Share News

పాతికేళ్ల క్రితం...

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:13 AM

న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ట్విన్‌ టవర్స్‌ మీద ఉగ్రదాడి జరిగి పాతికేళ్ళయింది. ఆ దారుణఘటనలో మరణించినవారికి నివాళిగా అమెరికాలో జరుగుతున్న కార్యక్రమాలను వివిధ మాధ్యమాల ద్వారా...

పాతికేళ్ల క్రితం...

న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ట్విన్‌ టవర్స్‌ మీద ఉగ్రదాడి జరిగి పాతికేళ్ళయింది. ఆ దారుణఘటనలో మరణించినవారికి నివాళిగా అమెరికాలో జరుగుతున్న కార్యక్రమాలను వివిధ మాధ్యమాల ద్వారా మిగతా ప్రపంచం కూడా ఆసక్తిగా చూస్తోంది. అనాడు ఏమి జరిగిందంటే అంటూ ఆ భయానకదాడినీ, తదనంతర విషాదకర పరిస్థితులను మీడియా మళ్ళీ వర్ణించి చెబుతోంది. ఇప్పుడు కృత్రిమమేధ కూడా తోడున్నది కనుక సామాజిక మాధ్యమాల్లో ఇది మరీ సులభంగా సాగిపోతోంది. ఘటన జరిగి పాతికేళ్ళయిన తరువాత కూడా, ఇటీవలే వెలుగుచూసిన మరో రహస్యం అంటూ వెలువడుతున్న కథనాలకు సైతం లోటులేకపోతోంది. అల్‌ఖైదా రహస్య సంభాషణలను, సంకేతాలను పసిగట్టడంలోనూ, డీకోడ్‌ చేయడంలోనూ అమెరికా వ్యవస్థలు ఎలా విఫలమైనాయో, భద్రతాసంస్థల తప్పుడు అంచనాలు ఈ ఘోరానికి ఎలా దోహదపడ్డాయో వివరించే కథనాలకు అంతే లేదు.

పాతికేళ్ళనాటి ఈ దాడులలో మరణించిన ఎమర్జెన్సీ సిబ్బందికి నివాళి ఘటించి, వారి కుటుంబీకులను ఉద్దేశించి నాలుగు ఉపశమన వ్యాఖ్యలు చేయాల్సిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ సందర్భాన్ని కూడా తన స్వభుజతాడనం కోసం వాడుకోవడాన్ని అమెరికా మీడియా తీవ్రంగా తప్పుబడుతోంది. మంగళవారం వైట్‌హస్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్‌ వినిపించిన తన సాహస కథనంలోని డొల్లతనాన్ని ప్రశ్నిస్తోంది. నేను దానిని ఎప్పటికీ మరిచిపోలేను, అది మా మీద కూలిపోతోందని అనుకున్నాం, అప్పుడు ఇద్దరు బలిష్ఠులైన అగ్నిమాపక సిబ్బంది నన్ను పట్టుకొని అవతలకు ఈడ్చేశారంటూ ఆయన చెప్పుకొచ్చిన కథనంలోని స్థలకాలాదులను, ఉద్దేశపూర్వక అస్పష్టతను మీడియా డీకోడ్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. పాతికేళ్ళుగా ఆయన నోట అదే కథనం ఎన్ని రకాలుగా వినబడిందో విప్పిచెబుతూ ట్రంప్‌ మానసికస్థితిని ఏ విధంగా అభివర్ణించాలన్న విషయమై చర్చ కూడా సాగుతోంది.

