విశ్వాసానికి విపత్తు
ABN , Publish Date - Jun 26 , 2026 | 02:01 AM
‘రాముడిని తెచ్చినవారినే అధికారంలోకి తెస్తాం’ (జో రామ్‌కో లాయే హై, హమ్ ఉన్‌కో లాయేంగే)’ అనే శక్తిమంతమైన నినాదాన్ని సృష్టించి, రాజకీయంగా ఎంతో లబ్ధిపొందిన పార్టీకి అయోధ్య రామమందిరం విరాళాల చోరీ...
‘రాముడిని తెచ్చినవారినే అధికారంలోకి తెస్తాం’ (జో రామ్‌కో లాయే హై, హమ్ ఉన్‌కో లాయేంగే)’ అనే శక్తిమంతమైన నినాదాన్ని సృష్టించి, రాజకీయంగా ఎంతో లబ్ధిపొందిన పార్టీకి అయోధ్య రామమందిరం విరాళాల చోరీ వివాదం పెద్ద ఎదురుదెబ్బ. ఎంతో జాప్యం తరువాత, రంగంలోకి దిగిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రస్తుతం నష్టాన్ని పూడ్చుకొనే ప్రయత్నాలు చేస్తోంది. యూపీ ప్రభుత్వం నియమించిన సిట్‌ను విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్న తరుణంలో, మంగళవారం అది సమర్పించిన మధ్యంతర నివేదిక ఆధారంగా గురువారం పలువురిమీద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సిట్ విచారణలో అంతిమంగా ఏమి తేలినప్పటికీ, పాపులెవ్వరో అది నిగ్గుతేల్చినప్పటికీ, వచ్చే ఏడాది ఎన్నికలకు పోబోతున్న యోగి ప్రభుత్వానికి ఈ పరిణామాలు ఎంతోకొంత నష్టం చేకూర్చకతప్పదు.
విపక్షపార్టీలే కాదు, రాజకీయాలతో సంబంధంలేనివారూ, పీఠాధిపతులు సైతం విరాళాల చౌర్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మొదట్లో నోరుమెదపడానికి సందేహించినా, ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా విధిలేక దాని గురించే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇది కేవలం చోరీ కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువుల విశ్వాసానికి సంబంధించినదని, నిజాయితీగా దర్యాప్తు జరిపించి, ఎంతటివారినైనా వదిలిపెట్టకూడదని వారూ అంటున్నారు. నిప్పులేనిదే పొగరాదు కదా, సీబీఐతో దర్యాప్తు చేయిస్తేనే నిజంనిగ్గుతేలుతుందని మరికొందరు అంటున్నారు. అయోధ్యకు చెందిన సన్యాసులు, పీఠాధిపతులు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని వారి కఠిన వ్యాఖ్యలు తెలియచెబుతున్నాయి. దేశవిదేశాలనుంచి సేకరించిన నగదు, బంగారం, వెండి, విలువైన రాళ్ళు, ఆభరణాలు ట్రస్టు పెద్దలు పెద్ద ఎత్తున మాయం చేశారంటూ ఎవరికి తోచిన లెక్కలు వారు మీడియాతో చెబుతున్నారు.
బీజేపీ రాజకీయ విజయం వెనుక రామమందిరం ఉన్నది కనుక, ఆలయానికి సంబంధించిన ఏ చిన్న వివాదమైనా ఆ పార్టీకి తగలడం సహజం. ఇప్పుడు ఏకంగా వందలాది కోట్ల రూపాయల నగదు, కేజీల కొద్దీ బంగారం, వెండి, విదేశాలనుంచి విరాళంగా వచ్చిన అత్యంత విలువైన రాళ్ళు, కొన్ని చిన్న విగ్రహాలు కనిపించకుండా పోవడం చిన్న సమస్యేమీ కాదు. రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, వాటిలో ఉన్నదానికీ కనిపించకుండా పోయినదానికీ మధ్య హస్తిమశకాంతరం ఉండటం, అసలు రికార్డులకే ఎక్కని నగదు, ఆభరణాల పరిమాణం గణనీయంగా ఉండటం, మహాకుంభమేళా సందర్భంగా రెండునెలల పాటు రోజూ హుండీల నిండుగా పొంగిప్రవహించిన నగదు లెక్కల్లోనూ పొంతనలేకపోవడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నదన్న అనుమానాలు హెచ్చుతున్నకొద్దీ అసత్యప్రచారాల తీవ్రత పెరిగిపోతుంది. సిట్ మధ్యంతర నివేదికలో పూర్తిగా ఏమున్నదో ఎవరికీ తెలియదు. దానిని బయటపెట్టి యోగిప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలని పలువురి డిమాండ్. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విరాళాల మాయమీద దర్యాప్తు జరగాలంటూ కొందరు తక్షణ విచారణకోసం సుప్రీంకోర్టుకు పోతే, 29న అభ్యర్థన స్వీకరిస్తానని న్యాయస్థానం హామీ ఇచ్చింది. ఆలోగానే యోగి ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కోర్టులో ఈ అంశంపై అధికచర్చకు తావులేకుండా జాగ్రత్తపడింది. ఈ గోల్‌మాల్ ఖరీదు వేలకోట్లా, వందలకోట్లా అన్నది అటుంచితే, తాను భక్తితో సమర్పించిన ప్రతీ రూపాయీ భగవంతుడికే చెందాలని ప్రతీ భక్తుడూ కోరుకుంటాడు. కొవిడ్‌కాలంలో ఎంతో శ్రమకోర్చి రెండువందల వెండి ఇటుకలు తయారుచేయించి ట్రస్టుకు సమర్పిస్తే, వాటి నాణ్యతను పరీక్షించి రసీదు ఇస్తామని చెప్పి, తరువాత ఆ ఊసే ఎత్తలేదని, ఇప్పుడు అవి మాయమైనాయని పూనేకు చెందిన సింధీసంఘం వాపోతోంది. ఆలయంకోసం ఐదువందల సంవత్సరాలు నిరీక్షించినవారు సిట్ దర్యాప్తు ముగిసేవరకూ ఓపికపట్టలేరా? అని యోగి ప్రశ్నిస్తున్నారు. ఓ అరడజనుమంది కిందిస్థాయి ఉద్యోగులను బలిపశువులను చేయడం కాక, సిట్ నివేదికలో ఏమున్నదో బహిర్గతపరచి, ట్రస్టు రికార్డులను ప్రజాక్షేత్రంలో ఉంచి, స్వతంత్ర ఆడిటింగ్ ద్వారా నిజాలు నిగ్గుతేల్చాలి. ఆలయపవిత్రతను, భక్తుల నమ్మకాన్ని నిలబెట్టాలి.
ఈ వార్తలనూ చదవండి:
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీ విచారం
వెలుగులోకి సంచలన విషయాలు.. హత్య ఎలా చేయాలో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి..