Share News

మతాల్లోకి నినాదాల చొరబాటు అప్పుడే!

ABN , Publish Date - Oct 29 , 2026 | 03:31 AM

రాజకీయాలలో నినాదాలు ఎప్పటినించో ఉన్నాయి. ‘స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం’ అనే నినాదాలు ఫ్రెంచి విప్లవంలో వినవచ్చాయి. ‘సకల దేశాల కార్మికులారా ఏకంకండి!’ అన్నది...

మతాల్లోకి నినాదాల చొరబాటు అప్పుడే!

రాజకీయాలలో నినాదాలు ఎప్పటినించో ఉన్నాయి. ‘స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం’ అనే నినాదాలు ఫ్రెంచి విప్లవంలో వినవచ్చాయి. ‘సకల దేశాల కార్మికులారా ఏకంకండి!’ అన్నది కమ్యూనిస్టుల రాజకీయ నినాదం. మతాలకి నినాదాలంటూ లేవు, చరిత్రలో ఎంత వెతికినా! వాటిల్లో ఉండేవి సూక్తులూ, బోధనలూ వంటివి మాత్రమే. వాటిని నినాదాలు అనడం కుదరదు. కానీ, ఓట్ల రాజకీయాలు వచ్చాక, కొన్ని పార్టీలు మత నినాదాలను సృష్టించి, పెద్ద ఎత్తున ఓట్లను లాగడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీ భావజాలమూ, విధానాలూ ఎంత దుర్మార్గమైనవి అయినా, ఆ పార్టీకి లేదా ఆ పార్టీ నాయకత్వాన ఉండే కూటమికి, ఎక్కువ సీట్లు వస్తే, ఆ పార్టీకి చట్టపరంగా ఆమోదముద్ర (లెజిటిమసీ) దొరికినట్టే! ఆ ఆమోదముద్రని పొందడానికి, ఆ పార్టీలు ఇచ్చే మత నినాదాలు కొన్ని సూటిగానూ, కొన్ని నర్మగర్భంగానూ ఉంటాయి. ముందు మెజారిటీ మత ఓట్ల కోసం చేసే నినాదాలు కొన్ని:

‘‘జై శ్రీరామ్/ హర హర మహాదేవ్/ గో మాతాకీ జై/ హిందుస్థాన్‌లో ఉండాలంటే, వందేమాతరం అనాల్సిందే/ గర్వంగా చెప్పండి మేము హిందువులం అని/ ఇప్పటికి ఈ దెబ్బ కాయ్, కాశీ–మధురాలున్నాయి బకాయి/ ముల్లాలను నరికినప్పుడు, వాళ్లు రామా! రామా! అని అరిచి గీపెడతారు!/ హిందువులం విడిపోతే అంతమైపోతాం/ (ముస్లిం–) చొరబాటుదారులు లేని భారత్/ ముస్లింల శ్మశానం ఉంటే, హిందువుల శ్మశానమూ ఉండాలి?’’

మరి, ముస్లిం రాజకీయ సంస్థలు మతోన్మాద నినాదాలు ఇవ్వవా– అంటే, ఇస్తాయి. కానీ, వాటిల్లో ఎక్కువ భాగం, ఇతర మతాల వారిమీద దాడిలా కాకుండా, మైనారిటీలు ఆత్మరక్షణ కోసం చేసే ప్రయత్నాలుగానే కనిపిస్తాయి. అన్ని ఇతర మతాల దేవుళ్ల కంటే, తమ దేవుడే గొప్పవాడు అనీ; తమ దేవుణ్ని దూషిస్తే, దేహంనించి తలని వేరుచేయడం ఒక్కటే సరైన శిక్ష అనీ– ఇలా తమ దేవుణ్నీ, మతాన్నీ కీర్తించుకునేవే!

ఇప్పటికి రికార్డయిన ఒకే ఒక మైనారిటీ మతోన్మాద నినాదం మాత్రం 2022 మే 25న కేరళలో వినిపించింది. అలెప్పీలో రెండు ముస్లిం రాజకీయ సంస్థలు నడిపిన ఊరేగింపులో, 10 ఏళ్ల పిల్లవాణ్ని, ఒక వ్యక్తి భుజాలమీద కూర్చోబెట్టుకుని, వాడి చేత హిందువుల్నీ, క్రైస్తవుల్నీ ఉద్దేశించి, పలికించిన నినాదం ఇలా ఉంది: ‘‘హిందువులు తమ అంతిమ సంస్కారాల కోసం బియ్యాన్ని (పిండాన్ని) సిద్ధం చేసుకోవాలి, క్రైస్తవులు తమ అంతిమ సంస్కారాల కోసం సాంబ్రాణిని సిద్ధం చేసుకోవాలి. మీరు మర్యాదగా బతికితే మా భూమిలో ఉండొచ్చు. లేకపోతే మాకు ఆజాదీ ఎలా తీసుకోవాలో తెలుసు. మర్యాదగా బతకండి, మర్యాదగా బతకండి, మర్యాదగా బతకండి!’’


ఈ రకపు మతపరమైన నినాదాలు, ఏ మతానికి చెందిన రాజకీయ సంస్థలు చేసినా, వాటి ఉద్దేశం: నిజమైన సమస్యల నించి దృష్టి మళ్లించడం! నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం, అవినీతి వంటి నిజమైన సమస్యలపై చర్చ జరగకుండా ఓటర్ల దృష్టిని మళ్లించడానికి ఈ నినాదాలు ఉపయోగపడతాయి. మతపరమైన ఉద్రేకాల్ని వర్గ స్పృహ లేని ప్రజల్లో రగిలిస్తాయి. శ్రామిక వర్గ రాజకీయాల బదులు, మత గుర్తింపు రాజకీయాల్ని ముందుకు తెచ్చి, ప్రజల్లో చీలికలు తెస్తాయి. తమ మతానికి చెందిన ప్రజలకు తామే రక్షకులమనే భ్రమను కలిగించడానికి మతతత్వ పార్టీలు ఇటువంటి నినాదాలను ఆశ్రయిస్తాయి. పైగా ఇవి ఎన్నికల సమయంలో తక్షణ ప్రభావాన్ని చూపుతాయి, ఓట్ల రూపంలో.

