Share News

గణ రాజ్యమా? గణతంత్రమా?

ABN , Publish Date - Jan 29 , 2026 | 03:02 AM

భారత రాజ్యాంగం మన రిపబ్లిక్‌ను గణ రాజ్యంగా పేర్కొంది. భారత పౌరుల పాస్‌పోర్ట్‌లో కూడా గణరాజ్యం అనే ఉంటుంది. అయితే మన రిపబ్లిక్‌ డే (జనవరి 26)ను అధికారికంగా భారత...

గణ రాజ్యమా? గణతంత్రమా?

భారత రాజ్యాంగం మన రిపబ్లిక్‌ను గణ రాజ్యంగా పేర్కొంది. భారత పౌరుల పాస్‌పోర్ట్‌లో కూడా గణరాజ్యం అనే ఉంటుంది. అయితే మన రిపబ్లిక్‌ డే (జనవరి 26)ను అధికారికంగా భారత గణతంత్ర దినోత్సవంగా పిలవడం ఆనవాయితీగా ఉంది. ఇదొక చిన్న వ్యత్యాసం మాత్రమేనని మీరు భావించవచ్చు. బహుశా, అజాగ్రత్త వల్ల సంభవించిన అనాలోచిత తప్పిదంగా మీరు ఉపేక్షిస్తుండవచ్చు. ఒక సూక్ష్మమైన తేడాగా మీరు పరిగణిస్తుండవచ్చు. మన ప్రజాస్వామ్య వర్తమానం, భవితవ్యం గురించి నేను హిందీలో రాసిన పుస్తకం శీర్షిక ‘గణరాజ్య కా స్వధర్మ్‌’. ఆ శీర్షిక ‘గణతంత్ర కా స్వధర్మ్‌’గా ఉండాలని ప్రచురణకర్త ప్రతిపాదించారు. అయితే నేను పెట్టిన శీర్షికను మార్చవద్దని గట్టిగా చెప్పినప్పుడు ఆయన అభిప్రాయాలు పైన ప్రస్తావితమయినట్టుగా ఉన్నాయని నాకు అర్థమయింది.

ఇది చాలా చిన్న తేడాగా కనిపిస్తుండవచ్చు గానీ ఆ స్వల్ప భేదాన్ని లోతుగా శోధించవలసి ఉన్నది. ఎందుకంటే గణతంత్రం, గణరాజ్యం అనేవి రెండు విభిన్న భావనలు. ఆ రెండిటికీ ఆంగ్లంలో ఒకే ఒక్క పదం ఉన్నది. ఆ మాట ‘రిపబ్లిక్‌’. బాగా సుపరిచితమైన, ఆధిపత్య భావన అయిన గణతంత్రం నుంచి గణరాజ్యం భావనను వేరు చేయవలసిన అవసరమున్నది. అలా వేరు చేసినప్పుడే గణరాజ్యం భావనలో ఉన్న విశిష్ట అర్థాలను విశదం చేసుకోగలుగుతాము. మరీ ముఖ్యంగా మన గణరాజ్యం భావన కోల్పోయిన ఆ అర్థాలను మనం తిరిగి సాధించుకోగలుగుతాము. తద్వారా ఇప్పుడు మన ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోగలుగుతాము. భారత గణ రాజ్యాన్ని సమున్నతం చేసుకునేందుకు ఇది అత్యవసరం..

