Share News

‘రూపం’ మోసకారి!

ABN , Publish Date - Mar 23 , 2026 | 01:29 AM

ఇటీవల ‘కథ 2024’ ఆవిష్కరణ సభలో వస్తువు–శిల్పం/ రూపం–సారం గురించి సభా వేదిక నుంచి కొన్ని అభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా వామపక్షవాదులతో సహా రకరకాల వాదులందరూ...

‘రూపం’ మోసకారి!

ఇటీవల ‘కథ 2024’ ఆవిష్కరణ సభలో వస్తువు–శిల్పం/ రూపం–సారం గురించి సభా వేదిక నుంచి కొన్ని అభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా వామపక్షవాదులతో సహా రకరకాల వాదులందరూ (ఉదాహరణకు: మహిళా వాదులు, దళితవాదులు, ప్రాంతీయవాదులు, మైనారిటీవాదులు) రూపాన్ని పట్టించుకోరన్న అభిప్రాయం బలంగా వ్యక్తమయింది.

నిజానికి రూపవాదుల్లో పాఠకులను రంజింప చేసే రచయితల నుండి విసుగు పుట్టించే వారి దాకా అన్ని రకాల వారూ ఉంటారు. అందుకు ఆత్మాశ్రయవాదుల నుండి మరి ఏ ఇతర తరహాల వాదులూ అతీతం కారు. అయితే సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉండాలన్న ఆదర్శంతో మాట్లాడేవారు ఈ విషయంలో ఎక్కువ విమర్శకు గురవటం పరిపాటి. తాము ప్రకటించుకున్న ప్రగతిశీల ఆశయానికి అనుగుణంగా ఉత్తమ సాహితీ సృజన చేయలేకపోయినపుడు, అలాంటి వారిని విమర్శిస్తే మంచిదే. అలాకాక సాహిత్యకారులకు సామాజిక నిబద్ధత ఉండాలి అనే భావాన్ని పల్చన చేయడం కోసం ఉద్దేశించితే అది క్రమంగా రూపవాద సమర్థనకు దారితీస్తుంది.

మార్క్సిస్టులు రూపాన్ని పట్టిం చుకోరన్న విమర్శ సరి కాదు. ఎందుకంటే రూపం లేని వస్తువే లేదు. వస్తు సారానికి, దాని రూపానికి విడదీయలేని గతితార్కిక సంబంధం ఉంది. మార్క్సిజం పుట్టుక కంటే ముందే దీన్ని ఒక సామాజిక వాస్తవంగా గుర్తించి తమ పద్ధతులలో చెప్పినవారున్నారు.

2000 సంవత్సరాల క్రితందిగా భావించే ‘భరతుని నాట్య శాస్త్రం’లో వస్తు–రూప సంబంధం గురించి చాలా స్పష్టంగా ప్రశ్నలు–జవాబుల రూపంలో ఉంది. రూపం కోసం వస్తువు లేదనీ, వస్తువుని స్వీకరణ యోగ్యంగా మార్చడానికే రూపం ఉన్నదనీ నాట్యశాస్త్రంలో చెప్పి ఉన్నారు.

కల్తీ బంగారానికీ మేలిమి బంగారానికీ, నకిలీ విత్తనాలకు అసలు విత్తనాలకూ రూపం ఒకటిగానే వుంటుంది. కానీ సారంలోనే తేడా అంతా. ఈ సారమే ప్రాథమికమైనది. ప్రజలకు కావలసినదీ! నకిలీ విత్తనాలకు, నకిలీ బంగారానికీ తేడా తెలుసుకోలేక మోసిపోయినట్లే సాహిత్య కళా రంగాలలో జిలుగులు, మెరుపులు, చిత్ర విచిత్ర విన్యాసాలకు పాఠకులు/ ప్రేక్షకులు అసలు విషయాన్ని పట్టించుకోలేకపోయే పరిస్థితులు సందర్భాలు ఉంటాయి. ఈ రూప విన్యాసాలతో తమ అవగాహన పరిమితులను, పరిజ్ఞానలేమిని దాచుకునే సాహిత్యకారులు కూడా ఉంటారు. వీరిని కనిపెట్టి బయటపెట్టవలసిన పూచీ సాహిత్య విమర్శకులది. విమర్శ అనేది ఎంత thankless job ఐనా, అంతకుమించిన బాధ్యత కూడా! అసలునూ నకిలీని వివరించి నాణ్యతను నిర్ధారించగలిగిన గీటురాళ్లు కలిగిన వారే సాహిత్య విమర్శకులుగా స్థిరపడతారు, గుర్తింపబడతారు.


