Share News

ముంచుకొస్తున్న గ్రామీణ సంక్షోభం

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:12 AM

వర్షం జాడ కానరావడం లేదు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదు అవుతున్నాయి. సాయంత్రం 6:00 దాటినా భూమి చల్లబడడం లేదు. వేడి గాలులు, ఉక్కపోత రోహిణి కార్తెను గుర్తుకు తెస్తోంది. వ్యవసాయంపై...

ముంచుకొస్తున్న గ్రామీణ సంక్షోభం

వర్షం జాడ కానరావడం లేదు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదు అవుతున్నాయి. సాయంత్రం 6:00 దాటినా భూమి చల్లబడడం లేదు. వేడి గాలులు, ఉక్కపోత రోహిణి కార్తెను గుర్తుకు తెస్తోంది. వ్యవసాయంపై ఆధారపడ్డ మన దేశంలో వర్షాభావ పరిస్థితుల వల్ల అతి పెద్ద వ్యవసాయ సంక్షోభం, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం కనబడుతోంది.

సాధారణంగా ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు మాసాల పాటు వర్షాలు కురుస్తాయి. ఇందులో 50శాతం మొదటి రెండు నెలల్లోనే కురవాలి. కానీ ఈ ఏడాది జూన్‌లో 19శాతం వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 11.4శాతం మాత్రమే కురిసింది. మెట్ట ప్రాంతాల్లో పంటలకు వర్షాలే ఆధారం. అనావృష్టి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో కరువు ఏర్పడే అవకాశం ఉంది. రైతులు, రైతు కూలీల ఆదాయాలు దెబ్బతింటాయి. ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి. ఎఫ్‌సీఐలో బియ్యం, గోధుమల నిల్వలు ఉన్నాయి. వాటిని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు కాబట్టే కొంత ఊరట లభిస్తోంది. కానీ పప్పు దినుసులు, నూనె గింజల కొరత ఏర్పడి దిగుమతులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎరువుల ధరలు పెరిగాయి. ఆహార సబ్సిడీలు కూడా తగ్గుతున్నాయి.

ఈ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకానికి బదులు వీబీ జీరామ్‌జీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉపాధి హామీ పథకంలో 100శాతం నిధులు కేంద్రమే ఇచ్చేది. కానీ కొత్త పథకంలో 40శాతం నిధులు రాష్ట్రాలు భరించాలి. ఈ లెక్కన తెలంగాణ 1900 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 4000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బిహార్, జార్ఖండ్ లాంటి పేద రాష్ట్రాలు ‘మా దగ్గర డబ్బులు లేవు’ అని చేతులెత్తేస్తున్నాయి. దీంతో గ్రామాల్లో పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. పని లేకపోతే యువత గ్రామాల నుంచి వలస వెడుతుంది. ఇది సామాజిక సమస్యలకు దారితీస్తుంది. వర్షాలు లేక, చేతిలో పని లేక రైతు, కూలీ, చిన్న వ్యాపారి అందరూ నష్టపోతారు. గ్రామాల్లో డబ్బు ప్రసరణ ఆగిపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది.


100శాతం కేంద్ర నిధులతో గ్రామాల్లో ఉపాధి కల్పించాలి. వర్షాభావ ప్రాంతాలను ప్రకటించి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, రుణ ఉపశమనం ఇవ్వాలి. గ్రామాల్లో రోడ్లు వేయాలి. ప్రతి పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ప్రభుత్వ భవనాలను నిర్మించాలి. చెరువులు, కుంటల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ చేపట్టాలి. గ్రామాల్లోనే ఉపాధి కల్పించే గ్రామీణ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.

వర్షాభావం ప్రకృతి ఇచ్చిన సంక్షోభం. కానీ ఉపాధి పథకాల్లో కోతపెట్టడం మానవ నిర్ణయం. ఈ రెండూ కలిస్తే 60 కోట్ల గ్రామీణ ప్రజల జీవనం ప్రశ్నార్థకం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముంచుకొస్తున్న ఇంత పెద్ద ముప్పు గురించి చర్చిస్తున్న దాఖలాలు లేవు. ప్రజల సమస్యలపై విస్తృత చర్చ జరిగితేనే పరిష్కారానికి మార్గం లభిస్తుంది.

సోము సాయిరామకృష్ణ

శృంగవృక్షం

Also Read:

ఇథనాల్‌పై నెపం పెట్టొద్దు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

మత్స్యకారుల కన్నీళ్లపై జగన్ రాజకీయాలు మానుకోవాలి: పల్లా

Updated Date - Jul 15 , 2026 | 05:12 AM