Share News

కలహాల ‘ఆప్‌’

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:22 AM

ఆమ్‌ ఆద్మీ పార్టీని వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. రాజ్యసభలో ఆ పార్టీ ఉపనేత పదవినుంచి రాఘవ్‌ చద్దాను తొలగించిన అంశం రానురాను మరింత వేడెక్కుతోంది. కేజ్రీవాల్‌కు...

కలహాల ‘ఆప్‌’

ఆమ్‌ ఆద్మీ పార్టీని వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. రాజ్యసభలో ఆ పార్టీ ఉపనేత పదవినుంచి రాఘవ్‌ చద్దాను తొలగించిన అంశం రానురాను మరింత వేడెక్కుతోంది. కేజ్రీవాల్‌కు అమిత విశ్వాసపాత్రుడుగా, వాగ్ధాటిగల నాయకుడుగా ఎదిగిన చద్దాను హఠాత్తుగా ఆ పదవినుంచి తొలగించడం అనేక ఊహాగానాలకు దారితీస్తోంది. ఆయన బీజేపీతో రాజీపడ్డాడని రేపోమాపో ఆ పార్టీలో చేరబోతూండటంతో ముందుగానే ఆప్‌ మేలుకొని ఈ నిర్ణయం తీసుకున్నదని కొందరివాదన. ఈ నిర్ణయం వెనుక రాజకీయాంశాలు ఏమీ లేవని పంజాబ్‌, ఢిల్లీల నుంచి పోగేసిన డబ్బు విషయంలో చద్దా చేతివాటం పార్టీ అధిష్ఠానానికి ఆగ్రహం కలిగించి ఈ నిర్ణయం తీసుకున్నదని గిట్టనివారు అంటారు. ఒకపక్క చద్దాకు, పార్టీ అధినాయకులకు మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతున్న తరుణంలోనే, హర్యానా మాజీ ఆప్‌ అధ్యక్షుడు విడుదల చేసిన విడియో ఒకటి కొత్త వివాదాన్ని రేకెత్తించింది. ఎన్నో వివాదాస్పదమైన అంశాలను సభాముఖంగా లేవనెత్తిన చద్దా, తాను ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అధికారిక నివాసం ‘శీష్‌ మహల్‌’లో దెబ్బలు తిన్న విషయాన్ని ఎందుకు బయటకు చెప్పడం లేదని ఈయన అడుగుతున్నాడు. కంటికి తీవ్ర గాయమైన చద్దా ఆ తరువాత లండన్‌ వెళ్ళి చికిత్స కూడా చేయించుకున్నారనీ, సింగపూర్‌ తరలించాల్సిన సొమ్మును చద్దా తన సొంతానికి లండన్‌కు చేర్చడం ఈ గొడవకు కారణమన్నది జైహింద్‌ వ్యాఖ్యల సారాంశం. రాబోయే రోజుల్లో ఆప్‌ అధిష్ఠానం తుఫాను చవిచూడబోతోందని హెచ్చరిస్తున్న చద్దా తన గతానుభవాలను, వాటి వెనుక రహస్యాలనూ కూడా జనంతో పంచుకోవాలంటూ, స్వాతి మలివాల్‌ పేరు నేరుగా ప్రస్తావించకుండా ఆమె తరహా ధైర్యం ప్రదర్శించమని జైహింద్‌ సూచించారు.

