వైద్యం అందని పల్లెకు భరోసా ఎవరు?
ABN , Publish Date - Oct 08 , 2026 | 01:17 AM
ఒకవైపు ఆకాశాన్నంటుతున్న వైద్య విజ్ఞానం, అద్భుతాలు సృష్టిస్తున్న అత్యాధునిక శస్త్రచికిత్సలు, కార్పొరేట్ ఆసుపత్రుల హంగులు. మరోవైపు కనీస వైద్య సదుపాయం..
ఒకవైపు ఆకాశాన్నంటుతున్న వైద్య విజ్ఞానం, అద్భుతాలు సృష్టిస్తున్న అత్యాధునిక శస్త్రచికిత్సలు, కార్పొరేట్ ఆసుపత్రుల హంగులు. మరోవైపు కనీస వైద్య సదుపాయం అందక విలవిలలాడుతున్న పల్లె ప్రజలు, గిరిజన గూడేల ఘోష. అర్ధరాత్రి జ్వరం వచ్చినా, అత్యవసర పరిస్థితి ఎదురైనా సమీపంలో కనీసం ఆసుపత్రి గానీ, అర్హత గల వైద్యుడు గానీ దొరకని దైన్యం... ఇదీ నేటి భారత ఆరోగ్య వ్యవస్థ అసలు చిత్రం. ఈ అసమానతల నడుమ, గ్రామీణ ప్రజలకు మొదటి సంజీవనిలా మారుతున్న ఆర్ఎంపీ డాక్టర్ల పాత్రను, దీని చుట్టూ అలుముకున్న చట్టపరమైన, శాస్త్రీయ వివాదాలను ఒకసారి లోతుగా విశ్లేషిస్తే, ఆరోగ్య వ్యవస్థలో వైరుధ్యాలు, గ్రామీణ వ్యవస్థ దుస్థితి అవగతమవుతుంది.
భారతదేశంలో సుమారు 65శాతానికి పైగా జనాభా పల్లె ప్రాంతాల్లోనే నివసిస్తోంది. కానీ, నిపుణులైన వైద్యులు, అత్యాధునిక మౌలిక వసతులు మాత్రం కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితమయ్యాయి. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ గణాంకాలను పరిశీలిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కిలోమీటర్ల దూరంలో ఉండటం, రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పల్లెల్లో ఆర్‌ఎంపీల ప్రాబల్యానికి ఇదే ప్రధాన కారణం. అర్ధరాత్రి ఎవరికైనా అనారోగ్యం వస్తే ముందుగా పరుగెత్తేది వీరి దగ్గరికే. వీరు ప్రథమ చికిత్స అందించడం, చిన్నపాటి రుగ్మతలకు తక్షణ ఉపశమనం కల్పించడం వంటివి చేస్తారు. కానీ, మరో కోణంలో చూస్తే ఇది అత్యంత ప్రమాదకరం కూడా. వీరికి సరైన వైద్యవిద్యాభ్యాసం లేకపోవడం, వ్యాధి నిర్ధారణలో శాస్త్రీయ పరిజ్ఞానం కొరవడడం, అవసరం లేకున్నా యాంటీబయాటిక్స్ లేదా స్టెరాయిడ్స్ వాడటం వల్ల దీర్ఘకాలంలో రోగుల కిడ్నీలు, కాలేయం దెబ్బతింటున్నాయి. అత్యవసర సమయాల్లో సరైన ఆస్పత్రులకు రిఫర్ చేయడంలో ఆలస్యం జరిగి ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది.
చట్టవిరుద్ధమని ఆర్ఎంపీలను పూర్తిగా నిషేధిస్తే పల్లెల్లో వైద్య సేవలు కుప్పకూలుతాయి. అలా అని యథేచ్ఛగా వదిలేస్తే అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడినట్టు అవుతుంది. ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం లభించాలంటే దేశవ్యాప్తంగా ఒక సమగ్ర జాతీయ విధానం రూపొందించాలి. గ్రామాల్లో ప్రాథమిక సేవలు అందిస్తున్న వారికి ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్దిష్టమైన బ్రిడ్జ్ కోర్సులు లేదా ప్రాథమిక వైద్య శిక్షణను అందించాలి. వారు ఏయే మందులు రాయవచ్చు, ఏ హద్దులు దాటకూడదు అనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. వీరు కేవలం ప్రాథమిక చికిత్స, ప్రథమ చికిత్సకు పరిమితమయ్యేలా చట్టపరమైన స్పష్టత ఉండాలి. ఆర్ఎంపీలు, పీఎంపీల మీద ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించాలంటే, ప్రతి పల్లెకు లేదా క్లస్టర్ గ్రామాలకూ మొబైల్ క్లినిక్‌లు, టెలిమెడిసిన్ సేవలు, నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజారోగ్య హితం కోరి ఒక బలమైన, స్పష్టమైన చట్టబద్ధ విధానాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
దేశంలో వైద్య విద్య, ఆసుపత్రులు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయి. మెడికల్ కాలేజీలు, సీట్లతో పాటు ఆరోగ్య కేంద్రాల సంఖ్య పెరిగింది. ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశారు. పట్టణాల్లో వైద్యులు, నిపుణులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. కానీ మారుమూల గ్రామాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాల్లో వైద్యసేవలు అందుబాటులో లేవు. వైద్యుడు పల్లెలో ఉండాలంటే కేవలం ఆసుపత్రి భవనం సరిపోదు. నివాసం, విద్య, రవాణా, భద్రత, వృత్తిపరమైన అభివృద్ధి వంటి అనేక అంశాలు అవసరం. అందుకే ప్రభుత్వం నియమించిన వైద్యుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు గ్రామాల్లో వైద్య సేవలందించే వారినే ఆశ్రయిస్తున్నారు.