నేడు వాడుకలో ఉన్న ఈ రెండు పదాలలో ఒకటి తప్పు అని నేను సూచించడం లేదు. ఈ రోజుల్లోని నాయకుల వలే కాకుండా మన రాజ్యాంగ నిర్మాతలు, మన రిపబ్లిక్‌ తొలి సంరక్షకులు తాము ఉపయోగించే పదాల విషయంలో చాలా జాగ్రత్తగా, వివేచనాయుతంగా ఉండేవారు. జనవరి 26ను గణరాజ్య దినోత్సవంగా కాకుండా గణతంత్ర దినోత్సవంగా వారు పిలవడానికి సహేతుకమైన కారణాలు ఉండివుంటాయి. ఆ రెండు పదాలలో ఒకటి రెండో దాని కంటే మరింత ప్రామాణికమైనదని నేను చెప్పడం లేదు. నిజానికి గణతంత్రం, గణరాజ్యం అనే పదాలు ఇటీవలి కాలానివి (19 లేదా 20వ శతాబ్దానివి)అని సంస్కృత భాషా కోవిదులు చెబుతుంటారు. పురాతన భారతదేశంలో రిపబ్లిక్‌లను ‘గణరాజ్య’ లేదా ‘గణతంత్ర’ అని కాకుండా ‘గణ’ లేదా ‘సంఘ’ అని మాత్రమే పిలిచేవారు. ఈ పదాలకు చారిత్రక వాస్తవాలు అయిన ప్రాచీన భారత ‘గణాల’కు మధ్య ఒక ప్రత్యక్ష సంబంధమున్నదని నేను వాదించడం లేదు. ఆ పురాతన రాజకీయ నిర్మాణాలను ఆధునిక ప్రజాస్వామిక గణ రాజ్యాలతో పోల్చవద్దని చరిత్రకారులు హెచ్చరిస్తున్నారు. బుద్ధుడి కాలంలోని వైశాలి, లిచ్ఛవీ గణ రాజ్యాలు వంశపారంపర్య కులీన పాలనా వ్యవస్థలే గానీ మనం అర్థం చేసుకునే ఆధునిక ప్రజాస్వామ్యాలు కానే కావు. చెప్పవచ్చినదేమిటంటే గణతంత్రం, గణరాజ్యం భావనల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి, వాటి ప్రత్యేకతలను, అవి పురిగొల్పే భిన్న రాజకీయ సంభావ్యతలను అర్థం చేసుకుని, మన ప్రజాస్వామ్య వర్తమాన సమస్యలను అధిగమించేందుకు స్ఫూర్తి పొందాలి.


గణతంత్రం అనేది ఒక రిపబ్లిక్‌కు ఉన్న ప్రతికూల, సంకుచిత అర్థాన్ని సూచిస్తుంది. రాజ్యాధిపతిగా ఉండే వ్యక్తి జన్మహక్కు ద్వారా నిర్ణయింపబడని ప్రభుత్వ వ్యవస్థ ఉన్న దేశం గణతంత్ర రాజ్యమని రాజనీతి శాస్త్ర పాఠ్యగ్రంథాలు మనకు చెబుతాయి. బ్రిటన్‌ను రాజు/ రాణి పరిపాలిస్తుంటారు. కనుక అది రిపబ్లిక్‌ కాదు. నేపాల్‌ రాచరికాన్ని రద్దు చేసింది. అది ఇప్పుడు ఒక రిపబ్లిక్‌. చాలా తక్కువగా ఉన్న నామమాత్ర రాచరికాలను మినహాయిస్తే ఇప్పుడు ప్రతి దేశమూ ఒక ప్రజాస్వామిక లేదా మరో తరహా రిపబ్లిక్‌గా ఉన్నది. గణతంత్రను కొన్నిసార్లు ఒక విశాల అర్థంలో వాడుతుంటారు. కేవలం రాచరికం లేకపోవడం అనే రాజకీయ వాస్తవాన్నే కాకుండా ప్రజా సార్వభౌమత్వ వ్యవస్థను సూచించేందుకు కూడా దాన్ని ఉపయోగిస్తారు. ప్రజా సార్వభౌమత్వానికి ప్రాతిపదిక అయిన ఎన్నికల ప్రజాస్వామ్య సంస్థాగత నిర్మాణాలను వివరించేందుకు గణతంత్ర భావనను ఉపయోగిస్తారు. ఈ విశాల అర్థంలో గణతంత్ర, లోక్‌తంత్ర లేదా ఎన్నికల ప్రజాస్వామ్యానికి ఒక పర్యాయపదం. అయితే ఇదొక అలంకారిక వ్యక్తీకరణగా మిగిలిపోతోంది. మన రాజకీయ భావనాశక్తి వికాసానికి దోహదం చేసేదిగా ఉండడం లేదు.

గణతంత్రకు భిన్నంగా గణరాజ్యం మనలను ఒక రిపబ్లిక్‌ భావనలో ఉన్న సానుకూల, అభ్యుదయాత్మక భావాలు, ఆశయాలకు తీసుకువెళ్తుంది. ఈ ప్రకారం గణరాజ్యం ఒక సాధారణ రాజకీయ వ్యవస్థ. ఈ వ్యవస్థలో సంఘం అంటే కేవలం వ్యక్తుల సముదాయం కాదు, సమానుల సమాజం. తమ సమష్టి వ్యవహారాల నిర్వహణకు స్వంత నిబంధనలను, ఒక విశిష్ట ధర్మాన్ని రూపొందించుకునే సమానుల సమాజం. పౌర ధర్మాలను పెంపొందించడం ద్వారా అది ఆ విశిష్ట ధర్మాన్ని స్థిరపరుస్తుంది. పాలకులను జవాబుదారీగా చేయడం ద్వారా ప్రజలు సమష్టి సంకల్పంతో ఆ ధర్మాన్ని అమలుపరుస్తారు. ప్రజలు కేవలం అధికారానికి మూలం మాత్రమే కాదు, దాన్ని సక్రమంగా ఉపయోగించేలా నియంత్రించే, ప్రభావితం చేసే శక్తులు కూడా. పౌర ధర్మం, స్వపరిపాలన, ఏకపక్ష అధికారం నుంచి స్వేచ్ఛ సమానుల సమాజం లక్ష్యంగా ఉంటుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రజా సార్వభౌమాధికారమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. యూరోపియన్‌ ‘రిపబ్లికనిజం’ సంప్రదాయాలు ప్రజా సౌర్వభౌమత్వానికి నిబద్ధమైనవి. ఇటీవలి సంవత్సరాలలో పాశ్చాత్య రాజనీతి చింతనలో ఒక మౌలిక మార్పు చోటుచేసుకున్నది. దీని ప్రకారం గణరాజ్యం అంటే రాజరికం లేకపోవడం మాత్రమే కాదు, ఎలాంటి ఆధిపత్యాలు లేని వ్యవస్థ. క్రియాశీల పౌరసత్వానికి ప్రాధాన్యమిస్తూ ఆధిపత్యం లేని స్వేచ్ఛ వర్ధిల్లేదే గణరాజ్యం అని ఈ నవీన రాజకీయ చింతన స్పష్టం చేసింది.


గణరాజ్యం గురించిన ఈ పాశ్చాత్య భావనే భారత జాతీయోద్యమం సమర్థించిన గణరాజ్య భావన కూడా. అధికారం ఒక వ్యక్తిలో కేంద్రీకృతం కాకుండా సమాన భాగస్వాముల మధ్య పంచుకోబడే భాగస్వామ్య సార్వభౌమత్వాన్ని సూచించే పురాతన పాళీ వ్యక్తీకరణ ‘సమన్న– రాజ్య’ ఈ నవీన గణరాజ్య భావనకు సన్నిహితంగా ఉన్నది. ఆధునిక వాడుకలో మన ‘జన్‌– గణ్‌– మన్‌’ భారతీయ గణరాజ్య భావనా స్ఫూర్తిని వ్యక్తీకరిస్తుంది. జన్‌ అంటే ప్రజలు– సార్వభౌమత్వాధికారానికి మూలాధారాలు. ప్రతి ఒక్కరూ సమానులుగా నిర్ణయాలు తీసుకునే ఒక రాజకీయ సమాజంగా ప్రజలు సంఘటితమవడం ‘గణ్‌’కు అవసరం. ‘మన్‌’ అనేది సామూహిక నైతిక మనస్సాక్షి. ఇది కేవలం ఒక నిర్దిష్ట సమయంలో ప్రచలితంగా ఉండే ప్రజాభిప్రాయం మాత్రమే కాకుండా ప్రజలు అన్ని వేళలా ఆమోదించి అనుసరించే నైతిక ఆదర్శాలను తెలియజేస్తుంది. ఇవి భారత రాజ్యాంగ విశిష్టతను వెల్లడిస్తాయి.

