అమెరికా రౌడీ సుంకాలు!
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:57 AM
‘రష్యా నించి చమురును కొనే దేశాలపైన వందశాతం వరకు టారిఫ్‌ని విధించే అధికారాన్ని అధ్యక్షుడికి ఇవ్వాలి’ అంటూ అమెరికా సెనేట్ ఆగస్ట్ 7న బిల్లును ఆమోదించింది. ఇప్పుడు ఈ బిల్లు అమెరికా పార్లమెంట్‌లోని...
‘రష్యా నించి చమురును కొనే దేశాలపైన వందశాతం వరకు టారిఫ్‌ని విధించే అధికారాన్ని అధ్యక్షుడికి ఇవ్వాలి’ అంటూ అమెరికా సెనేట్ ఆగస్ట్ 7న బిల్లును ఆమోదించింది. ఇప్పుడు ఈ బిల్లు అమెరికా పార్లమెంట్‌లోని రెండవ సభకు ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’కు వెళుతుంది. అక్కడ 435 మంది సభ్యులు ఉంటారు. అక్కడ ఆమోదం పొందాక ప్రెసిడెంట్ దగ్గరకు వెళుతుంది. తర్వాత ‘చట్ట రూపం’ తీసుకుంటుంది.
రష్యా క్రూడ్ అయిల్ ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్న దేశాలు: చైనా (50శాతం), భారత్ (36శాతం), టర్కీ (6శాతం), యురోపియన్ యూనియన్ (5శాతం). ఇంకా కొన్ని చిన్న చిన్న దేశాలు కూడా ఉన్నాయి. అమెరికా ఇప్పుడు ఈ వంద శాతం సుంకాల్ని పెంచడానికి కారణం లేకపోలేదు. ‘మీరు రష్యా దగ్గర నించి క్రూడ్ ఆయిల్ కొనకండి’ అని 2025లోనే భారత్‌కు, చైనాకు చెప్పింది. అవి అప్పటికి వినలేదు. అదే ఏడాది ఆగస్టు 6న భారత్‌పై 25శాతం సుంకాన్ని విధించింది. ఆగస్టు 27 నుంచి అది అమల్లోకి వచ్చింది. ఆ తరువాత భారత్ – అమెరికాల మధ్యన కొన్ని చర్చలు జరిగాయి. 2026 ఫిబ్రవరి 9న, ‘రష్యా నించి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత్ అంగీకరించినందుకు గాను 25శాతం సుంకాన్ని తొలగించినట్లు’గా వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. కాని భారత్ మాత్రం రష్యా నించి చమురు దిగుమతిని ఆపలేదు. ‘తన ఇంధన అవసరాలకు కారు చౌకగా, నిరంతరంగా లభించే క్రూడ్‌ని ఎక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి కొనుగోలు చేయడం తన జాతీయ ప్రయోజనం’ అని భారత్ అమెరికాకు చెప్పేసింది. అంతేగాక, ‘యూరప్ దేశాలు కూడా రష్యా నుంచి చమురు, గ్యాస్ తదితర ఇంధనాలను కొనుగోలు చేస్తున్న సమయంలో భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం’ అని కూడా భారత్ నిరసన తెలియజేసింది. అందుకు ప్రతిఫలంగానే ఇప్పుడు ‘వంద శాతం టారిఫ్ బిల్లు’ రాబోతుంది!
ఒక దేశం ఇంకో దేశం దగ్గర ఏమి తీసుకోవాలి, ఏమి ఇవ్వాలి అనేది ఆ దేశానికి సంబంధించిన అంతర్గత విషయం. అది దాని అంతర్జాతీయ వాణిజ్య విధానం. తన ఇంధన అవసరాలను, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎవరితో వాణిజ్యం చేయాలో నిర్ణయించుకునే హక్కు ప్రతి దేశానికీ ఉంటుంది. కానీ అమెరికా ఇప్పుడు ఆ హక్కును సుంకాల బెదిరింపులతో కట్టడి చేయబోతుంది. అమెరికా ఒక పక్కన ‘చమురు యుద్ధాల్ని’ చేస్తూ, ఇంకో పక్కన ‘రష్యా నుంచి చమురు కొంటే ఆ ఆదాయంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తుంది’ అని చెప్పడం కంటే హాస్యాస్పదమైన విషయం ఇంకోటి లేదు!
నన్నూరి వేణుగోపాల్
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం