Share News

బెంజమీన్‌ బాధ..!

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:24 AM

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో బెంజమీన్‌ నెతన్యాహూకు మెజారిటీ స్థానాలు దక్కివుంటే ఒక భయంకరమైన నిజం ప్రపంచానికి తెలియకుండాపోయేది. ఇజ్రాయెల్‌ ఎన్నికలను విదేశీశక్తులు...

బెంజమీన్‌ బాధ..!

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో బెంజమీన్‌ నెతన్యాహూకు మెజారిటీ స్థానాలు దక్కివుంటే ఒక భయంకరమైన నిజం ప్రపంచానికి తెలియకుండాపోయేది. ఇజ్రాయెల్‌ ఎన్నికలను విదేశీశక్తులు తస్కరించాయని, సదరుశక్తుల కారణంగా ఎన్నికల ఫలితాలు తారుమారైన సత్యం శాశ్వతంగా మరుగునపడిపోయేది. ఇప్పుడాయన ఆ నిజాన్ని బట్టబయలు చేశాడు కనుక, అరబ్‌ పార్టీలూ ఓటర్లకు ఖతార్‌నుంచి దండిగా సొమ్ము అందిందన్న సంగతి నిగ్గుతేల్చడానికి ఎన్నికల సంఘం అధినేత ఆదేశాల మేరకు ఇజ్రాయెలీ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ షిన్‌బెట్‌ రంగంలోకి దిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన కనీస స్థానాలు నెగ్గలేనప్పుడు బెంజమీన్‌ ఈ తరహా ఆరోపణలకు సిద్ధంగా ఉంటారనీ, తిమ్మినిబమ్మిని చేయగల వ్యూహాలు పన్నుతారని ఊహించిందే.

ఇజ్రాయెల్‌ చరిత్రలోనే అరబ్‌పార్టీలు అత్యధిక స్థానాలు గెలుచుకున్నందున నెతన్యాహూ కడుపుడికిపోవడం సహజం. ప్రజాస్వామ్యంమీద దాడి జరిగిందని, తమ కూటమిని కుప్పకూల్చి, పార్లమెంట్‌ను విదేశీయులు స్వాధీనం చేసుకొని, ఇజ్రాయెల్‌ను ఇస్లామీకరించడానికీ, ఇరాన్‌లో ఐడీఎఫ్‌ను ఓడించడానికీ ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన వాపోతున్నారు. యూదురాజ్య నిర్మూలనకు సహకరిస్తున్న అరబ్‌పార్టీల తెరవెనుక కుట్రలకు సంబంధించిన ఆధారాలు తాము షిన్‌బెట్‌కు అందిస్తున్నట్టు చెప్పుకొచ్చారాయన. 1999 తరువాత ఇజ్రాయెల్‌లో అత్యధిక పోలింగ్‌శాతం నమోదుకావడం, ఇజ్రాయెలీ అరబ్బులు గణనీయంగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్‌శాతం 80వరకూ చేరడం లికుడ్‌పార్టీకి ఆగ్రహం కలిగిస్తోంది. దశాబ్దకాలం తరువాత అరబ్బులు ఈ ఎన్నికల్లో పట్టుదలగా ఓటుచేయడంతో లికుడ్‌ జాతకం తారుమారైంది. అరబ్‌పార్టీలతో తన ప్రత్యర్థి చేయికలపకుండా నిరోధించేందుకే నెతన్యాహూ ఈ ఓటుకు నోటు సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చారు.

