‘గీతా’వాక్యం...!
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:17 AM
మరో రెండేళ్ళలో భారతదేశం మూడవ ఆర్థికశక్తిగా అవతరిస్తుందంటూ సుప్రసిద్ధ ఆర్థికవేత్త గీతాగోపీనాథ్ డావోస్‌లో చేసిన వ్యాఖ్య మన నాయకులకు శ్రవణానందకరంగా...
మరో రెండేళ్ళలో భారతదేశం మూడవ ఆర్థికశక్తిగా అవతరిస్తుందంటూ సుప్రసిద్ధ ఆర్థికవేత్త గీతాగోపీనాథ్ డావోస్‌లో చేసిన వ్యాఖ్య మన నాయకులకు శ్రవణానందకరంగా ఉంది కానీ, వాయు కాలుష్యంతో లక్షలాదిమంది చనిపోవడం సరికాదని, దానిని నియంత్రించడం దేశం ప్రథమ లక్ష్యం కావాలన్న ఆమె హితవు మాత్రం రుచించడం లేదు. భారతదేశ ఎదుగుదలకు, దాని ఆర్థికవ్యవస్థకు అమెరికా అధ్యక్షుడు విధించే టారిఫ్‌లకంటే కాలుష్యం అతిపెద్ద సవాలని ఆమె తేల్చేశారు. వాయు కాలుష్యం పలురకాలుగా దేశానికి కీడు చేస్తున్నదంటూ దాని ఆర్థిక, ప్రాణ నష్టాన్ని ఆమె ఇటీవల విశ్లేషించిన సంగతి తెలిసిందే. దేశంలో ఏటా సంభవించే మరణాల్లో దాదాపు ఐదోవంతు కాలుష్యం వల్లనేనని, విదేశీ పెట్టుబడులను ప్రభావితం చేసే స్థాయికి దేశంలో కాలుష్యం పెరిగిపోయిందని ఐఎంఎఫ్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ హెచ్చరిస్తున్నారు. కాలుష్యం వల్ల ఏటా పదిహేడు లక్షలమంది కన్నుమూస్తున్నారన్న ఆమె వ్యాఖ్యకు ఆధారాలు లేవని కొందరు దీర్ఘాలు తీస్తున్నప్పటికీ, ప్రపంచబ్యాంకు డేటాతో ఆమె చేసిన ఈ విశ్లేషణ ఒకందుకు మనకు మంచిదే.
కాలుష్యాన్ని అతి ప్రమాదకరమైన, సత్వరమే ఎదుర్కోవాల్సిన అంశంగా భావించని పాలకులకు సరైన సమయంలో చేసిన హెచ్చరిక ఇది. గీతా గోపీనాథ్ వంటి ఆర్థికవేత్త నోట కాలుష్యం మాట వెలువడటానికి కారణం కూడా జీడీపీలు, పెట్టుబడులే అయినప్పటికీ మరక మంచిదే. ఢిల్లీలో కాలుష్యం నాలుగువందల స్థాయిని అందుకున్న సందర్భంలో అనేకమంది అనాది ఆవేదన డావోస్‌లో ఆమెనోట ప్రతిధ్వనించింది. లాన్సెట్ నివేదిక సహా అనేక అధ్యయనాలు భారతదేశం తీవ్ర కాలుష్యంతో సతమతమవుతోందని చెప్పడంతోపాటు, ఈ పదిహేడు లక్షల సంఖ్యను కూడా ప్రస్తావించాయి. వాయుకాలుష్యం కారణంగా ఆయుష్షుతీరకుండా సంభవించే మరణాలవల్ల దేశానికి కలిగే ఆర్థిక నష్టాన్ని 339 బిలియన్ డాలర్లుగా అవి లెక్కవేశాయి. గ్రీన్‌పీస్ వంటి సంస్థలు కూడా వివిధ రీతుల్లో నష్టాలను అంచనాకట్టాయి. గత పాతికేళ్ళలో కాలుష్యాన్ని సగం నియంత్రించగలిగినా భారతదేశం మరో నాలుగున్నరశాతం అధిక జీడీపీని సాధించివుండేదని 2023లో ప్రపంచబ్యాంకు ఒక ఆశ్చర్యకరమైన వ్యాఖ్య కూడా చేసింది.