పాఠకుడిని వస్తువు చేసే మోసాన్ని గ్రహించనివ్వకుండా రూపవాదం దోహదపడుతుంది. రూప విన్యాసాలకు మురిసిపోయే పాఠకులు సారంలోని లోపాన్ని లేక మోసాన్ని గ్రహించలేరు. విమర్శకులు కూడా అదే స్థాయిలో ఉన్నట్లయితే సాహిత్య విమర్శ తన స్థాయిని కోల్పోయినట్టు. రూప వైవిధ్యం, సరికొత్త ప్రయోగం, సృజనాత్మక అభివ్యక్తి అనేవి వస్తు విశేషానికి వన్నెతెచ్చేదిగా ఉండాలి కానీ ‘రూపం కోసమే రూపం’ లాంటి రూపవాద విమర్శ ఉండకూడదనే ప్రగతిశీల వాదులు కోరుకుంటారు.

ఈనాటి సంక్షుభిత, అత్యంత సంక్లిష్ట సామాజిక పరిస్థితులను తెలుసుకోవటానికి, మార్క్సిజం లాంటి తాత్విక దార్శనికత రచయితలకు బాగా సహాయకం కాగలుగుతుంది. ఎందుకంటే దేశాన్ని/ సమాజాన్ని చుట్టిముట్టిన భయంకర సాంస్కృతిక సంక్షోభపు సంక్లిష్ట స్వరూప స్వభావాలను రచయితలు బాగా అర్థం చేసుకుని తమ సాహితీ సృజన కావించాలంటే ఆ సంస్కృతికి మూలమైన ఆర్థిక రాజకీయ లోతుపాతులు, సామాజిక పరిణామాలు అర్థం చేసుకోవడం అవసరం. స్థూలంగా ఈ తరహా దృష్టి కోణాన్ని మార్క్సిస్టు సామాజిక చింతన అని అంటూ ఉంటారు. అయితే కేవలం మార్క్సిస్టు పరిజ్ఞానమే ఉత్తమ సాహిత్య సృజన చేయలేదు. అందుకు జీవితాన్ని దాని వ్యక్తీకరణ రూపమైన మానవ సంబంధాల వెనుక గల సామాజిక కారణాలను అన్వయించుకోవటానికి జీవిత పరిశీలన, సాహిత్య అధ్యయనము, స్వీయ అనుభవమనే ఆచరణ చాలా ముఖ్యం. వైయక్తిక అనుభూతులు, అనుభవవాదం దానికి సరిపోవు.

సాహిత్య – కళారంగాలలో జీవిత సారానికి తగిన రూపాన్ని ఎంచుకోవటం, రూప వైవిధ్యాల బహుముఖ ప్రక్రియలలో నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవటం రచయితల, కళాకారుల ముఖ్య విధి. ఒక శిల్పాన్ని చెక్కటానికి ఎంత శిక్షణ, ఏకాగ్రత, నైపుణ్యం, అంకితభావం కావాలో అవన్నీ ప్రజాకళాకారులకు మార్క్సిస్టు రచయితలకూ అవసరమే. రూపకళలో నైపుణ్యాల సాధన కూడా ఆచరణలో భాగమే. అది కేవలం సిద్ధాంత పరిజ్ఞానంతో లభించేది కాదు. ‘‘సాధనమున పనులు సమకూరు ధరలోన’’! అయితే ‘‘కన్ను పోయేంత కాటుక పెట్టుకోకూడదన్నదే’’ జీవితానుభవం నేర్చేది. అంటే సారాన్ని రూపం మింగెయ్యటమో, బలహీనపరచటమో, నిర్లక్ష్యపరచటమో చేయకూడదన్నమాట.


