Share News

దిగజారిన ఈసీ ప్రతిష్ఠ

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:31 AM

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి మరోమారు ఇండియా కూటమి సిద్ధపడుతోంది. ఒక ఆంగ్లదినపత్రిక దర్యాప్తులో వెల్లడైన అంశాలు దానికి ఇప్పుడు కొత్త...

దిగజారిన ఈసీ ప్రతిష్ఠ

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి మరోమారు ఇండియా కూటమి సిద్ధపడుతోంది. ఒక ఆంగ్లదినపత్రిక దర్యాప్తులో వెల్లడైన అంశాలు దానికి ఇప్పుడు కొత్త నైతికశక్తినిచ్చాయి. ఇప్పటివరకూ ఎన్నికల సంఘంమీద విపక్షాలు చేస్తున్న విమర్శలకూ, ఆరోపణలకు ఈ కథనం మరింత విలువ సమకూర్చింది. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, జాబితాల సవరణ సహా అనేక కీలకమైన అంశాల్లో ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు, ఇచ్చిన ఆదేశాల మీద గత పదినెలలకాలంలో, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్‌ సంధు, వివేక్‌జోషీ కనీసం పద్నాలుగుసార్లు తమ ఆక్షేపణలను, అభ్యంతరాలను ప్రకటించినప్పటికీ, వాటిని బేఖాతరుచేస్తూ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ ఏకపక్షంగా నిర్ణయాలు చేశారని ఈ కథనం చెబుతున్నది కనుక, విపక్షాలు అందివచ్చిన ఈ ఆయుధాన్ని జారవిడుచుకోవు.

జ్ఞానేశ్‌ తక్షణమే రాజీనామా చేయాలనీ, ఆయన అప్రూవర్‌గా మారాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో లోక్‌సభనుంచి 130మంది, రాజ్యసభనుంచి 63మంది ఎంపీలు సంతకాలు చేసి ఇచ్చిన నోటీసులను మరుసటి నెలలో ఉభయసభాపతులూ తిరస్కరించిన విషయం తెలిసిందే. వెంటనే ప్రతిపక్షం తొమ్మిది అభియోగాలతో మరో నోటీసుతో తిరిగివచ్చింది కానీ, ఆ తరువాత సంఖ్యాబలంలో తేడాలు వచ్చేశాయి. మార్చినెల నోటీసులో ఉన్నంత బలంతో విపక్షం ఇప్పుడూ విరుచుకుపడగలదా? అన్నది అటుంచితే, అటువంటి ప్రయత్నం ఒకటి విజయవంతంగా చేయగలిగితే కొత్త పరిణామాల నేపథ్యంలో దానికి ప్రజల దృష్టిలోనూ విలువ సమకూరుతుంది. భేదాభిప్రాయాలు, అభ్యంతరాలు సంస్థాగతచర్చల్లో అంతర్భాగమని ఎన్నికల సంఘం ఈ దర్యాప్తు కథనాన్ని తీసిపారేస్తున్నది కానీ, ఆ ఇద్దరు కమిషనర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలను త్రోసిపుచ్చి సీఈసీ దూకుడు నిర్ణయాలు చేశారన్నదే దాని సారాంశం.

