Share News

చైనా దూకుడు...!

ABN , Publish Date - Oct 27 , 2026 | 01:36 AM

భారత్‌–చైనా సరిహద్దులో పరిస్థితి సవ్యంగా లేదంటూ ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు అధినేత చేసిన ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజుల్లో అరుణాచల్‌లోని వివిధ సరిహద్దు పోస్టుల్లో ఘర్షణలు జరిగాయి, అవి...

చైనా దూకుడు...!

భారత్‌–చైనా సరిహద్దులో పరిస్థితి సవ్యంగా లేదంటూ ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు అధినేత చేసిన ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజుల్లో అరుణాచల్‌లోని వివిధ సరిహద్దు పోస్టుల్లో ఘర్షణలు జరిగాయి, అవి ఇంకా కొనసాగుతున్నాయి అన్నారాయన. తన దళాలను ఉద్దేశించి చేసిన ప్రసంగమే కానీ, దానిని ఐటీబీపీ ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ఆ విషయం మీడియాకూ ప్రజలకూ చేరింది. బ్రిక్స్‌ సదస్సుకోసం చైనా అధ్యక్షుడు భారతదేశంలో ఉన్న సమయంలో కూడా ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని ఆయన మాటలను బట్టి అర్థంచేసుకోవాలి. ఘర్షణలను ధ్రువీకరిస్తూ ఐటీబీపీ అధినేత వ్యాఖ్యానించడం కూడా ఇదే తొలిసారి. చైనాతో ఉన్న దాదాపు మూడున్నరవేల కిలోమీటర్ల సరిహద్దును గస్తీకాస్తున్న దళాల అధిపతినుంచి వచ్చిన ఈ ప్రకటన పరిస్థితి తీవ్రతను తెలియచెబుతోంది.

ఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ఆయా సందర్భాల్లో ఐటీబీపీకి చెందిన శౌర్య కమాండోలు అద్భుతంగా పనిచేస్తున్నారని, గల్వాన్‌ తరహా ఉదంతాలను ఎదుర్కోవడానికి మెరుగైన కార్యాచరణను సిద్ధం చేశామని ఐటీబీపీ డీజీ చెప్పుకొచ్చారు. అరుణాచల్‌లోని పలుప్రాంతాల్లో ఒక ప్రత్యేక కమాండో విభాగాన్ని, డ్రోన్‌ప్లాటూన్ల వంటివీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెబుతూనే, చైనా ఆర్మీని ఢీకొనడానికి సంప్రదాయ యుద్ధపద్ధతులు సరిపోవనీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికంగా వినియోగించాలని అన్నారాయన. సహజంగానే ఈ ప్రకటనపై విపక్ష కాంగ్రెస్‌ స్పందిస్తూ, ఈ పరిణామాలేవీ ప్రజలకు తెలియనివ్వకుండా, దేశానికి సమాధానం చెప్పకుండా కేంద్రం మౌనం పాటిస్తోందని, మరోపక్క చైనాకు భారీ రాయితీలు కొనసాగిస్తోందని విమర్శించింది. గల్వాన్‌ ఘటన తరువాత చైనానుంచి దిగుమతులు 102శాతం పెరిగాయని ఆ పార్టీ విమర్శ. భారత విదేశాంగశాఖ అధికారప్రతినిధి ఈ పరిణామాలమీద అతిజాగ్రత్తగా ప్రతిస్పందించారు. నిర్దేశించిన గస్తీ పరిమితులను చైనా బలగాలు ఉల్లంఘించినప్పుడల్లా సరిహద్దువెంబడి ఘర్షణలు జరుగుతున్నాయని ఆ దేశంమీద ఓ విమర్శ చేశారు. అపోహలకు తావులేకుండా ఇరుదేశాలు దౌత్యాన్ని ఉపయోగించుకుంటూనే ఉన్నాయని అంటూ సరిహద్దుల్లో శాంతి, సామరస్యాలు నెలకొనడం ఉభయదేశాల ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు అత్యంత ముఖ్యమని గుర్తుచేశారు.


ఆగస్టులో సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాప్‌లో అరుణాచల్‌లోని 27 ప్రదేశాలను వాటి ప్రామాణిక పేర్లతో భారతదేశం గుర్తించినప్పుడు ఇది కేవలం చైనాతో సాగుతున్న పేరుమార్పిడి యుద్ధంలో భాగమని అంతా అనుకున్నారు. అరుణాచల్‌లోని పలుప్రాంతాలకు చైనా తనసొంత పేర్లు పెడుతున్న నేపథ్యంలో, భారత అధికారిక పటంలో ఆ రాష్ట్రంలోని కీలకప్రాంతాలకు ఇలా నామకరణం చేసి, అరుణాచల్‌ మాదేనని విస్పష్టంగా చైనాకు చెప్పినందుకు జనం సంతోషించారు. మరీ ముఖ్యంగా ఇందులో అత్యంత సున్నితమైన, ఘర్షణలు రేగిన సరిహద్దు ప్రాంతాలు కూడా ఉన్నందున చైనా మ్యాప్‌వార్‌కు భారత్‌ గట్టి జవాబు ఇచ్చిందని భావించారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో ఇది పూర్తి విరుద్ధమైన చర్య అనీ, సరిహద్దు సమస్యలను సవ్యంగా పరిష్కరించుకోనివ్వకుండా ఇటువంటివి అడ్డుపడతాయంటూ చైనా ఈ చర్యను తప్పుబట్టింది కూడా. మరుసటి నెలలో చైనా అధ్యక్షుడు బ్రిక్స్‌ సదస్సుకోసం రాబోతున్న తరుణంలో భారత్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కూడా కలిగించింది. అయితే, అరుణాచల్‌ సరిహద్దుల్లోని పలుప్రదేశాల్లో జూలై నుంచే వివాదాలు రేగాయని, కొన్ని ప్రదేశాల్లో చైనా సైనికులు ఆరేడుకిలోమీటర్ల లోపలకు చొరబడి గుడారాలు వేశారని ఇప్పుడు అర్థమవుతోంది.

2017లో డోక్లాం, 2020లో గాల్వాన్‌ తరహాలో అరుణాచల్‌లో మరో తీవ్ర ఘర్షణ ముంచుకొస్తోందా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. చైనా ఆర్మీ అనేక విషయాల్లో మనకంటే పైచేయిలో ఉందని, సాంప్రదాయవిధానాల్లో దాని దూకుడును నియత్రించడం కష్టమన్న రీతిలో ఐటీబీపీ చీఫ్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలను తప్పుబట్టినవారు, హద్దులు దాటారని విమర్శించినవారు లేకపోలేదు. అయితే, పాలకులకు తెలియకుండా ఆయన ఈ సరిహద్దు ఘర్షణలను బహిర్గతం చేశారనీ అనుకోలేం. చైనానుంచి మనం మళ్ళీ ఎదుర్కొంటున్న ప్రమాదాన్ని రిటైర్‌ కావడానికి కొద్దిరోజులముందు ఈ అధికారి బహిర్గతం చేయడం ఏ కారణాలతో జరిగినప్పటికీ అది మనం సంసిద్ధతకు ఉపకరిస్తుంది.

ఈ వార్తలనూ చదవండి:

బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్

’ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు

Updated Date - Oct 27 , 2026 | 01:36 AM