Share News

కాలుష్యంతో దాగుడుమూతలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:47 AM

దీపావళి టపాసుల ప్రభావంతో వాయుకాలుష్యం పెరుగుతుందన్నది కాదనలేని నిజం. పండుగ ముగిసినా ఆ బాణాసంచా పొగవీడక దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో గాలినాణ్యత బాగా పడిపోయి జనం...

కాలుష్యంతో దాగుడుమూతలు

దీపావళి టపాసుల ప్రభావంతో వాయుకాలుష్యం పెరుగుతుందన్నది కాదనలేని నిజం. పండుగ ముగిసినా ఆ బాణాసంచా పొగవీడక దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో గాలినాణ్యత బాగా పడిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు. దేశరాజధాని ఢిల్లీ వేరు. అక్కడ శీతాకాలం దగ్గరపడుతున్నప్పటికే సమస్య తీవ్రంగా ఉంటుంది. దీపావళినాటికే జనం వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతూంటారు. అందుకే, ఏటా టపాసులు కాల్చడం మీద కోర్టులో కేసులు, వాదోపవాదాలు, అంతిమంగా న్యాయస్థానం ఏవో కొన్ని నియంత్రణలతో సరేననడం అనవాయితీగా వస్తోంది. అయితే, ఈ ఏడాది ఢిల్లీ గత ఐదేళ్ళలోనే అత్యంత కాలుష్యకారక దీపావళి జరుపుకుంది. అధికారిక లెక్కల్లో దాని ఏక్యూఐ 400 వరకూ ఉన్నా, అనధికారికంగా అది మరో నాలుగింతలు.

దీపావళి రాత్రి కాలుష్యం ప్రపంచ ఆరోగ్యసంస్థ పరిమితులకు 66రెట్లు ఉందన్న ఈ లెక్కలన్నీ కూడా, ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లోని సగానికి పైగా పొల్యూషన్‌ మానిటరింగ్‌ స్టేషన్ల నుంచి డేటా రాకపోయిన తరువాతే. కాలుష్యాన్ని లెక్కగట్టే ఈ స్టేషన్లు దీపావళినాడే పనిచేయకపోవడానికి కారణం ఏమైవుంటుందో ఊహకు అందనిదేమీ కాదు. ఆదివారం అర్థరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకూ కీలకవివరాలు నమోదు కాకుండాపోవడం వెనుక, పరికరాల వైఫల్యం ఉన్నదని ఎవరూ అనుకోరు. వాటి సామర్థ్యాన్ని మించి కాలుష్యం ఉండటంతో అవి షాక్‌ తిన్నాయో, డేటా మాయం చేస్తే కాలుష్యం కూడా మాయమైపోతుందని అధికారులూ పాలకులూ అనుకున్నారో తెలియదు. ప్రైవేటు సంస్థలు లేదా అంతర్జాతీయ యాప్‌లు చూపించే డేటాకూ అధికారిక డేటాకూ మధ్య తేడాలు ఉండవచ్చు, లెక్కించే విధానాలు వేర్వేరు కావచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ నాలుగుసంఖ్యల్లో ఉన్నంతమాత్రాన నగరం మొత్తం ఆ స్థాయి కాలుష్యాన్ని ఎదుర్కొందని ఎవరూ అనడం లేదు. కానీ, అత్యంత కీలకమైన రోజున, కాలుష్యాన్ని గణించే ప్రమాణాలు కనబడకపోవడం మాత్రం ప్రభుత్వాన్ని అనుమానించేందుకు అవకాశం కల్పిస్తుంది. హిందువుల పండుగ దీపావళితో ముడిపెట్టే మీరు ఎప్పుడూ కాలుష్యం గురించి ఎందుకు మాట్లాడతారు? అని ఢిల్లీ బీజేపీ నాయకులు ఆప్‌, కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు. అందువల్ల, కాలుష్యం గురించి ఎవరూ అడగకుండా చేయడానికే ఢిల్లీ ప్రభుత్వం డేటా దాచేసిందని అక్కడి ప్రజలు నమ్మే ప్రమాదం ఉంటుంది. తనను మళ్ళీ తప్పుదోవపట్టిస్తున్నారని సర్వోన్నతన్యాయస్థానమూ బాధపడవచ్చు. 20 కొత్త మానిటరింగ్‌ స్లేషన్లను ఢిల్లీకి అత్యంత దూరంలో నిర్మించడం, వాటిమీద నీరుచల్లడం కూడా ప్రజలను మోసం చేయడానికేనన్న ఆప్‌ నాయకుల వాదనను కూడా జనం నమ్మేందుకు వీలుంది.