ముంబై మహానగరాన్ని కాలుష్యంనుంచి రక్షించాలంటున్న ఒక కేసులో మంగళవారం హైకోర్టులో గీతాగోపీనాథ్ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా, నావీముంబై, బృహన్‌ముంబై నగరపాలక సంస్థలు చర్యలు చేపట్టడం లేదంటూ అమికస్ క్యూరీగా ఉన్న డేరియస్ ఖంబాటా వాదిస్తూ, ఈ సంస్థల నిర్లక్ష్యం కారణంగా సంభవిస్తున్న ఆర్థిక, ప్రాణనష్టాన్ని లెక్కగట్టి తదనుగుణంగా అధికారులకు శిక్షలు విధించాలని ఓ ప్రతిపాదన చేశారు. చర్యలు చేపట్టని పక్షంలో జీతాల్లో కోత విధిస్తామంటూ కమిషనర్‌లకు ఇటీవలే హైకోర్టు హెచ్చరికలు సైతం చేసింది. అయినప్పటికీ, వారు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని, ప్రజల ప్రాణాలతో ముడివడిన ఈ అత్యంత ప్రధానమైన అంశంలో సైతం వ్యవస్థలు, వ్యక్తులు కదలాలంటే న్యాయస్థానం షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని అమికస్ క్యూరీ అభ్యర్థిస్తున్నారు.
దేశరాజధాని ఢిల్లీని కాలుష్యంనుంచి కాపాడేందుకు సుప్రీంకోర్టు ఇదే తరహాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంవత్సరాలుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. పొరుగురాష్ట్రాల్లో పంటవ్యర్థాలను తగులబెట్టడమే ఢిల్లీ కాలుష్యానికి కారణమని ఒకదశలో పాలకులు దబాయించారు కూడా. అయితే, వాహన కాలుష్యమే అతిప్రధానమైనదని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ తన నివేదికలో తేల్చిచెప్పిన నేపథ్యంలో, సత్వరచర్యలకు కోర్టు ఆదేశించింది. కాలుష్యానికి దోహదపడుతున్న వాహనాలను నియంత్రించడం, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ల జారీని కఠినతరం చేయడం, ప్రజారవాణాను మెరుగుపరచడం ఇత్యాదివి కమిషన్ ఇచ్చిన సలహాల్లో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలతో పాటు, పౌరులు తమ బాధ్యతగా నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఢిల్లీని కాలుష్యం, పొగమంచూ కలగలిసి కుమ్మేసిన స్థితి సుదీర్ఘకాలంగా కొనసాగుతూ, కొద్దిపాటి జల్లుల వల్ల గణతంత్రదినోత్సవం నాడు మాత్రం పరిస్థితి కాస్తంత మెరుగుపడింది. విదేశీ అతిథులముందు పరువుపోనందుకు దేశ ప్రజలంతా సంతోషించారు. ఇప్పుడు మళ్ళీ ఏక్యూఐ ఆకాశానికి తాకుతూ పరిస్థితి పూర్వస్థితికి చేరిన నేపథ్యంలో, గీతాగోపీనాథ్ లెక్కలను తప్పుబట్టడం కంటే, ఆమె హితవుకు చెవొగ్గడం అవసరం.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్ సమావేశానికి మరోసారి శశి థరూర్ డుమ్మా.. ఈ సారి కారణమేంటంటే..
యాసిడ్ దాడి కేసుల్లో నిందితుల ఆస్తులు ఎందుకు వేలం వేయకూడదు.. ప్రశ్నించిన సుప్రీం