Share News

తలకిందులైన న్యాయం

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:12 AM

బిల్కిస్‌బానో సామూహిక అత్యాచారం కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షను సుప్రీంకోర్టు సస్పెన్షన్‌లో ఉంచుతూ వారికి బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ఇద్దరూ ఇప్పటికే...

తలకిందులైన న్యాయం

బిల్కిస్‌బానో సామూహిక అత్యాచారం కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షను సుప్రీంకోర్టు సస్పెన్షన్‌లో ఉంచుతూ వారికి బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ఇద్దరూ ఇప్పటికే పదిహేడేళ్ళకు పైగా జైల్లో ఉండటం, వారిలో ఒకరు తీవ్రమైన శారీరక వైకల్యంతో బాధపడుతూండటం ఈ నిర్ణయానికి ఓ కారణం. విపిన్‌ చంద్ర కన్నయ్యలాల్‌ జోషీ, ప్రదీప్‌ రమణ్‌లాల్‌ మోథియాలు 2017లో బాంబే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ట్రయల్‌కోర్టు తమకు విధించిన యావజ్జీవ ఖైదును బాంబే హైకోర్టు సమర్థించడం సరికాదనీ, తమ శిక్షను నిలిపివేయాలని వారు అభ్యర్థించడంతో జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టి్‌స్‌ ప్రసన్న వరాలే ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపి, చట్టపరమైన అంశాల్లో మరింత లోతైన అధ్యయనం, విచారణ అవసరపడుతున్నందున అంతవరకూ వారికి బెయిల్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇది వారిని నిర్దోషులుగా వదిలేయడం కాదని, అప్పీళ్ళు పెండింగ్‌లో ఉన్నందున షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడం మాత్రమేనని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా గుర్తుచేసింది. వీరిద్దరినీ వెంటనే విడుదల చేయాలన్న కోర్టు ఆదేశాలమీద బిల్కిస్‌బానో దిగ్భ్రాంతి వెలిబుచ్చడం సహజం. దోషులు బయటకు రావడంతో మళ్ళీ తనకు, తన పిల్లలకు, మిగతా కుటుంబీకుల్లో భయం మొదలైందన్న ఆమె మళ్ళీ న్యాయపోరాటానికి దిగాలని నిర్ణయించుకుంది. బిల్కిస్‌ బానో తరఫు వాదనలు వినకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా సుప్రీంకోర్టు దోషుల విడుదల నిర్ణయాన్ని తీసుకోవడం న్యాయనిపుణులను ఆశ్చర్యపరిచింది.

నిందితులు సుదీర్ఘకాలం జైల్లో ఉండి, అప్పీల్‌పై విచారణ ఆలస్యమవుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఇలా తాత్కాలిక ఉపశమనం కల్పించడం అరుదైన సందర్భాల్లో జరగకపోలేదు. అయితే, సామూహిక అత్యాచారం, సామూహిక హత్యలతో దేశాన్ని కుదిపేసిన ఈ కేసులో ఆ ఇద్దరికీ బెయిల్‌ ఇచ్చేముందు బిల్కిస్‌ బాధ కూడా వినివుంటే బాధితురాలి హక్కులను కూడా కాపాడినట్టయ్యేది. అదనపు సొలిసిటర్‌ జనరల్‌తోపాటు, గుజరాత్‌, మహారాష్ట్ర న్యాయవాదులు బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించాయి. గుజరాత్‌ ప్రభుత్వం ఈ బెయిల్‌ను వ్యతిరేకించడం నిజానికి ఓ విచిత్రం. 2022ఆగస్టులో ఆ రాష్ట్రప్రభుత్వం సత్ప్రవర్తన పేరిట క్షమాబిక్ష మంజూరు చేసి, వదిలేసిన 11మందిలో ఈ ఇద్దరూ కూడా ఉన్నారు. గుజరాత్‌ ప్రభుత్వ ఉత్తర్వులమీద దేశవ్యాప్తంగా నిరసనలు రేగి, వాటిని సవాలు చేసిన నేపథ్యంలో 2024 జనవరిలో సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసి, మళ్ళీ అందరినీ తిరిగి జైలుకు పంపిన విషయం తెలిసిందే. తనకు లేని అధికారాలను వాడి ఈ పదకొండుమంది దోషులపట్ల గుజరాత్‌ ప్రభుత్వం పక్షపాతంతో, నిస్సిగ్గుగా వ్యవహరించిందని ఆనాటి తీర్పు తప్పుబట్టింది.


2022 గుజరాత్‌ ఎన్నికలకు నాలుగు నెలల ముందు వీరందరి విడుదలను పాలకపక్షం ఓ పండుగలాగా నిర్వహించింది. తిలకాలు దిద్ది, హారతులు పట్టి, ఊరేగించి మరీ వారిని జైలు నుంచి తెచ్చారు. ఆ తరువాత బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వేదికలమీద సైతం కూచోబెట్టుకొని ఎన్నికల ప్రచారం చేసుకున్నారు. రాధేశ్యామ్‌ అనే దోషి సుప్రీంకోర్టును ఏ విధంగా తప్పుదోవపట్టించిందీ, అందుకు గుజరాత్‌ ఎలా సహకరించిందీ జస్టిస్‌ నాగరత్న ఆ తీర్పులో తెలియచెప్పారు. రెమిషన్‌ విషయాన్ని మహారాష్ట్రతో తేల్చుకోమని గుజరాత్‌ కోర్టు చెబితే, మహారాష్ట్ర కుదరదు పొమ్మంది. కానీ, ఆ పరిణామాలన్నీ దాచి సదరు దోషి సుప్రీంకోర్టునుంచి గుజరాత్‌ ప్రభుత్వానికి అతడి విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా ఆదేశాలు ఇప్పించుకున్నాడు. ఆ ఒక్క పిటిషన్‌తో అస్మదీయులందరికీ రెమిషన్‌ ఇచ్చి గుజరాత్‌ పాలకులు తమ రాజకీయప్రయోజనం నెరవేర్చుకున్నారు. ఒక మహిళపై అత్యంత పాశవికంగా వ్యవహరించినవారు కూడా రెమిషన్‌కు అర్హులవుతారా?, బాధితుల హక్కులు దృష్టిలో పెట్టుకున్నప్పుడే కదా అది పరిపూర్ణ న్యాయం అవుతుంది అంటూ జస్టిస్‌ బీవీ నాగరత్న ఘాటుగా, లోతుగా ఇచ్చిన ఆ తీర్పు చరిత్రలో నిలిచిపోయింది. రెండేళ్ల తర్వాత మళ్ళీ అప్పీల్ పేరిట ఇద్దరు దోషులు బెయిల్ దక్కించుకోవడంతో అప్పటి తీర్పుతో దక్కిన న్యాయం ఇప్పుడు మళ్లీ చేజారిపోతున్నదనే ఆందోళన సహజం. ఏడేళ్లకు పైగా అప్పీళ్లు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయనేది అసలు ప్రశ్న. న్యాయపరమైన జాప్యానికి కోర్టులదే బాధ్యత కనుక, ఆ భారాన్ని బాధితులు ఎందుకు మోయాలి అని అడగడంలో తప్పేమీ లేదు.

ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 18 , 2026 | 03:12 AM