అధికారపక్షం ఎప్పటిలాగానే జ్ఞానేశ్‌ తరఫున వకాల్తాపుచ్చుకొని ఆయనను వెనకేసుకువస్తూ, ప్రతిపక్షాలను తిట్టిపోస్తోంది. కానీ, సీఈసీ చర్యలమీద అసంతృప్తి, ఆయన విధానాలపైన అభ్యంతరాలు కేవలం పౌరసమాజం, మీడియా, ప్రతిపక్షాలకే పరిమితమైనవి కాదని, అది ఎన్నికల సంఘంలోనే లోతుగా ఉన్నదని ప్రజలకు ఇప్పుడు తెలిసివస్తోంది. ‘సర్‌’ ప్రక్రియమీద, అవి అడ్డతోవలో రుద్దిన నిబంధనలమీదా న్యాయకోవిదులు, ఎన్నికలసంఘం మాజీ పెద్దలు వెలిబుచ్చుతున్న అభ్యంతరాలనే ఈ ఇద్దరు కమిషనర్లు సంస్థాగత చర్చల్లో ప్రకటించి, అడ్డుకొనేందుకు ప్రయత్నించి విఫలమైనారని అర్థం. అమలులో ఉన్న నిబంధనలను సవరించకుండా కొత్త ఓటరు ఫారమ్‌లో మనకు నచ్చిన కాలమ్‌లు కొత్తగా చేర్చలేమని ఒక కమిషనర్‌ అడ్డుపడినప్పటికీ, గత ‘సర్‌’ జాబితాలో మీ తాతలూ తండ్రుల పేర్లున్నాయా? అన్న ప్రశ్న వచ్చిచేరింది. చాలా నిర్ణయాలను మిగతా ఇద్దరూ చట్టవిరుద్ధమని అభ్యంతరపెట్టినా అవే అంతిమంగా అమలులోకి వచ్చాయి. ఎన్నికల జాబితాల కేంద్రీకరణనుంచి, రాష్ట్ర కమిషన్‌లకు స్వేచ్ఛలేకుండా సాఫ్ట్‌వేర్‌ను నియంత్రించడం వరకూ ప్రతీ నిర్ణయమూ ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది.


ఎన్నికల సంఘంలో అన్నీ ఏకపక్ష నిర్ణయాలే జరిగాయన్న విపక్షాల విమర్శ పూర్తిగా నిజం కాకున్నా, అసమ్మతికీ, అభ్యంతరానికీ అక్కడ విలువలేకుండా పోయిందన్న అనుమానం ఇప్పుడు ప్రజలకు కలుగుతోంది. ఓట్‌చోరీ, డేటా చోరీ అంటూ విపక్షాలు ఇంతకాలం చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరుతోంది. ‘సర్‌’ విషయంలో ఈసీ విధానాలు మొదట బిహార్‌లోనూ, తరువాత అతి ప్రధానంగా బెంగాల్‌లోనూ ఓటర్లను ఏ స్థాయిలో తుడిచిపెట్టేశాయో చూశాం. దశాబ్దాలుగా ఓటుచేస్తూ, మోదీని కూడా ముమ్మారు ఎన్నుకున్న కోట్లాది ఓటర్లను తార్కిక వ్యత్యాసాలనో, ఇంటిపేర్లూ ఒంటిపేర్లలో తేడాలనో, వయసులు కలవలేదనో ఒక సాఫ్ట్‌వేర్‌ అంతిమంగా అనర్హులను చేసింది. బిహార్‌, బెంగాల్‌లో సామాన్యులు, నిరుపేదలు ఈ సర్‌ దెబ్బకు గురై కూలబడితే, ఢిల్లీలో అది వివిధ వ్యవస్థల్లో కీలకపాత్ర పోషించిన ప్రముఖులకు చుక్కలు చూపిస్తోంది. చివరకు భారతరత్నలకే దిక్కులేకుండాపోయింది. 13కోట్ల పేర్లను మాయం చేసిన ఈ ప్రక్రియ అంతా ఎన్నికల సంఘంలో మెజారిటీ అభిప్రాయానికి కట్టుబడకుండా, మిగతా ఇద్దరు కమిషనర్ల వాదనలనూ కాదంటూ, వారిని చీకట్లో ఉంచుతూ కొనసాగిందన్న భావన ఓటరుకు మిగలడం విషాదం, విచారకరం.

ఈ వార్తలనూ చదవండి:

ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్

కుల వివక్ష ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌కు మాజీ చీఫ్ మద్దతు

Updated Date - Sep 25 , 2026 | 03:31 AM