సాహిత్యంలో వస్తువును–రూపాన్ని రెండు కళ్ళతో పోల్చేవారు ఉన్నారు. వినటానికి ఆ పోలిక బాగానే ఉన్నట్లున్నా అది సరైన పోలిక కాదు. ఒక కన్ను లేకపోయినా రెండవ కన్ను ఒక్క దానితో కూడా చూడగలం. అది అలా ఉంచి ఏ ఒక కంటి కోసంగానీ దాని మీద ఆధారపడిగానీ రెండవ కన్ను లేదు. సాహిత్యంలో వస్తు – రూపాలకు విడివిడి అస్తిత్వం లేదు.

సంఘజీవిగా సామాజిక బాధ్యతతో కూడిన సద్వర్తన కలిగి ఉండమనే వక్కాణింపు లేకుండా, మంచి అలంకరణ చేసుకోమని కొత్త తరాలకు అదే పనిగా చెప్పటం ఎలాంటిదో సాహిత్యంలో రూపవాదం గురించి ఎక్కువ మాట్లాడటం అలాంటిదే! గిరీశం ఇంగ్లీషు మాటలను అడ్డం పెట్టుకున్నట్లు, వ్యక్తిత్వాన్ని కప్పిపుచ్చే అలంకరణ సామాగ్రి కొందరికి బాగా ఉపయోగపడుతుంది. రూపం ఆకర్షణలో పడిన వారిని అది మోసం చేయగలగటం అత్యంత సహజం! కన్యాశుల్కపు గిరీశాన్ని తలదన్నే రాజకీయ గిరీశాల ఏలుబడిలో ప్రజలనే నేటి బుచ్చమ్మలు మోసపోతుంటే దాన్ని బట్ట బయలు చేయవలసిన బాధ్యత సాహితీకారులదే కదా!

నేను అర్థం చేసుకున్న మేరకు రాజకీయాలకు మించిన గొప్ప కళ లేదు. ‘‘రాజకీయాలను మినహాయించిన సాహిత్యం గురించి మాత్రమే మాట్లాడే వారు, అయితే మోసపోయిన వారో లేకుంటే మోసపుచ్చేవారో అయి ఉంటారు,’’ అన్నారు కొడవటిగంటి. జీవితమంటే రాజకీయం కాదు కానీ రాజకీయం స్పృశించని జీవితం లేదు. జీవితాన్ని రాజకీయం ఏ మేరకు ప్రభావితం చేస్తే, శాసిస్తే, అదుపు చేస్తే, అడ్డుకుంటే, ముందుకు నడిపిస్తే – ఆమేరకు సాహిత్యం, కళలు రాజకీయాల్ని తప్పనిసరిగా పట్టించుకోవాలి, నిరసించాలి, ధిక్కరించాలి, ఎదురించాలి, మనస్ఫూర్తిగా బలపరచాలి. అప్పుడు మాత్రమే రచన జీవన వాస్తవికతకు దగ్గర కాగలుగుతుంది. ప్రజల పక్షాన నిలుస్తుంది.

తమకంటే ఎంతో బరువైన శక్తివంతమైన ఏనుగును, మానవులు గోతిలోకి పడగొట్టేది ఆ గోతి పైన చేసిన మోసకారి అలంకరణలతోనే కదా! రూపానికి మోసం చేసే గుణం ఉంది అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏమివ్వగలం? విమర్శకులు తమ విశ్లేషణల ద్వారా, రూపానికున్న మోసపుచ్చే కళను గురించి కూడా పాఠకుల, సాహిత్యకారుల దృష్టికి తేవాలి.

దివి కుమార్

94401 67891

ఇవి కూడా చదవండి

వాట్సాప్ కంటే హైప్డ్ సంవాదినీ చాలా మంచి యాప్: అనువాదిని సంస్థ సీఈఓ

నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతోటే జీవిత భీమా: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

Updated Date - Mar 23 , 2026 | 01:29 AM