బర్న్‌హామ్ భరోసా..!
ABN , Publish Date - Jul 24 , 2026 | 01:29 AM
బ్రిటన్ ప్రధానిగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆండీ బర్న్‌హామ్, వెంటనే అమెరికా అధ్యక్షుడి మనసు గెలుచుకున్నారు. ఇరాన్‌మీద డోనాల్డ్ ట్రంప్ సాగిస్తున్న యుద్ధానికి బ్రిటన్ సైనికస్థావరాలను...
బ్రిటన్ ప్రధానిగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆండీ బర్న్‌హామ్, వెంటనే అమెరికా అధ్యక్షుడి మనసు గెలుచుకున్నారు. ఇరాన్‌మీద డోనాల్డ్ ట్రంప్ సాగిస్తున్న యుద్ధానికి బ్రిటన్ సైనికస్థావరాలను వినియోగించుకొనేందుకు ఆండీ అనుమతించారు. ఇది గత ప్రధాని స్టార్మర్ విధానానికి కొనసాగింపుగా చెబుతున్నప్పటికీ, అప్పుడు ఉన్నన్ని ఆంక్షలు, నియంత్రణలు ఇకపై ఉండవని మీడియా విశ్లేషిస్తోంది. ట్రంప్ నేతృత్వంలో అమెరికా విషపూరితంగా తయారైందని, ఆయన బ్రిటన్ వస్తే మొఖం కూడా చూడననీ మాంచెస్టర్ మేయర్‌గా ఉన్నప్పుడు భీషణ ప్రతిజ్ఞలు చేసిన బర్న్‌హామ్, ప్రధానిగా ప్రమాణం చేసిన వెంటనే ట్రంప్‌ను బ్రిటన్ సందర్శించవలసిందిగా ఆహ్వానించారు కూడా. బ్రిటన్‌కు చేయగలిగినంతా చేస్తానని, అడిగినవన్నీ ఇస్తానని, ఇరాన్ మీద సాగిస్తున్న పోరాటంలో బ్రిటన్ చేయూత తనకు ఎంతో అవసరమని ట్రంప్ స్పష్టంచేశారట. బ్రిటన్‌లోని కొన్ని పార్టీల నుంచీ, తన పార్టీలోనే కొందరినుంచీ వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఇరాన్ మీద యుద్ధంలో ట్రంప్‌కు సాయపడాలనే కొత్త ప్రధాని నిర్ణయించుకున్నారు.
ట్రంప్ తిరిగి ఇరాన్‌మీద ఆరంభించిన యుద్ధం ఉచ్ఛస్థితిలో ఉన్నందున, అమెరికాకు అవసరమైన డీగోగార్షియా, ఫెయిర్‌ఫోర్డ్ ఇత్యాది స్థావరాలను స్వేచ్ఛగా వినియోగించుకోనివ్వడం అవసరమని బ్రిటన్ కొత్తప్రధాని భావించివుంటారు. ఇరాన్‌మీద రాత్రీ పగలూ తేడాలేకుండా యుద్ధం చేయడానికీ, అన్ని మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి ట్రంప్ సంకల్పించిన దశలో ఈ సాయం బ్రిటన్‌కు చెడ్డపేరు తెస్తుందన్న భయం మిగతా నాయకుల మాదిరిగానే కొత్త ప్రధానికీ ఉండేవుంటుంది. కానీ, హోర్ముజ్ జలసంధి మీదుగా అన్ని నౌకలూ స్వేచ్ఛగా పయనించగలిగే వాతావరణంకోసం బ్రిటన్ కట్టుబడివుందన్న పేరిట ట్రంప్‌కు సాయపడి, సయోధ్య సాధించాలని ఆండీ నిర్ణయించుకున్నారు. చమురు సంక్షోభం నుంచి ద్వైపాక్షిక వాణిజ్యం వరకూ చాలా విషయాలు మాట్లాడుకున్నామంటూ ఆండీని ట్రంప్ మెచ్చుకున్నారు కూడా.
పబ్బులు, క్లబ్బులు బ్రిటన్ సంస్కృతిలో భాగమంటూ కొత్తప్రధాని వాటికి ఇప్పటికే ఉన్న పదిహేనుశాతం తగ్గింపునకు అదనంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌నుంచి మరిన్ని పన్నుమినహాయింపులు ప్రకటించారు. ఈ తగ్గింపువల్ల ప్రభుత్వ ఖజానాకు వంద మిలియన్ పౌండ్ల ఆదాయం పడిపోతుంది. బ్రిటన్‌లో పలురకాల వ్యాపారాలు దెబ్బతిని ఉన్నందున వాటన్నింటినీ ఆదుకొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆండీ ప్రకటించారు, చర్యలు కూడా మొదలైనాయి. విద్యుత్ బిల్లులపై వ్యాట్ ఎత్తివేత, బస్ టికెట్‌రేట్లపై పరిమితులు, అద్దెలపై మారటోరియం వంటివి ఆయన ప్రకటించాడు. సరిగ్గా పదేళ్ళలో ఏడవ ప్రధానిగా వచ్చిన ఆండీ తనకు దేశం ఎదుర్కొటున్న సమస్యలన్నింటిపైనా పూర్తి అవగాహన ఉన్నదని గట్టిగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యయం పెంచడానికి వీలుగా అధికాదాయవర్గాలమీద పన్నును స్వల్పంగా హెచ్చిస్తానని, వారు తనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. సంక్షేమ పథకాలకోసం ఎక్కువ ఖర్చుపెడితే బ్రిటన్ మరింత కుదేలవడం ఖాయమని ఐఎంఎఫ్ ఇటీవల ఈయనను దృష్టిలో పెట్టుకొనే హెచ్చరించినట్టు ఉంది.
2024 ఎన్నికల్లో లేబర్ పార్టీని ఘనంగా గెలిపించి, ప్రధాని అయిన కీర్ స్టార్మర్ రెండేళ్ళలోనే దిగిపోవాల్సి వచ్చింది. స్టార్మర్‌తో పోలిస్తే ఈయనకు వివిధ రంగాలపై అవగాహన తక్కువేనని అంటారు. అయితే, కీలక పరిశ్రమలు ప్రభుత్వం చేతిలో ఉండాలని, సంక్షేమంతో ముడిపడినవన్నీ ప్రభుత్వ పెత్తనంలోకి రావాలని, అధికారాల వికేంద్రీకరణతో ప్రాంతీయ ప్రభుత్వాలు మరింత బలపడాలన్న వాదనలతో ఆయన ప్రజల్లో మంచి పేరే సంపాదించుకున్నారు. ఉత్తరఇంగ్లాండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా బస్సు రవాణాను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తేవడం సహా ఆయన నిర్ణయాలనేకం ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. ఇప్పుడు టెన్, డౌనింగ్‌స్ట్రీట్‌లోకి అడుగుపెట్టిన ఆయన బ్రెగ్జిట్ దెబ్బనుంచి ఇంకా కోలుకోలేకపోతున్న బ్రిటన్‌ను తిరిగి పట్టాలెక్కించి, పరుగులు తీయించగల పదేళ్ళఎజెండా తనవద్ద ఉన్నదంటున్నారు. ఇది రాబోయే నలభైఏళ్ళలో బ్రిటన్‌ను సమూలంగా మార్చివేస్తుందని, ఆర్థికంగా నిలబెట్టి, రాజకీయ స్థిరత్వాన్ని ప్రసాదిస్తుందని హామీ ఇస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు