Share News

మెరిసే మాల్స్‌లో ‘కూర్చునే హక్కు’!

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:06 AM

సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌, హైపర్‌ మార్కెట్ల కాంతుల వెనుక ఒక చేదు వాస్తవం దాగి ఉంది. ఈ సంస్థల్లో పనిచేస్తున్న సేల్స్‌ బాయ్స్‌, సేల్స్‌ గర్ల్స్‌ దాదాపు పది గంటల పాటు పూర్తిగా నిలబడి పనిచేయాలి. ఒకప్పుడు వినియోగదారులు...

మెరిసే మాల్స్‌లో ‘కూర్చునే హక్కు’!

సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌, హైపర్‌ మార్కెట్ల కాంతుల వెనుక ఒక చేదు వాస్తవం దాగి ఉంది. ఈ సంస్థల్లో పనిచేస్తున్న సేల్స్‌ బాయ్స్‌, సేల్స్‌ గర్ల్స్‌ దాదాపు పది గంటల పాటు పూర్తిగా నిలబడి పనిచేయాలి. ఒకప్పుడు వినియోగదారులు లేని సమయంలో కూర్చునేందుకు స్టూల్స్‌ ఉండేవి. ఇప్పుడు ఆ సౌకర్యం లేదు. వీరికి ఎలాంటి లేబర్‌ చట్టాలూ వర్తించవు. యజమానుల ఇష్టాయిష్టాలే తప్ప, నియమ నిబంధనలు ఉండవు. కనీస మానవ హక్కులు, విశ్రాంతి హక్కులు లేకుండా వారితో పనిచేయించడం అమానుషం.

కార్మికుల ‘కూర్చునే హక్కు’ కోసం కేరళలో జరిగిన పోరాటం స్ఫూర్తిదాయకం. ఈ ఉద్యమం 2007లో కోజికోడ్‌ నగరంలో ప్రారంభమైంది. అక్కడ ఒక షాపులో పనిచేసే 53 ఏళ్ల పాలితొడి విజ్జి అనే మహిళ ఒకసారి టాయిలెట్‌కు వెళ్లాలని తన యజమానిని అడిగింది. అందుకాయన ‘నీళ్లు తక్కువగా తాగు, లేదా ఆపుకో’ అని అమానుషంగా సమాధానం ఇచ్చాడు. ఈ అవమానం ఆమెను ఉద్యమ మార్గంలోకి నడిపించింది. షాపుల్లో పనిచేసే మహిళలకు కనీస టాయిలెట్‌ సౌకర్యం లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని ఆమె గమనించింది. 2010లో ఆమె ‘పెన్‌కూటు’ అనే మహిళా సంఘాన్ని స్థాపించింది. మహిళా ఉద్యోగుల కోసం పోరాటాన్ని ఆరంభించింది. ఈ సంఘం డిమాండ్లను వ్యాపార సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి, చౌకబారు వ్యాఖ్యలు చేశాయి. అయినా విజ్జి తన పోరాటాన్ని ఆపలేదు. 2014లో ఆమె కేరళ ప్రభుత్వ మహిళా కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఫలితంగా 2018లో కేరళ ప్రభుత్వం చట్ట సవరణను తీసుకువచ్చి, 2019లో ‘కూర్చునే హక్కు’ను చట్టబద్ధం చేసింది. విజ్జి చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం కూడా కూర్చునే హక్కు చట్టంగా తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో మాత్రం ఇంతవరకు ఎలాంటి చట్టమూ చెయ్యలేదు.


కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు ఉన్నా వాటిని యజమానులు పాటించడం లేదు. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా ఇప్పటి వరకు ఈ అంశంపై స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. ఈ అన్యాయంపై మనమందరం స్వరం విప్పాలి. సోషల్‌ మీడియా, పత్రికలు, టీవీ చర్చల ద్వారా సమస్యను ప్రజల్లోకి తీసుకురావాలి. మాల్స్‌, షాపుల్లో ఉద్యోగులు కూర్చునే సౌకర్యాలు తప్పనిసరి చేయాలి. వారి కోసం టాయ్‌లెట్‌లు ఏర్పాటు చేయాలి. షిఫ్టు విధానం, విశ్రాంతి అమలు చేయాలి. అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు, స్పష్టమైన ఉద్యోగ నియమాలు ఇవ్వాలి. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ తక్షణమే తగిన విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. మెరిసే మాల్స్‌ వెనుక వేలాది యువజీవితాలు నలిగిపోతున్నాయి. వారికి కనీస హక్కులు, ఆరోగ్య హక్కులు కల్పించకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. కేరళలో విజ్జి ప్రారంభించిన ఉద్యమం ఇక్కడ కూడా మొదలయ్యేలా మనమంతా తోడ్పడాలి.

భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌

ALso Read:

18 నగర వనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

2026 హజ్ యాత్రికులకు రూ. లక్ష సబ్సిడీ విడుదల

Updated Date - Jul 02 , 2026 | 01:06 AM