Share News

సమాజానికి ‘పోక్సో’ ఓ హెచ్చరిక!

ABN , Publish Date - May 23 , 2026 | 03:09 AM

ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన వంటివి భవిష్యత్తులో జరగకూడదని 2013లో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ ప్రతి లక్ష మంది చిన్నారుల్లో 15.6 మంది పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే లైంగిక...

సమాజానికి ‘పోక్సో’ ఓ హెచ్చరిక!

ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన వంటివి భవిష్యత్తులో జరగకూడదని 2013లో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ ప్రతి లక్ష మంది చిన్నారుల్లో 15.6 మంది పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే లైంగిక నేరాలకు గురవుతున్నారనీ, ఏటికేడాది ఈ చట్టం కింద నమోదయ్యే కేసులు కూడా పెరుగుతున్నాయని జాతీయ నేర నమోదు విభాగం(ఎన్సీఆర్బీ) ఈ మధ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్క 2024లోనే దేశం మొత్తం మీద 69,191 పోక్సో కేసులు నమోదైతే, వారిలో తీవ్ర లైంగిక దాడులకు గురైన బాలికల సంఖ్య 43,675. కాగా ఈ బాధితుల్లో 16–18 ఏళ్ల బాలికలు 24,000 మందికి పైనే ఉన్నారు. ప్రతి పోక్సో కేసు వెనుక చిధ్రమైన ఒక చిన్నారి జీవితమే కాదు, వ్యవస్థాగత లోపమూ కచ్చితంగా ఉంది. ఇటీవల తెలుగు రాష్ర్టాల్లో వెలుగులోకి వచ్చిన రెండు వరుస ఘటనలు నేటి కాలంలో పిల్లల భద్రతా లోపాలను మరోసారి ఎత్తిచూపుతున్నాయి. అదేవిధంగా సమాజానికి ప్రమాద సంకేతాలనూ పంపుతున్నాయి.

హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన సంఘటన, అలాగే ఒంగోలుకు చెందిన ఒక మహిళా ప్రత్యేక అధికారిణి పోక్సో కేసులో జైలుకు వెళ్లడం వంటి సంఘటనలను కేవలం వ్యక్తిగత ఘటనలుగా చూడకూడదు. ఇవి సమాజంలో పెరుగుతున్న ప్రమాదకర ధోరణికి హెచ్చరికలు. విలువల సంక్షోభానికి, అధికార వ్యవస్థల్లో ఏర్పడుతున్న నైతిక పతనానికి ఇవి స్పష్టమైన సంకేతాలు. చాలావరకూ పోక్సో కేసుల్లో బాధితులు తమకు తెలిసిన వ్యక్తుల చేతుల్లో లైంగిక దాడులకు గురవుతున్నారు.

అసలు ఎందుకు ఇటువంటి ఘటనలు పెరుగుతున్నాయి? ఇది కేవలం చట్టవ్యవస్థ వైఫల్యమా? లేక సమాజం మొత్తం నెమ్మదిగా ఒక అనాసక్తి, నైతిక గందరగోళం వైపు జారిపోతుందా? ఇలాంటి ఘటనలు బయటపడినప్పుడల్లా మన సమాజం రెండు ప్రమాదకరమైన ప్రతిస్పందనలు చూపుతోంది. ఒకటి– ఇవి రాజకీయంగా తయారు చేసిన కేసులు కావచ్చు అని. రెండోది– రెండు రోజులు చర్చించి మర్చిపోవడం. ఈ రెండు ధోరణులూ ప్రమాదకరమే. ఇప్పుడు అవసరమైంది కేవలం చట్టాలు సక్రమంగా అమలు కావడం ఒక్కటే కాదు. వాటి గురించి బాలలకు అవగాహన కల్పించడం, బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మెలిగేలా, తమని తాము కాపాడుకునేలా చూడటం కూడా ఎంతో అవసరం.


