Share News

‘అడవిమనుషుల’ స్మగ్లింగ్‌!

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:33 AM

ఒడిశా అడవుల్లో ప్రత్యక్షమైన ఐదు పిల్ల ఒరాంగుటాన్‌లను తమకు అప్పగించవలసిందిగా ఇండోనేషియా అటవీ మంత్రిత్వశాఖ భారతదేశాన్ని కోరుతోంది. పశ్చిమబెంగాల్‌ సరిహద్దు సమీపంలో, ఒడిశాలోని...

‘అడవిమనుషుల’ స్మగ్లింగ్‌!

ఒడిశా అడవుల్లో ప్రత్యక్షమైన ఐదు పిల్ల ఒరాంగుటాన్‌లను తమకు అప్పగించవలసిందిగా ఇండోనేషియా అటవీ మంత్రిత్వశాఖ భారతదేశాన్ని కోరుతోంది. పశ్చిమబెంగాల్‌ సరిహద్దు సమీపంలో, ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా భొగ్రాయి అటవీ రేంజ్‌లో గమ్మత్తయిన కళ్ళతో, నారింజరంగు బొచ్చుతో అడవినేలమీద అమాయకంగా దొర్లుతూ దొరికిన ఈ పిల్లజీవుల చిత్రాలు, వీడియోలతో సోషల్‌ మీడియా సందడి చేస్తోంది. భువనేశ్వర్‌లోని నందన్‌కానన్‌ జంతుప్రదర్శనశాలకు తరలిన ఈ పసికూనలు పాలు తాగుతూ, బొమ్మలతో అడుకుంటూ, ఉయ్యాలలూగుతున్న చిత్రాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఒకక్షణం ఆనందంగా గెంతులేస్తూ, మరుక్షణం భయంతో ఒకదానినొకటి గట్టిగా పట్టుకొని ఒక మూలకు పోయి కూచుంటున్నాయట. మలయ్‌ భాషలో ఉరాంగ్‌ అంటే మనిషి, ఉటాన్‌ అంటే అడవి అని అర్థమట. జంతు ప్రపంచంలో తెలివైన ఈ జీవులను అడవి మనుషలంటున్న ఆధునిక మానవుడు వాటిని ధనదాహంతో తమ సహజ ఆవాస ప్రాంతాలకు దూరం చేసి, అమ్ముకుంటున్నాడు. ఇవి పుట్టినచోట నుంచి వేలాది కిలోమీటర్ల దూరం తరలిరావడం వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్‌ ముఠాలున్నాయన్నది సుస్పష్టం.

ఈ ఐదు పిల్లజీవుల్లో రెండింటికి ఆరోగ్యం సరిగా లేనందున, చికిత్స అందించి, సంపూర్ణంగా కోలుకున్న తరువాత డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తారట. ఈ పరీక్షల్లో జాతి, జన్యుమూలాలు గుర్తించాక అప్పగింతల ప్రక్రియ జరగవచ్చు. ఇండోనేషియా, మలేషియాల్లోని దట్టమైన వర్షారణ్యాల్లో, మరీ ముఖ్యంగా సుమత్రా, బోర్నియో దీవుల్లో జీవించే ఒరాంగుటాన్లు అంతరించిపోవడానికి చేరువలో ఉన్న అరుదైన జీవజాతి. పూర్తి భిన్నమైన మన దేశ వాతావరణంలో వాటిని అతిజాగ్రత్తగా చూసుకుంటూ ఆరోగ్యంగా ఉంచడం పెద్దసవాల్‌. పిల్లజీవులతో పాటు వాటి తల్లి లేకపోవడం మనకు మరో పరీక్ష. స్మగ్లర్ల చేతిలో తల్లి చనిపోయివుండవచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఎనిమిదేళ్ళకు ఒకసారి మాత్రమే పిల్లలను కనే జాతి ఇది. సంవత్సరాలపాటు తల్లితో కలిసి ఉంటూ ఆహారసేకరణ నుంచి స్వతంత్రంగా జీవించే నైపుణ్యాల వరకూ ప్రతీ దశనూ నేర్చుకొనే జీవులు కనుక తల్లిలేని వీటిని ఎంతకాలం ఆరోగ్యంగా ఉంచగలమన్న సందేహాలూ లేకపోలేదు. అసలే తల్లికి దూరమైన వీటిని వాటి సహజ వాతావరణానికి దూరంగా ఎక్కువకాలం ఉంచడం మంచిదికాదని నిపుణుల సలహా. ఇవన్నీ ఒకే తల్లి పిల్లలా, కాదా అన్నది కూడా నిర్ధారించుకోవాల్సిందే.

వైల్డ్‌లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో (డబ్ల్యుసిసిబి), ఒడిశా పోలీసు శాఖ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌)లు ఈ ఒరాంగుటాన్లు బాలాసోర్‌ అడవుల్లోకి ఎలా వచ్చాయన్నది దర్యాప్తు చేస్తున్నాయి. స్థానికులకు కనిపించడానికి రెండు మూడు రోజులముందే అవి అక్కడకు వచ్చి వుంటాయన్న అంచనాలతో సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలన సాగుతోంది. అవి దొరికిన ప్రాంతం దట్టమైన అడవి కాక, రాష్ట్ర రహదారికి సమీపంలోనే ఉండటం వల్ల అవి రోడ్డు మార్గంలోనే అక్కడకు చేరాయన్న అంచనాలతో దర్యాప్తు సాగుతోంది. సముద్రమార్గంలో వీటిని తరలించిన స్మగ్లర్లు తదనంతరం ఎందువల్లనో ఇక్కడ వదిలేసిపోయారు. అక్కడ కొన్ని ఫేస్‌మాస్క్‌లు లభించినట్టు, ఒక నల్లరంగు ఎస్‌యూవీని ఇందుకు వినియోగించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.


ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మూడు ఒరాంగుటాన్‌ జాతులూ అమితవేగంతో అంతరించిపోతున్న దిశలోనే ఉన్నాయి. ప్రపంచస్థాయి ఒప్పందాలన్నీ వీటికి రక్షణగా నిలబడుతున్నా వాటి అక్రమ రవాణా సాగుతూనే ఉంది. నాలుగేళ్ళక్రితం కూడా అసోం సరిహద్దుల్లో ఇలాగే రెండు పిల్లజీవులు కనిపించినప్పుడు పొరుగు దేశం మయన్మార్‌ మీదుగా వాటిని తరలించినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు కూడా అంతర్జాతీయ స్మగ్లర్లూ, దేశీయ ముఠాల సహకారంతో అదే జరిగి వుండవచ్చు. వివిధ రకాల పళ్ళు తిని ఒరాంగుటాన్లు విసర్జించే విత్తనాలతో అడవులు చక్కగా ఎదుగుతాయి కనుక వీటికి ‘గార్డెనర్స్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌’ అని పేరు. డబ్బు ఆశ తప్ప, పర్యావరణం, అడవుల పరిరక్షణ మీద పట్టింపులేని మనిషికి ఈ మూగజీవులు కూడా ఆటవస్తువులుగానూ, నోట్ల కట్టలుగానే కనిపిస్తున్నాయి. విఫలమైన ఈ స్మగ్లింగ్‌ ఆపరేషన్‌ గుట్టురట్టుచేయడంతోపాటు, స్థానికుల సహాయ సహకారాలతో ఈ తరహా అక్రమ రవాణాను నిలువరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Updated Date - Sep 12 , 2026 | 05:33 AM