‘భరోసా’ భయాలు..!
ABN , Publish Date - May 26 , 2026 | 03:00 AM
భారత్ తన ఇంధన భద్రత గురించి భయపడనక్కరలేదు, ఎంత చమురు కొనాలనుకుంటే అంతా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ అమెరికా విదేశాంగమంత్రి మార్క్ రూబియో చేసిన...
భారత్ తన ఇంధన భద్రత గురించి భయపడనక్కరలేదు, ఎంత చమురు కొనాలనుకుంటే అంతా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ అమెరికా విదేశాంగమంత్రి మార్క్ రూబియో చేసిన వ్యాఖ్యలో, భరోసా కంటే బెదిరింపే ఎక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. రెండుదేశాల మధ్యా ఇంధన సహకారమే తన పర్యటనలో అత్యంత కీలకాంశమని ఆయన ముందే చెప్పివచ్చారు. తాము అమెరికా రికార్డుస్థాయిలో చమురు ఉత్పత్తి, ఎగుమతులు చేస్తున్నదని గుర్తుచేయడంతోపాటు, భారతదేశ ఇంధన దిగుమతుల్లో సింహభాగం తమదే కావాలని కూడా స్పష్టంచేశారు. తమతోపాటు, వెనెజువెలాకు కూడా అధికవాటా దక్కాలని కోరడమే కాక, ఆ దేశాధ్యక్షురాలు భారత్‌లో పర్యటించబోతున్న తరుణంలో, ఉభయదేశాలూ కలసి ముందుకు సాగాలన్నారు. డెల్సీ రోడ్రిగ్స్ పర్యటనను అటు వెనెజువెలా కానీ, ఇటు భారతదేశం కానీ ప్రకటించకుండా రూబియో నిర్ణయించడమేమిటని ప్రశ్నించిన కాంగ్రెస్, గత ఏడాది మే 10వతేదీ సాయంత్రం ఐదున్నరగంటలకు ఆపరేషన్ సిందూర్ నిలిపివేసినట్టుగా భారతప్రభుత్వం కంటే ముందు ఈయనే చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. భారతదేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ముందుగా అమెరికాలో జరుగుతున్నాయా? అని కాంగ్రెస్ ప్రశ్న.
చమురు లోటు తీవ్రంగా ఎదుర్కొంటున్న భారతదేశం తన దిగుమతుల జాబితాలో అమెరికా, వెనెజువెలాలను ప్రథమస్థానాల్లో నిలుపుకొని భారీగా కొనుగోళ్ళు జరపాలన్నది రూబియో మాటల సారాంశం. తాము ఆరంభించిన ఇరాన్ యుద్ధంతో భారత్‌లో ఏర్పడిన చమురు సంక్షోభాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అమెరికాయే చెబుతోంది. వెనెజువెలా చమురుమీద ఆంక్షలతో భారత్‌ను గతంలో బెదిరించి, దిగుమతులకు మోకాలడ్డిన అమెరికా, ఇప్పుడు తానే స్వయంగా సేల్స్‌మ్యాన్ పాత్ర పోషిస్తోంది. జనవరిలో ఒక అర్థరాత్రి కుట్రలో నికోలస్ మదురోను ఎత్తుకుపోయి, ఆ స్థానంలో నమ్మినబంటును ప్రతిష్ఠించుకున్నాక, వెనెజువెలా చమురును అమెరికన్ కంపెనీలే ‘డ్రిల్ బేబీ డ్రిల్’ అని ఆడుతూ పాడుతూ తవ్వుకుంటున్నాయి, అమ్ముకుంటున్నాయి. అప్పటివరకూ ఈ పాపిష్ఠి చమురుమీద ఉన్న ఆంక్షలన్నీ ఒక్కసారిగా తొలగి, పెత్తనం అమెరికా చేతిలోకి పోయింది. పేరుకు మరోదేశమైనా సర్వాధికారం అమెరికాదే కనుక, ఆ కంపెనీల, వాటి లాభాల పరిరక్షణ ప్రధానం. ఇప్పటికే అమెరికా ఆంక్షలు, హెచ్చరికల దెబ్బకు రష్యా చమురు వెనుకపట్టుపట్టి మన దిగుమతుల్లో వెనెజువెలా ముందుకు వచ్చింది. మొన్నటివరకూ ఒక్కచుక్కా కొనుగోలుచేయని వెనెజువెలానుంచి రెండునెలలుగా భారీ దిగుమతులు సాగుతున్నాయి. రష్యానుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు రెట్టింపు సుంకాలతో మనను శిక్షించిన అమెరికా, ఆ తరువాత తాను ఆరంభించిన ఇరాన్ యుద్ధం కారణంగా తానే రష్యానుంచి కొనుగోళ్ళకు అనుమతులు ఇచ్చి, ఈ నెలలో మళ్ళీ తలుపులు మూసివేసింది. రష్యా బదులు వెనెజువెలా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు చెప్పిన ప్రకారంగానే అంతా జరుగుతోంది. రూబియో మార్గనిర్దేశనం ప్రకారం నడుచుకుంటే రేపటిరోజుల్లో అమెరికా, వెనెజువెలాలే మన ఇంధనభద్రతను నిర్ణయిస్తాయి.
ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారతదేశం ఇంధనం కోసం ఏటా రమారమి 175 బిలియన్ డాలర్ల ధనం ఖర్చుచేస్తున్నది. పెట్రోడాలర్ ఆధిపత్యానికి వివిధ దేశాలు, కూటములనుంచి సవాళ్ళు ఎదురవుతున్న నేపథ్యంలో, మిత్రదేశమైన భారత్‌ను నియంత్రించడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్‌కు కాస్తంత మిగులు కూడా ఉన్నందున, భారత ఇంధన సరఫరాలను తన నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తోంది. ఘర్షణపడే ఉద్దేశం లేదని అంటూనే అమెరికా తాను చేయదల్చుకున్నది చేస్తోంది. ట్రంప్ విధానాలు కేవలం భారత్‌ను ఉద్దేశించినవి కావని అంటున్నప్పటికీ, ట్రంప్ మలిరాకడ తరువాత భారత్‌కు అన్నిరంగాల్లోనూ ఒనగూరిన నష్టం అపారమైనది. రష్యన్ చమురుమీద ఆంక్షలు, ప్రతీకార సుంకాలతో భారత ఎగుమతులను దెబ్బతీయడం, గ్రీన్ కార్డు, వీసా నియంత్రణలు, పాకిస్థాన్ ప్రాధాన్యం పెరగడం వంటి పరిణామాలు రూబియో ఎంత కాదన్నా నిజాలు కాకపోవు. ఐదువందల బిలియన్ డాలర్లు విలువచేసే అమెరికన్ ఉత్పత్తుల కొనుగోలుకు సరేననేంతవరకూ ట్రంప్ ప్రభుత్వం భారత్‌ను వదిలిపెట్టలేదు. మోదీ ఓ అద్భుతవ్యక్తి, ఆప్తమిత్రుడు అంటూనే ఖరీదైన అమెరికా, వెనెజువెలా చమురు భారత్‌కు అంటించేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
రాష్టప్రతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం
కశ్మీర్ గుల్మార్గ్‌లో ఆగిన కేబుల్ కార్లు.. గాల్లోనే 300 మంది.. వీడియో వైరల్