మనమెక్కడ..?
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:49 AM
పక్షం రోజులపాటు ఆసియా ఖండాన్ని ఉర్రూతలూగించిన ఆటల పండుగకు తెరపడింది. మిరుమిట్లుగొలిపే బాణాసంచా వెలుగులతో, సంబరాలు అంబరాన్ని...
పక్షం రోజులపాటు ఆసియా ఖండాన్ని ఉర్రూతలూగించిన ఆటల పండుగకు తెరపడింది. మిరుమిట్లుగొలిపే బాణాసంచా వెలుగులతో, సంబరాలు అంబరాన్ని తాకేలా ముగింపోత్సవాన్ని జపాన్‌లోని నగోయ నగరం ఘనంగా నిర్వహించింది. జపాన్ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తూ.. ఒకటే ఆసియా అన్న నినాదాన్ని చాటి చెప్పింది.
ఈ క్రీడా మహోత్సవం ముగిశాక మన ప్రతిభాపాటవాలు ఎలా ఉన్నాయని సమీక్షించుకుంటే ఒకింత నిరాశ కలగక మానదు. మూడేళ్ల క్రితం చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియాడ్ విజయంతో పోల్చుకుంటే ఈ ప్రదర్శన పేలవమే. గత క్రీడల్లో 107 పతకాలతో సెంచరీ కొట్టిన మన క్రీడాకారులు.. ఈసారి అంతకంటే తక్కువగా 85 పతకాలతోనే సరిపెట్టుకోవడం క్రీడాభిమానులను బాధించింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో పతకాల పట్టికలో నాలుగో స్థానానికి పరిమితమయ్యాం. చైనా ఏకంగా 169 స్వర్ణాలు సహా 341 పతకాలతో అగ్రస్థానంతో తన ఆధిపత్యాన్ని చాటుకోగా.. ఆతిథ్యమిచ్చిన జపాన్ 83 స్వర్ణాలతో కలిపి 269 పతకాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దక్షిణ కొరియా 150 పతకాలతో నిలిచింది. గత కొన్నేళ్లుగా ఈ మూడు దేశాలే మొదటి మూడు స్థానాల్లో ఉంటూండడం గమనార్హం.
ఈ మారు క్రీడల్లో మనం వంద మార్కును చేరలేకపోవడానికి ప్రధాన కారణం అథ్లెటిక్స్, షూటింగ్, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో వైఫల్యం. గత క్రీడల్లో అథ్లెటిక్స్‌లో భారత్ ఆరు పసిడి పతకాలు సాధిస్తే, తాజా క్రీడల్లో కేవలం ఒకే స్వర్ణానికే పరిమితమయ్యాం. 30 మందితో జపాన్ వెళ్లిన మన షూటర్ల బృందం మూడు స్వర్ణాలు సహా పదిహేను పతకాలతోనే సరిపెట్టుకుంది. బ్యాడ్మింటన్‌లో భారీ అంచనాలున్న తెలుగు షట్లర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్‌తో పాటు లక్ష్యసేన్‌లాంటి స్టార్లు జపాన్‌లో తేలిపోయారు. బ్యాడ్మింటన్ బృందం ఈసారి టీమ్ విభాగంలో ఒక్క కాంస్యంతోనే స్వదేశానికి చేరుకుంది. నాలుగు దశాబ్దాలుగా కనీసం ఒక పతకమైనా అందుకుంటున్న టెన్నిస్ క్రీడాకారులు ఈసారి రిక్తహస్తాలతో వెనుదిరిగారు. ఆర్చరీలో మాత్రం మనోళ్లు అంచనాలను నిలబెట్టుకుంటూ తొమ్మిది పతకాలతో మెరిశారు. ప్రధానంగా తెలంగాణ అమ్మాయి చికిత, ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు జ్యోతి సురేఖ, ధీరజ్, గణేశ్ మణిరత్నం మెరుగైన ప్రదర్శన కనబరచారు. కబడ్డీ, హాకీ, క్రికెట్‌లలో అమ్మాయిలు, అబ్బాయిలు చాంపియన్లుగా నిలవడంతో భారత్ పతకాల ఖాతా విస్తరించింది. స్వర్ణాలు నెగ్గడంతో హాకీ జట్లకు 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌కు బెర్త్‌లు ఖరారవడం హర్షించదగ్గ పరిణామం. ఇక పతకాలు సాధించిన మన అథ్లెట్లలో ఒక్కొక్కరిది భిన్నమైన నేపథ్యం. వీరిలో చాలామంది పేదరికం నుంచి వచ్చినవారే. అనేక కష్టాలు, కన్నీళ్లను దిగమింగుతూనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న వీరి ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే.
మన క్రీడాకారుల సామర్ధ్యం ప్రశంసించదగినదే. సందేహం లేదు.. కానీ మొత్తంగా మన స్థానం ఎక్కడని ప్రశ్నించుకోవాలి. ప్రతిసారీ చైనాతో పోల్చుకోకున్నా.. జపాన్, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్థాన్, ఇరాన్, థాయ్‌లాండ్‌లాంటి దేశాలతో పోల్చి చూసుకుంటే ఒక రకంగా మనం చిన్నబోయినట్టే. క్రీడలకు అంతంత మాత్రమే ఆదరణ కలిగిన ఇరాన్ కూడా 19 స్వర్ణాలతో సత్తా చాటడం చూస్తే, మన ప్రదర్శన ఇంకా మెరుగవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత అత్యున్నత క్రీడా సంగ్రామం ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వాలని భారత్ పట్టుదలగా ఉంది. ఆలోపు దేశంలో క్రీడా సంస్కృతిని మరింత పెంపొందించి నెంబర్‌వన్ కావాలన్న కృత నిశ్చయంతో ఉన్నామన్న కేంద్రం.. అందుకు తగ్గ ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించాలి. ప్రతిభావంతులను గుర్తించడమే కాదు.. వారిని అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దేలా కృషి చేయాలి. అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇప్పించాలి. ఈసారి ఆసియాడ్ పోటీల సన్నాహకాల కోసం భారత క్రీడాకారులపై కేంద్ర ప్రభుత్వం రూ. 700 కోట్లకు పైగా వెచ్చించింది. కానీ ఇది సరిపోవడం లేదు. ఆసియాడ్‌లో కన్నా ఒలింపిక్స్‌లో పోటీ ఎక్కువగా ఉంటుంది. మరో రెండేళ్లలో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుంటూనే, తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాలి. అప్పుడే విశ్వ క్రీడారంగాన మన కీర్తిపతాక సగర్వంగా నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..