ప్రధాని నరేంద్రమోదీని చూసి చద్దా వొణికిపోతున్నారని, ‘సర్‌’ వంటి అంశాల్లో నోరువిప్పకుండా, విపక్షాలతో కలిసి వాకౌట్లు చేయకుండా, పంజాబ్‌ సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించకుండా చద్దా రాజీపడ్డారని ఆప్‌ నాయకుల విమర్శ. చద్దా వివాదం, గతంలో ఇదే తరహాలో పార్టీపై తిరుగుబాటు చేసిన స్వాతి మలివాల్‌ను గుర్తు చేస్తోంది. కేజ్రీవాల్‌ సమక్షంలోనే తనమీద భౌతికదాడి చేశారని, చిత్తం వచ్చినట్టు కొట్టి, పొత్తికడుపులో తన్నారని ఆమె రెండేళ్ళక్రితం ఆరోపణలు చేసింది. స్వాతి మలివాల్‌ మాదిరిగానే చద్దా కూడా కేజ్రీవాల్‌ అధికారికంగా తన పార్టీ ప్రకటించడానికి ముందునుంచే ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తి. ఇద్దరూ కూడా పార్టీ తమను దూరం పెట్టేవరకూ కేజ్రీవాల్‌తోనే కొనసాగి, విభిన్నమైన ప్రజాపోరాటాల్లో పాలుపంచుకున్నవారు. లిక్కర్‌ కుంభకోణంలో కేజ్రీవాల్‌ సహా ఆప్‌ పెద్దలను న్యాయస్థానం విడుదల చేస్తే, చద్దా దానిపై స్పందించలేదని, ఇది కేజ్రీవాల్‌కు నచ్చలేదని అంటారు. ఢిల్లీలో అధికారం కోల్పోయి, పంజాబ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న తరుణంలో, అక్కడ తాము కేంద్రం నుంచి ఎదుర్కొంటున్న సహాయనిరాకరణను రాజ్యసభలో చద్దా ఎత్తిచూపడం లేదన్నది అంత నమ్మశక్యమైన వాదనగా కనిపించడం లేదు.


నిజానికి చద్దా చాలా కీలకమైన ప్రజాసంబంధిత సమస్యలను సభాముఖంగా చర్చకు తెచ్చి తన పేరు పెంచుకోవడంతో పాటు, పార్టీ పేరుకూడా నిలబెట్టారు. విమానాశ్రయాల్లో రెండు ఇడ్లీలను రెండువందలకు ఎందుకు కొనాలంటూ అక్కడ కూడా జనతా క్యాంటీన్ల ఏర్పాటు గురించి మాట్లాడారు. టెన్‌ మినిట్‌ డెలివరీ పేరుతో ఆన్‌లైన్‌ అమ్మకం సంస్థలు గిగ్‌వర్కర్ల ఉసురు తీస్తున్నాయంటూ ఆయన చక్కని పోరాటమే చేశారు. స్వయంగా గిగ్‌వర్కర్‌ అవతారం ఎత్తి వారి సమస్యలను తెలియచెప్పి, ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగారు. మొబైల్‌ డేటా రీచార్జి ప్లాన్లలోని కుట్రలను సైతం బహిర్గతం చేశారు. ఇవన్నీ అధిష్ఠానానికి నచ్చలేదని అనుకోలేం.

ఆదిలో రాజ్యసభ సభ్యత్వాల విషయంలో రాజీపడని ఆప్‌ అనంతరకాలంలో ఎక్కువస్థానాల్లో ధనికులు, పారిశ్రామికవేత్తలను కూచోబెట్టి మిగతాపార్టీల తోవలోనే సాగింది. ఎమ్మెల్యేగా, ఢిల్లీ జల్‌ బోర్డు అధిపతిగా చద్దా చక్కగా పనిచేశారని, గత దశాబ్దంన్నరకాలంగా పార్టీతో కొనసాగుతూ అనేక ప్రజాపోరాటాలు చేశారని ఆప్‌ నాయకులే ఒప్పుకుంటున్నారు. లిక్కర్‌ కుంభకోణం కేసులో పార్టీ పెద్దలకు దక్కిన ఉపశమనం చద్దా ఉదంతంతో ప్రజల మస్తిష్కాల్లో వెనక్కుపోయింది. అంతర్గత సమస్యలు, కుమ్ములాటలు ఏమైనప్పటికీ, ఢిల్లీలో మళ్ళీ ఉనికికోసం, పంజాబ్‌లో కొనసాగింపుకోసం గట్టి ప్రయత్నం చేయాల్సిన తరుణంలో చద్దా వ్యవహారం పార్టీని ఆత్మరక్షణలో పడవేసింది.

ఇవి కూడా చదవండి..

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు: రాహుల్

బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత

Updated Date - Apr 07 , 2026 | 04:22 AM