ప్రపంచంలోని అనేక దేశాల వైద్యులు అందుబాటులో లేని ప్రాంతాల్లో మిడ్–లెవల్ హెల్త్ వర్కర్ల వ్యవస్థలను అభివృద్ధి చేశాయి. క్లినికల్ ఆఫీసర్లు, ఫిజీషియన్ అసిస్టెంట్లు, నర్స్ ప్రాక్టీషనర్లు, హెల్త్ ఆఫీసర్లు వంటి వివిధ కేడర్లు నిర్దిష్ట శిక్షణ, పరీక్ష, లైసెన్సు, పర్యవేక్షణ, రిఫరల్ వ్యవస్థలతో పనిచేస్తున్నాయి. భారతదేశంలో కూడా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆశా కార్యకర్తలు వంటి కేడర్లు ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శిక్షణ, పరిమిత విధులు, పర్యవేక్షణ, రిజిస్ట్రేషన్, జవాబుదారీతనంతో కూడిన సురక్షితమైన ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించే గ్రామీణ ఆరోగ్యానికి ప్రత్యేక కేడర్ ఎందుకు ఉండకూడదు? గ్రామాల్లో పనిచేస్తున్న వారిని డాక్టర్లుగా గుర్తించాలని కాదు... అనుభవం ఉన్న, ప్రజల మధ్య పనిచేస్తున్న, శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉన్నవారిని గుర్తించి, వాళ్ల సామర్థ్యానికి తగ్గట్టు పరిమిత బాధ్యతలు అప్పగించవచ్చు.
ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ గ్రామీణ ప్రాథమిక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఇలాంటి సేవలందిస్తున్న వారి సంఖ్య ఎంత? వారి విద్యార్హతలు ఏమిటి? ఎక్కడ పనిచేస్తున్నారు? ఎంతకాలంగా పనిచేస్తున్నారు? ఏ సేవలు అందిస్తున్నారు? ఎలాంటి మందులు ఉపయోగిస్తున్నారు? అనే అంశంపై దేశవ్యాప్తంగా సమగ్ర డేటా రూపొందించాలి. శిక్షణకు అర్హులైన వారిని ఒక కేటగిరీగా, కమ్యూనిటీ హెల్త్ కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగపడేవారిని మరో కేటగిరీగా గుర్తించాలి. ప్రమాదకరంగా వైద్యం చేస్తున్న వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. పుస్తకాల శిక్షణ మాత్రమే కాకుండా పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షణలో ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి చేయాలి. శిక్షణ పూర్తయ్యాక థియరీ, ప్రాక్టికల్, వైవా పరీక్షలు నిర్వహించి, అర్హత సాధించిన వారికి మాత్రమే సర్టిఫికెట్లు ఇవ్వాలి. వారిని ఎంబీబీఎస్ డాక్టర్లుగా కాదు, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య ప్రదాతలుగా గుర్తించాలి. ఈ నిబంధనలు చట్టంలో స్పష్టంగా తెలపాలి.
వీరు ఏ వ్యాధులను చూడాలి? ఏ మందులు ఇవ్వవచ్చు? ఏ పరీక్షలు చేయవచ్చు? ఏయే పరిస్థితిలో తప్పనిసరిగా ఆసుపత్రికి పంపాలి?... వంటివాటిపై శిక్షణ ఇవ్వాలి. సర్జరీలు, ప్రసవాలు, అబార్షన్లు, ప్రమాదకర ఇంజెక్షన్లు, స్టెరాయిడ్ల దుర్వినియోగం వంటి అధిక ప్రమాద సేవలకు వీరిని అనుమతించకూడదు. వీరికి లైసెన్సు పునరుద్ధరణ, నిరంతర శిక్షణ తప్పనిసరి చేయాలి. తప్పు చేస్తే చర్య, తీవ్రమైన తప్పిదం అయితే రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి.
శిక్షణ, పరీక్ష, పర్యవేక్షణ, డిజిటల్ వ్యవస్థలపై ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయీ ప్రజల ఆరోగ్య భద్రతపై పెట్టుబడిగా చూడాలి. ఆరోగ్య సేవలు ప్రజల గుమ్మం వరకు చేరడమే అసలు లక్ష్యం కావాలి. గ్రామీణ భారతదేశంలో అనధికారిక వైద్య సేవలను విస్మరించడం సమస్యకు పరిష్కారం కాదు. దేశంలోని మారుమూల గ్రామంలో అర్ధరాత్రి ఒక తల్లి తన బిడ్డను ఒడిలో పెట్టుకుని వైద్యం కోసం తలుపు తట్టినప్పుడు ఆ తలుపు వెనుక ఉన్న వ్యక్తి అర్హతలేని ప్రమాదకర వైద్యుడిగా ఉండరాదు. కాబట్టి, చీకట్లు కమ్మిన గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను వెలుగులోకి తెచ్చి, ప్రజల ప్రాణాలకు సురక్షితమైన వారధిగా మార్చాల్సిన బాధ్యత కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలదే.
తొండపు దశరథ జనార్దన్
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు
ఇవి కూడా చదవండి..
రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ ట్రిక్.. పోలీసుల ప్లాన్‌ను ఎలా మార్చారు..
యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..