2001 సెప్టెంబర్‌ 11నాటి పరిణామాలు సులభంగా విస్మరించగలిగేవి కావు. ప్రయాణికులతో నిండిన విమానాలను ఉగ్రవాదులు మారణాయుధాలుగా మార్చి ట్విన్‌ టవర్స్‌ను కుప్పకూల్చిన తీరు కనీవినీ ఎరగనిది. విమానాలు భారీ అగ్నిగోళాలుగా మారిపోవడం, మొదలు నరికిన చెట్లలాగా టవర్లు నేలమట్టం కావడం, ప్రాణభయంతో పరిగెడుతున్న న్యూయార్క్‌వాసుల మొఖాల్లో దైన్యం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. హైజాక్‌ అయిన విమానం పెంటగాన్‌ను సైతం విడిచిపెట్టకపోవడం అమెరికాను నిలువెల్లా వొణికించింది, ప్రపంచాన్ని భయంలో ముంచెత్తింది. ఈ ఘోరంనుంచి త్వరితంగా కోలుకున్న అమెరికా జరిగినదానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు ఉగ్రవాదంపై యుద్ధాన్ని ప్రకటించి, అన్ని దేశాలనూ తనతో కలసిరమ్మన్నది. ఎవరే గట్టున ఉంటారో తేల్చుకోమంటూ, తనవైపు రానివారంతా ఉగ్రవాదుల పక్షమేనన్న హెచ్చరికలూ చేసింది. ‘నాటో’ ఏర్పడిన యాభైయేళ్ళకు అందులోని ఉమ్మడి రక్షణ ఒప్పందానికి లోబడి, ఆర్టికల్‌ 5 ను ఆచరణలోకి తేవడం కూడా అదే తొలిసారి.


అల్‌ఖైదా దాడి, ఉగ్రవాదంపై పోరు ప్రపంచగతిని ఏ విధంగా మార్చాయన్న చర్చకూడా ఇప్పుడు జరుగుతోంది. ఈ ఘటనల ప్రభావంతో అనేక దేశాలు భద్రతను పరిరక్షించే ముసుగులో ప్రజల హక్కులను హరించి, వారిపై మరింత నిఘా ఉంచి, సాంకేతికతను, ఆయుధశక్తినీ పెంచుకున్నాయన్నది నిజం. ఉగ్రవాదంపై పోరు ఉగ్రవాదాన్ని అంతం చేయకున్నా, నియంత్రణలో ఉంచడానికి సైతం ఉపకరించలేదు. సెప్టెంబరు 11 ఘటన జరిగిన కొద్దివారాల్లోనే భారత పార్లమెంట్‌మీద ఉగ్రవాదులు దాడిచేయడం, భారత్‌ ప్రతీకారంగా ఆరంభించిన ఆపరేషన్‌ పరాక్రమ్‌కు అమెరికా అండగా నిలవకపోవడం తెలిసినవే. అల్‌ఖైదాకు ఆశ్రయం ఇచ్చినందుకు తాలిబాన్‌పై అమెరికా ఆరంభించిన యుద్ధం ఒసామా బిన్‌ లాడెన్‌ను హతం చేసిన తరువాత, ఎన్ని మలుపులు తిరిగిందో, చివరకు ఎలా ముగిసిందో చూశాం. అఫ్ఘానిస్థాన్‌ను అర్థంతరంగా వదిలేసి, మళ్ళీ అధికారాన్ని అదే తాలిబాన్‌కు అప్పగించి అమెరికా చేతులు దులిపేసుకుంది. ముంబైదాడులతో సహా ఇప్పటివరకూ జరిగిన ఏ ఉగ్రదాడిలోనూ పాకిస్థాన్‌ ప్రమేయాన్ని అది గుర్తించలేదు, ఉగ్రవాదాన్ని పెంచిపోషించడంపై ప్రశ్నించలేదు. కశ్మీర్‌ను అడ్డుపెట్టుకొని పాకిస్థాన్‌ సాగిస్తున్న ఉగ్ర చర్యలూ చేష్ఠలన్నింటినీ భారత్‌ ఒంటరిగానే భరించవలసి వస్తున్నది.

ఈ వార్తలు కూడా చదవండి

రూ.1 లక్ష లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన సచివాలయం ఉద్యోగులు

ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..

Updated Date - Sep 11 , 2026 | 01:13 AM