ఇప్పుడు నేరాల తీరు మారుతోంది. ‘డిజిటల్ గ్రూమింగ్’ అనే కొత్త ముప్పు పిల్లలను మరింత ప్రమాదంలోకి నెడుతోంది. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు, ప్రైవేట్ చాట్స్, గేమింగ్ ప్లాట్‌ఫారాలు– నేరస్తులకు పిల్లల వరకు చేరుకునే మార్గాలుగా మారుతున్నాయి. పిల్లలు ఏం చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనే విషయంలో కుటుంబాల్లో పర్యవేక్షణ తగ్గిపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. అలానే వెబ్ సిరీస్‌లు, సినిమాల్లోని మితిమీరిన నేర, అశ్లీల దృశ్యాలు యువతపై వికృత ప్రభావం చూపుతున్నాయి. వాటి ప్రేరణతో అకృత్యాలకు, నేరాలకు పాల్పడుతున్న మైనర్లు, యువత సంఖ్య కూడా ఇటీవల అధికమవుతోంది. చాలా మంది చిన్నారులు తమపై జరిగిన దాడిని బయటకు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అది లైంగిక దాడి అని తెలియకపోవడం, మరొకటి భయం. ‘కుటుంబ పరువు పోతుంది’ అనే మానసిక ఒత్తిడి వారిని మౌనంలోకి నెడుతోంది. చాలా విద్యాసంస్థల్లో చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం కేవలం పత్రాలకే పరిమితం అవుతోంది. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చాలా చోట్ల స్పష్టమైన అవగాహన ఇవ్వడం లేదు. స్కూల్ కౌన్సిలర్లు, ఫిర్యాదు వ్యవస్థలు సక్రమంగా లేకపోవడంతో పిల్లలకు తమ సమస్యలను చెప్పుకునే అనువైన వాతావరణం విద్యాసంస్థల్లో కరువవుతోంది.

పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే. కాబట్టి వాళ్లని వాళ్లు కాపాడుకోవడంతో పాటు సమాజంలో ఉత్తమ పౌరుడిగా ఎదిగేందుకు రెక్కలు ఇవ్వాలి. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడటమేకాక, స్వేచ్ఛగా ప్రతి విషయం పంచుకునే సమయాన్నీ చొరవనీ కల్పించాలి. ఎన్ని తలమునకలయ్యే బాధ్యతలు ఉన్నా పిల్లల్ని ఓ కంట గమనిస్తూ ఉండాలి. వారి భావోద్వేగాల్ని, భయాల్ని చెప్పకుండానే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.


స్కూళ్లలో నైతిక విలువల పట్ల విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించాలి. అందుకోసం చదువుల్ని సంస్కరించాలి. విద్యాసంస్థల యాజమాన్యాలు సైతం విద్యార్థులను నిశితంగా గమనించాలి. ప్రతి స్కూల్‌లోనూ పిల్లల భద్రతతో పాటు, పోక్సో చట్టం గురించి అవగాహన తరగతులు నిర్వహించాలి. పిల్లలకు సైబర్ నేరాలతోపాటు, చట్టాలు, శిక్షల గురించి కూడా తెలియజెప్పాలి. మీడియాలో నిరంతరం వచ్చే విషయాలను వారి దృష్టికి తేవడంతో పాటు పర్యవసానాలను వివరించి చెప్పాలి. స్కూళ్లలోనే కాదు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి గ్రామవార్డుల వరకూ దీనిని చర్చించదగిన అంశంగా పరిగణించి ప్రభుత్వంతో పాటు ఎన్జీవోలు కూడా సామాన్యుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు నడుం బిగించాలి. పోక్సో చట్టం గురించి చెప్పడంతో పాటు అన్యాయం జరిగిన వెంటనే ఫిర్యాదు చేసే ధోరణిని అలవాటు చేయాలి. ఈ విషయం మనం సీరియస్‌గా తీసుకోకపోతే, రేపటి తరానికి భద్రమైన బాల్యం ఇవ్వలేం.

పద్మ వడ్డె

ఇవి కూడా చదవండి..

ఆ పెళ్లికి వెళితే నన్ను బతకనీయరు.. మీడియాపై ట్రంప్ సెటైర్లు

యురేనియాన్ని వదులుకోం

Updated Date - May 23 , 2026 | 03:09 AM