ఇజ్రాయెల్‌ జనాభాలో ఐదోవంతు ఉన్న పాలస్తీనియన్లు ఈ మారు ఎన్నికలకు దూరంగా ఉండిపోకుండా, ఉధృతంగా పాల్గొని నెతన్యాహూ దూకుడుకు అడ్డుకట్టవేయగలిగారు. 19 స్థానాలు గెలుచుకోగలవంటున్న అరబ్‌పార్టీలు ప్రభుత్వం ఏర్పాటులో కీలకభూమిక నిర్వహించడానికి ఉత్సాహపడుతున్నా, నెతన్యాహూ ప్రత్యర్థి ఐసెన్‌కోట్‌ కూడా వాటితో పొత్తుకు నిరాకరిస్తున్నారు. తెరవెనుక చర్చలు సాగుతున్నట్టుగా వార్తలు వస్తున్నా, ఒకవేళ అరబ్బులతో చేయికలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగినా ఆ కూటమి ఎక్కువకాలం మనలేదు. హమాస్‌దాడులు, గాజావిధ్వంసం, లెబనాన్‌, ఇరాన్‌తో యుద్ధం ఇత్యాది పరిణామాల నేపథ్యంలో జరిగిన ఎన్నికలు కనుక, ఇజ్రాయెల్‌ ప్రజలు వీటిని దేశచరిత్రలో అత్యంత కీలకమైనవిగా భావించారన్నది నిస్సందేహం. దేశానికి నాయకత్వం వహించడానికి నెతన్యాహూ అర్హతను నిర్ణయించడంతోపాటు, ఇజ్రాయెల్‌ విధానాలు, మత జాతీయవాదాలను నిగ్గుతేల్చేవి కూడా. 2023అక్టోబర్‌ 7 దాడులను నివారించడంలో భద్రతావైఫల్యాలు, నెతన్యాహూ ప్రతిపాదిత న్యాయసంస్కరణలు కూడా ఓటర్ల నిర్ణయంమీద పనిచేశాయి. ఎన్నియుద్ధాలు చేసినా, అమెరికా అండదండలు దండిగా ఉన్నా నెతన్యాహూ గట్టెక్కలేకపోవడం విచిత్రం, విశేషం.


20ఏళ్ళపాటు దేశాన్ని ఏదో ఒక హోదాలో ఏలిన నెతన్యాహూకు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడం అవసరం కనుక, ఐసెన్‌కోట్‌ కూటమినుంచి మద్దతు సంపాదించి, అధికారానికి అంటిపెట్టుకొని ఉండవచ్చు. అలా కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా, ఐసెన్‌కోట్‌ కూటమి కూడా అరబ్‌పార్టీలను దూరంపెట్టి ప్రభుత్వం ఏర్పాటుకాదనుకున్నా ఇజ్రాయెల్‌లో మళ్ళీ ఎన్నికలు తప్పవు.

గాజాలో నెతన్యాహూ మారణకాండ, దాని పునర్నిర్మాణం, వెస్ట్‌బ్యాంక్‌లో దురాక్రమణలు, ఇరాన్‌తో యుద్ధం ఇత్యాది అంశాలు ఐసెన్‌కోట్‌ కూటమిని వెంటాడుతూనే ఉంటాయి కనుక అది ఒకవేళ ఏర్పడినా సవాలక్ష విభేదాల మధ్య ఎక్కువకాలం మనలేదు. నెతన్యాహూకోసం ఓ డెబ్బైవేలమంది యూదులు స్వదేశంవచ్చి ఓటుచేశారన్న వార్తలు నిజమైనపక్షంలో మళ్ళీ ఎన్నికలు కనుక జరిగితే ఇన్ని ఓట్లూ సీట్లూ వస్తాయన్న నమ్మకం కూడా లేదు. ఇంతటి భారీ ఓటింగ్‌, రెట్టింపు స్థానాలు ఇచ్చినా కూడా అరబ్‌పార్టీలు ఏ మార్పూ సాధించలేనందున ఇజ్రాయెలీ అరబ్బులు సైతం మళ్ళీ వచ్చిపడిన ఆ ఎన్నికల్లో అంత ఉధృతంగా ఓటుచేయకపోవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!

ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు

Updated Date - Oct 30 , 2026 | 04:25 AM