దీపావళి ముందురోజుకే ఢిల్లీ కాలుష్యం ప్రమాదకర దశలోకి చేరింది. అందుకు పంజాబ్‌లో పంటవ్యర్థాలు తగలబెట్టడం సహా చాలా కారణాలు ఉండవచ్చు. అయినా, అనేకానేక రూపాల్లో కమ్ముకున్న ఈ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు చెప్పుకొని, పలు ఆంక్షలు, నియంత్రణలతో బాణాసంచాకు అనుమతి సాధించింది. తాము నిర్దేశించిన ఆ కొద్దిగంటల్లోనే ఢిల్లీ ప్రజలు టపాసులు కాల్చుకుంటారని బహుశా తీర్పుచెప్పిన న్యాయమూర్తులు కూడా నమ్మివుండరు. ఉదయం ఒకగంట, రాత్రి ఓ రెండుగంటపాటు మాత్రమే టపాసులు కాల్చుకోవచ్చునని కోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర ఉల్లంఘనకు గురైంది. కొన్ని ప్రాంతాల్లో రోజంతా, అర్థరాత్రి దాటిన తరువాత కూడా టపాసులు కాల్చినందున, గాలి నాణ్యత దారుణంగా పడిపోయి, కొన్ని చోట్ల ఎక్యూఐ 2200వరకూ ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. గ్రీన్‌క్రాకర్స్‌ పేరిట ఇచ్చిన అనుమతి కూడా వ్యాపారులు, అధికారుల చేతివాటంతో తీవ్రంగా దుర్వినియోగమైంది. ప్రజలు వాటినే పూర్తిగా వాడలేదని ఈ ప్రమాదకర పరిస్థితులు తెలియచెబుతున్నాయి. దీపావళి రాత్రి పీఎం 2.5స్థాయి, సల్ఫర్‌ డయాక్సయిడ్‌ స్థాయి ఊహకు అందనంతగా పెరిగిపోయాయి. టపాసుల పెట్టెలపై క్యూఆర్‌ కోడ్లు, ప్రత్యేక విక్రయకేంద్రాల వంటి కోర్టు ఆదేశాలన్నీ నామమాత్రమైపోయి, బాణాసంచాను అనుమతించిన న్యాయస్థానాన్ని ప్రజలు సోషల్‌ మీడియాలో తప్పుబట్టే పరిస్థితి ఏర్పడింది. తప్పుడు కాలుష్య సమాచారం అన్ని వ్యవస్థల పనితీరునూ దెబ్బతీస్తుంది, పరిష్కారమార్గాల సరికొత్త అన్వేషణకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రజలకు, మరీముఖ్యంగా దీపావళినాడు టపాసులు కాల్చిన వారికి వాస్తవం తెలియడం అవసరం. కాలుష్యాన్ని దాచేయడం వల్ల ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినట్టు అవుతుంది. సంస్థాగత జవాబుదారీతనం, ప్రజల్లో అవగాహన, నివారణ చర్యలకోసం కచ్చితమైన డేటా అవసరం. రక్తపోటుకైనా, కాలుష్యం కాటుకైనా యంత్రాలు సరిగా పనిచేయకపోతే ప్రాణానికే ప్రమాదం.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓపై మేము గూఢచర్యం చేయలేదు: చైనా

వాళ్లు చాలా క్లోజ్.. ఎన్విడియా సీఈఓ ఎఫైర్‌పై 6 నెలల క్రితమే డౌట్

Updated Date - Nov 10 , 2026 | 01:48 AM