ఈ భారతీయ గణరాజ్య భావన అనివార్యంగా ఒక ప్రశ్నకు దారితీస్తోంది: భారత్‌ గణరాజ్యాన్ని (రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా) విశిష్టంగా తీర్చిదిద్దుతున్న నైతిక ఆదర్శాలు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం భారత రాజ్యాంగ పీఠిక. ప్రాచీన భారతీయ నాగరికతా విలువలను ఆధునిక రాజ్యాంగ సూత్రాలతో కలగలిపి భారత గణరాజ్యం ఒక శక్తిమంతమైన, వైవిధ్యమైన, సమ్మిళిత ప్రజాస్వామ్యంగా ఉండేలా మన రాజ్యాంగ పీఠిక నిర్దేశించింది. అయితే భారత రాజ్యాంగం ఇప్పుడు పలు విధాలా తీవ్ర దాడులకు గురవుతున్న వాస్తవాన్ని విస్మరించలేము, విస్మరించకూడదు. భారత రాజ్యాంగ విలువలను మనం ఎందుకు విశ్వసించాలి? అన్న ప్రశ్నను మనకు మనం వేసుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం రాజ్యాంగసభ చర్చలు, సమాలోచనల ఆవలకు వెళుతుంది. ఎందుకంటే మన రాజ్యాంగం కేవలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో లిఖితమైనది కాదు. అది కనీసం వంద సంవత్సరాలుగా జరిగిన జాతి నిర్మాణ ప్రయత్నాల పరాకాష్ఠ. స్వాతంత్ర్య పోరాటాలు, శానన ప్రయోగాలు, భారత రాజ్య స్వభావం గురించి జాతీయోద్యమ నాయకుల మేధో మథనం సమష్టి ఫలితమది. బ్రిటిష్‌ వలసపాలన నుంచి భారత్‌కు స్వాతంత్ర్యాన్ని సాధించడం మాత్రమే భారత జాతీయోద్యమ ధ్యేయం కాదు. పురానవ దేశమైన భారత్‌ను సమగ్రంగా పునర్నిర్మించడమే మన జాతీయోద్యమ సమున్నత లక్ష్యం. భారత జాతీయవాదం యూరోపియన్‌ జాతీయవాద సంప్రదాయాలకు అనుకరణ కాదు. భారతీయ నాగరికత వారసత్వం, పాశ్చాత్య ఆధునికతల సమన్వయ పరిణామమది. ఈ సమన్వయంలో సామరస్యమూ ఉన్నది, సంఘర్షణా ఉన్నది.

గణరాజ్య భావనకు ప్రాతిపదికగా ఉన్న నైతిక ఆదర్శాలు మన రిపబ్లిక్‌ స్వధర్మ (స్వభావం)ను వెల్లడించేందుకు మనలను పురిగొల్పుతాయి. ఈ స్వధర్మం తరచూ ఉటంకించబడే ‘భారత్‌ భావన’ అని చెప్పి తీరాలి. ఇది మనలను ఒక కఠోర నిర్ధారణకు వచ్చేలా చేస్తోంది: ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నది భారత ప్రజాస్వామ్య తిరోగమనం, భారత రాజ్యాంగాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు మాత్రమే కాదు. మన గణరాజ్యం స్వధర్మం అంటే భారత్‌ భావనపై జరుగుతున్న ఎడతెగని దాడి. మన గణరాజ్య స్వధర్మాన్ని సంరక్షించుకోవడమే మన అనుదిన కర్తవ్యం కావాలి.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఇవి కూడా చదవండి

ఆదివాసీల అస్తిత్వ పతాక ‘మేడారం’

రాజ్యాంగ నిష్ఠను త్యజిస్తున్న గవర్నర్లు!

Updated Date - Jan 29 , 2026 | 03:02 AM