...అయినా అభద్రతే!
ABN , Publish Date - Nov 06 , 2026 | 04:49 AM
అగ్నిపథ్ పథకం కింద భారత సాయుధదళాల్లో సేవలందిస్తున్న అగ్నివీరుల సర్వీసు కాలాన్ని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ళు పొడిగించింది. దీంతో, వారి ప్రాథమిక సర్వీసు కాలం నాలుగేళ్ళ నుంచి ఆరేళ్ళకు...
అగ్నిపథ్ పథకం కింద భారత సాయుధదళాల్లో సేవలందిస్తున్న అగ్నివీరుల సర్వీసు కాలాన్ని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ళు పొడిగించింది. దీంతో, వారి ప్రాథమిక సర్వీసు కాలం నాలుగేళ్ళ నుంచి ఆరేళ్ళకు పెరుగుతుంది. 2022లో చేరి, ఈ ఏడాది డిసెంబరు నాటికి నాలుగేళ్ళ సర్వీసు పూర్తిచేసుకుని బయటకు పోవాల్సివస్తున్న అత్యధిక అగ్నివీరులకు ఈ నిర్ణయం లబ్ధిచేకూరుస్తుంది. అగ్నివీరుల్లో మెరిట్ ప్రాతిపదికన పాతికశాతాన్ని మాత్రమే రెగ్యులర్ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో, అలా ఎంపిక కాలేక, కొలువుకోల్పోవాల్సి వస్తున్నవారిని రెండేళ్ళు కొనసాగించడం, శాశ్వత ఉద్యోగాల్లోకి ప్రవేశించే అవకాశం వారికి అధికం చేయడం ఈ నిర్ణయం ఉద్దేశం. పొడిగించిన ఈ రెండేళ్ళ కాలంలో వేతనం పెరుగుతుంది, ఆరేళ్ళసర్వీసు తరువాత లభించే సేవానిధి ప్యాకేజీ కూడా హెచ్చింది.
అగ్నివీర్ విధానం మీదే విమర్శలున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం కూడా చాలా మంది రక్షణరంగ నిపుణులకు నచ్చలేదు. భద్రతాదళాల్లో ఉన్న ఈ వీరుల అభద్రతను ప్రభుత్వం మరికొంతకాలం పొడిగించిందని, ఆరేళ్ళు పనిచేసినా, ఓ పదిలక్షల ప్యాకేజీ వినా, పెన్షన్, గ్రాట్యుటీ, ఆరోగ్యపథకాలేమీ వర్తించకపోవడం, అసలు సైనికులకు దక్కే సామాజిక భద్రత వీరికి లేకపోవడం సరికాదని వారి వాదన. ఒకేరకమైన విధులు నిర్వహిస్తున్న ఇద్దరి మధ్య రెండు రకాల క్యాడర్లు సృష్టించి, వివక్ష చూపడం దేశభద్రత విషయంలో రాజీపడటంగా వారు భావిస్తున్నారు. ఈ పొడిగింపు నిర్ణయంతో ఈ పథకం అనాలోచితంగా రూపొందించినట్టు ప్రభుత్వమే ఒప్పుకున్నట్టు అయిందని, సైనిక అవసరాల పేరిట రాజకీయమే ఈ నిర్ణయానికి దోహదం చేసిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఏడు రాష్ట్రాల్లో ఐదు సైనికులను అందించేవే. పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల నుంచి సైన్యంలోకి ప్రవేశించేవారి సంఖ్య తరతరాలుగా హెచ్చుగా ఉండటం తెలిసిందే. అందువల్ల, నాలుగేళ్ళ సర్వీసు పూర్తయిన వేలాదిమంది యువ అగ్నివీరులు భవిష్యత్తు గురించి ఏ హామీలేకుండా తిరిగి గ్రామాలకు చేరితే అది తమ ఓటుబ్యాంకును దెబ్బతీస్తుందన్న భయంలో బీజేపీ ఉన్నందునే ఈ మార్పు జరిగిందని విపక్షాల అనుమానం. గత నాలుగున్నర సంవత్సరాల్లో మూడులక్షలకు పైగా అగ్నివీరుల నియామకం జరిగింది కనుక, ఎన్నికలకు పోబోతున్న రాష్ట్రాల్లో ఈ నిర్ణయం సానుకూలంగా పనిచేయవచ్చు.
అదనంగా రెండేళ్ళకాలాన్ని పొందుతున్నవారికి అగ్నివీర్–ఇ అని నామకరణం చేశారు. దీంతో వీరిలోనే రెండు వర్గాలు, వేర్వేరు కాలాలు, రెగ్యులర్ ఉద్యోగం కోసం రెండు ఎంపిక ప్రక్రియలు తయారైనాయి. రెగ్యులర్ సైనికోద్యోగులతో పోల్చితే అగ్నివీరులకు అన్యాయం జరుగుతోందని, ఒకే బాధ్యతలు చేపడుతున్నప్పటికీ వివక్షకు లోనవుతున్నారని అనుకుంటూ ఉంటే, ఇప్పుడు అగ్నివీరుల్లోనే తేడాలున్నట్టు. నాలుగేళ్ళ సైనికసేవ అనంతరం శాశ్వత ఉద్యోగాల్లోకి ప్రవేశించలేనివారికి ఇప్పుడు మరో అవకాశం దక్కిందని అనుకున్నప్పటికీ, ఆరేళ్ళ మిలటరీ సర్వీసు తరువాత కూడా వారికి మళ్ళీ అదే పరీక్ష ఎదురవుతోంది. అర్హత పరీక్షల్లో క్వాలిఫై అయినవారందరికీ శాశ్వతఉద్యోగాలు దక్కుతాయని కాక, వాళ్ళు మళ్ళీ ఆ కాస్త ఖాళీల భర్తీ కోసమే పోటీపడవలసి వస్తున్నది. రెగ్యులర్ ఉద్యోగులుగా ప్రవేశించినా, పెన్షన్ అర్హతను నిర్ణయించడంలో అగ్నివీరులుగా వీరి సర్వీసు కాలాన్ని ఎలాగూ పరిగణనలోకి తీసుకోరు.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గతంలో ఆందోళనలు జరిగాయి. సైన్యంలోకి ప్రవేశించడమే లక్ష్యంగా వివిధ రీతుల్లో శిక్షణ పొందుతున్న గ్రామీణ యువత ఈ నాలుగేళ్ళ కాంట్రాక్టు ఉద్యోగాన్ని తీవ్రంగా నిరసించింది. దేశాన్ని రక్షించేవారి ఉద్యోగానికి రక్షణలేకపోవడం ప్రమాదమని నిపుణులు హెచ్చరించారు. 70శాతానికి పైగా అగ్నివీరులు రేపటిరోజున తాము శాశ్వత ఉద్యోగాల్లోకి ప్రవేశించగలమా? అన్న అభద్రతాభావంలోనే నాలుగేళ్ళూ కొనసాగుతున్నారని, రెగ్యులర్ సైన్యంలోకి చేరలేక మళ్ళీ వెనక్కుపోవలసి వస్తే ఉపాధి భయం వారిని నిత్యం వెంటాడుతోందని పలు సర్వేలు ఇప్పటికే తేల్చాయి. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఒకవేళ కొంత సొమ్ము మిగుల్చుకోగలిగినప్పటికీ, దేశరక్షణ రీత్యా దానిని పునఃపరిశీలించి, అవసరమైతే పూర్తిగా వదులుకోవడం తప్పేమీ కాదు.
ఈ వార్తలూ చదవండి
పారా అథ్లెట్ల పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి: ప్రధాని మోదీ