యకాలంలో ఢిల్లీ!

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:40 AM

ఢిల్లీలో ఈ సమయంలో సర్వసాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు బాగా తగ్గిపోయాయంటే, అదేమీ సంతోషించాల్సింది కాదు. 2008 తరువాత సెప్టెంబర్‌...

కాలుష్యకాలంలో ఢిల్లీ!

ఢిల్లీలో ఈ సమయంలో సర్వసాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు బాగా తగ్గిపోయాయంటే, అదేమీ సంతోషించాల్సింది కాదు. 2008 తరువాత సెప్టెంబర్‌ నెలాఖరులో అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డు కావడమన్నది నగరం చల్లబడిందని కాక, దేశ రాజధాని మళ్ళీ కష్టకాలంలోకి జారుకుంటోందన్న హెచ్చరిక. వాయు కాలుష్యంతో ఈ శీతాకాలంలో నగరవాసులు మరోమారు నరకం అనుభవించబోతున్నారని అర్థం.

ప్రతి ఏటా ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు కొన్ని ప్రకటిస్తుంది. శీతాకాలంలో పాలకులకు ఇది ఒక క్రమం తప్పలేని ఎజెండా. సోమవారం కూడా మళ్ళీ అదే జరిగింది. పలురకాల నిర్మాణాలమీద నిషేధం విధించారు, కార్యాలయ వేళల్లో మార్పుచేర్పులు ప్రకటించారు, ఆఫీసులకు వచ్చిపనిచేసే సిబ్బందిలో సగంమందిని ఇంటినుంచి పనిచేయాలంటున్నారు, నగరం బయట రిజిస్టరయిన వాహనాల నగర ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారు, పార్కింగ్‌ చార్జీలు కూడా పెంచారు. ఈ జాబితాలో ఏవి ఎప్పటినుంచి అమల్లోకి రాబోతున్నాయన్నది అటుంచితే, శీతాకాలం ప్రవేశం వరకూ ఇష్టారాజ్యంగా సాగినవన్నీ, ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైనవిగా తోచడం, పరిణమించడం విశేషం. ఇప్పటిచలి తాత్కాలికమేనని, అల్పపీడన ప్రభావం తగ్గితే పరిస్థితిలో కాస్తంత మార్పు రావచ్చని అంటున్నప్పటికీ, కాస్తంత అటూఇటూగా ఈ సంక్షోభం ఏటా ఎదుర్కోక తప్పనిదే. నిర్మాణాలు, కూల్చివేతలమీద పూర్తిస్థాయి నిషేధాన్ని అటుంచితే, ఇప్పటికే అమలులో ఉన్న ‘నో ఫ్యూయల్‌–నో పీయూసీ’ విధానాన్ని మరింత కఠినంగా అమలు చేస్తారట. ఆటోమేటిక్‌ నంబర్‌ప్లేట్‌ రికగ్నేషన్‌ కెమెరాలు ఉన్న ఐదువందల పెట్రోల్‌ బంకుల్లో పాతవాహనాలమీద విరుచుకుపడతారట. రెండున్నర లక్షలవాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయబోతున్నట్టు, ఉన్న ఐదువేల ఎలక్ట్రిక్‌ బస్సులకు మరో నూటయాభై బస్సులను చేర్చి ప్రజారవాణాను మెరుగుపరచనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. పార్కింగ్‌ ఫీజులను భారీగా పెంచితే, ప్రజలు విధిగా ప్రజారవాణావైపు పరుగులు తీస్తారని అది బలంగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ప్రజలు నిజంగానే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు మీదే ఆధారపడితే, ఢిల్లీలో ఉన్న ఆ వ్యవస్థ ఏమాత్రం సరిపోదు. పద్నాలుగువేల బస్సులు అవసరమైన చోట సగం మాత్రమే ఉన్నాయి, నగరంలోని మొత్తం ప్రయాణికుల్లో ఐదుశాతం జనాభాను మాత్రమే మెట్రో తీసుకుపోతోంది. ఇక, వెచ్చదనంకోసం ప్రజలు చెత్తనీ, బొగ్గూకట్టెలూ కాల్చకుండా నిరోధించడానికి తాత్కాలికంగా విద్యుత్‌ హీటింగ్‌ స్పాట్‌లు ఏర్పాటు చేస్తే ప్రజలంతా అక్కడికే వెళ్ళి చలికాచుకుంటారని కూడా ప్రభుత్వం నమ్మకం.


కాలుష్యకాలం కమ్ముకొచ్చినప్పుడు, బాణాసంచా వినియోగం కూడా ఒక పెద్దసమస్యగా, వివాదంగా మారడం ఏటా ఉన్నదే. టపాసుల వాడకంమీద ఆంక్షలు విధించాలంటూ దాఖలైన పిటిషన్‌మీద సుప్రీంకోర్టు బుధవారం తన అభిప్రాయాన్ని ప్రకటిస్తూ, పూర్తి నిషేధానికి తాను అనుకూలం కాదని, అలాగని, రోజంతా కాల్చడానికి ఒప్పుకోనని వ్యాఖ్యానించింది. కొన్ని రకాల టపాసుల తయారీకి కూడా ఇకపై వీలు కలగబోతోంది. దీపావళినాడు బాణాసంచా కాల్చే విషయంలో సుప్రీంకోర్టు వైఖరిలో ఇటీవల పెనుమార్పు వచ్చిన విషయం తెలిసిందే. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఏలుబడిలో ఉన్నంతకాలం ఢిల్లీలో టపాసులమీద నిషేధం అమలైంది. మొదట్లో బేరియం లవణాలు లేని టపాసుల తయారీకి అనుమతించినప్పటికీ, ఆ మినహాయింపు కూడా దుర్వినియోగం కావడంతో పూర్తి నిషేధం అమలైంది. పాలకుల, న్యాయస్థానాల చొరవవల్ల, పెరిగిన కాలుష్యభయం వల్ల ఢిల్లీ వాసుల్లో కూడా టపాసులమీద మోజు తగ్గింది. విపక్షంలో ఉండగా, ఈ నిషేధాన్ని తప్పుబడుతూ వచ్చిన బీజేపీ ఢిల్లీలో తాను అధికారంలోకి రాగానే టపాసులపై సర్వోన్నత న్యాయస్థానంతోనే సరే కానివ్వండని అనిపించుకుంది. పొరుగురాష్ట్రాల్లో పంటవ్యర్థాలను తగలబెట్టడం కూడా ఢిల్లీ కాలుష్యానికి ఒక బలమైన కారణం కనుక, పరిస్థితిలో మార్పు వస్తున్నా ఈ మారు కూడా ఆ ప్రభావాన్ని కాదనలేం. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికలో అనేకం గతకాలంలోనూ అమలు జరిగినవే. గద్దెమీద ఎవరున్నా ఈ తక్షణ ఉపశమన చర్యలనే మహాద్భుతమైనవిగా అభివర్ణించుకోవడం సహజం. గ్యాస్‌ చాంబర్‌లాగా తయారైన ఢిల్లీలో వాయురూపంలో ఉన్న విషాన్ని దిగమింగుతున్న సామాన్యులకు ఏటా వచ్చే ఈ ఆపదనుంచి విముక్తి ఎప్పుడో తెలియడం లేదు.

ఇవీ చదవండి:

స్కూల్‌ టైమ్‌లోనే గాఢంగా నిద్రపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు.!

Updated Date - Oct 02 , 2026 | 04:40 AM