Share News

వణికిస్తోన్న ద్రవ్యోల్బణం

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:00 AM

ప్రస్తుతం మన దేశంలో ధరలు మండిపోతున్నాయి. ప్రజలను ద్రవ్యోల్బణం వణికిస్తోంది. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం, భరింపదగ్గ గరిష్ఠ పరిమితిని దాటి రెండేళ్ల రికార్డుగా ఇది నమోదైంది.

వణికిస్తోన్న ద్రవ్యోల్బణం

ప్రస్తుతం మన దేశంలో ధరలు మండిపోతున్నాయి. ప్రజలను ద్రవ్యోల్బణం వణికిస్తోంది. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం, భరింపదగ్గ గరిష్ఠ పరిమితిని దాటి రెండేళ్ల రికార్డుగా ఇది నమోదైంది. నిత్యావసరాల వినియోగ ధరల సూచీ ననుసరించి లెక్కించే ద్రవ్యోల్బణం 6శాతం కన్నా పెరిగితే రిజర్వు బ్యాంకు ఆందోళనకర స్థితిగా గుర్తిస్తుంది. తగిన చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఇప్పుడు అది 6.09శాతంగా నమోదైంది. ఈ స్థితికి కారణం అందరూ కొనాల్సిన ఆహార దినుసులు, నూనెలు, పాలు తదితర నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం. సాధారణ జీవనం సాగించడం మరింత ఖరీదైన వ్యవహారం కావడం. నేరుగా ప్రజా జీవనాన్ని ప్రభావితం చేస్తున్న ఈ ద్రవ్యోల్బణం ప్రజలు ఆర్థికంగా ఎంత కష్టంలో ఉన్నారో తెలియజేస్తున్నది. అందుకనే రిజర్వు బ్యాంకు అప్రమత్తమై, తన పరిధిలోని చికిత్సా చర్యలు చేపడుతోంది. అదేమిటంటే వడ్డీ రేట్లు (రెపో) పెంచడం. అయితే ఇలా పెంచడం గత నెలలోనే జరిగింది. ఒకేసారి 25 బేస్ పాయింట్లు పెంచింది. మళ్లీ ఇప్పుడు పెంచితే అది ప్రజల మీద అదనపు భారమవుతుంది. నగదు చలామణీ తగ్గించడం ద్వారా కొనుగోళ్లను అదుపుచేసి డిమాండ్ తగ్గించడం ఒక పరిధి మేరకే పనికొచ్చే మంత్రం. పరిధి దాటితే వికటిస్తుంది కాబట్టి ప్రభుత్వం రిజర్వు బ్యాంకు దారిని పక్కనపెట్టి, మిగతా దారులు వెతకాలి. ప్రతికూల వాతావరణం వల్ల బియ్యం, పప్పుల వంటి ఆహార దినుసుల దిగుబడి తగ్గి, ధరలు పెరిగాయి. బఫర్ నిల్వలు రిలీజ్ చెయ్యడం, మార్కెట్లో ధరలను అమాంతం పెంచకుండా చూడడం లాంటి చర్యలు చేపట్టాలి.


ఆహార ద్రవ్యోల్బణం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉందని, అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రథమ స్థానంలో ఉందని లెక్కలు చెబుతున్నాయి. వరుసగా వస్తోన్న తుపానులు అదనపు కష్టాన్ని తెచ్చినట్లున్నాయి. ఈ కష్టకాలంలో ధరలను అదుపు చెయ్యకపోతే పోషకాహార లేమి సమస్య ఎక్కువవుతుంది. అది మిగతా జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోణంలో ఆలోచించి చేయదగ్గ ఉపశమన కార్యక్రమాలన్నీ చేపట్టాలి. కేవలం బ్యాంకు కోణంలో ఆలోచించి వడ్డీ రేట్లు పెంపు వంటివి చేపడితే ప్రజలకు కష్టనష్టాలు తప్పవు.

డీవీజీ శంకరరావు

ఇవి కూడా చదవండి..

ట్రైన్ డ్రైవర్ క్యాబిన్‌లోకి వెళ్లేందుకు యువతి యత్నం.. ఘటనపై ఆర్పీఎఫ్‌ విచారణ

‘అక్వాన్’ తుపాను: 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 31 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల మోహరింపు

Updated Date - Nov 20 , 2026 | 01:52 AM