ఓట్లు ఎందుకు? అధికారంలోకి రావడానికి! వచ్చాక వీళ్లు చేసే పరిపాలన ఎవరికి మేలు చేస్తుంది? లాభాలూ, కౌళ్లూ, వడ్డీలూ, వర్తక కమీషన్లూ వంటి దోపిడీ ఆదాయాల మీద బతికే వర్గాలకు. ఆ వర్గాలలో ఉండేది ఎవరు? అన్ని మతాలకీ చెందిన పరిశ్రమల యజమానులూ, భూస్వాములూ, వర్తకులూనూ! వీళ్ల ప్రయోజనాల కోసమే రాజకీయ పార్టీలు పనిచేస్తాయి. ఈనాడు, మతతత్వ రాజకీయాలు నడుపుతున్న పార్టీలకి పితృసమానులు, 120 ఏళ్ల కిందట మతం పేరుతో రెండు రాజకీయ సంస్థల్ని ఏర్పరిచారు. ఈ సంస్థల గురించిన చరిత్ర పుస్తకాలు చాలానే ఉన్నాయి. వాటినించీ కొన్ని వివరాలు:

1) 1906లో మొదలైన ‘ఆలిండియా ముస్లిం లీగ్’. దీన్ని స్థాపించినవాళ్లు– ముస్లిం భూస్వాములూ, బ్రిటిష్ ఇండియాలో పనిచేసి రిటైరైన ఉన్నతాధికారులూ, పెద్దస్థాయి వర్తకులూ, ఉన్నత విద్యావంతులూనూ. వారిలో కొందరి పేర్లు: నవాబ్ ఖ్వాజా సలీముల్లా, సర్ సుల్తాన్ మొహమ్మద్ షా, నవాబ్ మొహ్సిన్–ఉల్–ముల్క్, సర్ ఆడమ్‌జీ పీర్‌భాయ్, హాజీ సాబూ సిద్దిక్. మొఘలుల తర్వాత వచ్చిన బ్రిటిష్ పాలనలో, తమ భూముల్నీ, వ్యాపారాల్నీ, ఉద్యోగాలలో వాటాలనూ కాపాడుకోవడం కోసం ఏర్పడ్డ సంస్థ ఇది. వీళ్లకి ప్రధాన పోటీదారులు హిందూమతానికి చెందిన భూస్వాములూ, పరిశ్రమాధిపతులూ, వర్తకులూ, ఉన్నత విద్యావంతులూనూ!

2) 1909 నించీ, వేరువేరు ప్రాంతాలలో కొన్ని శాఖలుగా ఏర్పడి, 1915 నాటికి దేశవ్యాప్తంగా ఏర్పడ్డ ‘హిందూ మహాసభ’. దీన్ని స్థాపించినవాళ్లు: హిందూ మతానికి చెందిన జమీందార్లూ, బ్యాంకర్లూ, పరిశ్రమాధిపతులూ, వర్తకులూ, ఉన్నత విద్యావంతులూనూ. వారిలో కొందరి పేర్లు: మహారాజా సర్ మణీంద్ర చంద్ర నంది, రాజా రాంపాల్ సింగ్, మహారాజా సర్ రామేశ్వర్ సింగ్, రాజా నరేంద్రనాథ్, రాయ్ బహదూర్, లాలా లాల్‌చంద్‌.


మనం ముఖ్యంగా గమనించవలిసింది ఏమిటంటే– మత నినాదాల ముసుగులో, అప్పుడైనా, ఇప్పుడైనా, ఈ మత రాజకీయ సంస్థల ధ్యేయం అధికారంలోకి రావడమే. అవసరమైతే, వాళ్ల మధ్య ఉన్న వివాదాలను పక్కనబెట్టి, అధికారాన్ని పంచుకుంటారు కూడా! 1940–1945కి మధ్య, శత్రుమత సోదర సంస్థలైన ముస్లిం లీగూ, హిందూ మహాసభా, అప్పటి బ్రిటిష్ ఇండియాలో, కనీసం 3 పెద్ద ప్రాంతాలలో, సంకీర్ణ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే, పరస్పరం పోటీపడే పెట్టుబడిదారీ వర్గ సంస్థలే అయినప్పటికీ, అవి కొన్ని సమయాల్లో ‘గోడల్లో ఇటుకల్లా’ కలిసిపోతాయి. ఇలాంటి పరిస్థితినే, మార్క్సు ఇలా వర్ణిస్తాడు: ‘‘తమ మధ్య జరిగే పోటీలో ఒకరిపై ఒకరికి ఎంతమాత్రం సదభిప్రాయం లేనప్పటికీ, మొత్తం శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా నిలబడేటప్పుడు మాత్రం పెట్టుబడిదారులంతా ఒక నిజమైన ‘ఫ్రీమేసన్ కూటమి’ (పరస్పరం సహకరించుకునే రహస్య సోదర సంఘం) లాగా ఏకమవుతారని చెప్పడానికి మన దగ్గర గణితశాస్త్రపరమైన స్పష్టమైన నిరూపణ ఉంది.’’ (‘కాపిటల్’–3, చాప్టర్–10)

ఇంతకీ అప్పుడైనా, ఇప్పుడైనా, వాళ్లు చేసిన, చేసే ఘనకార్యం ఏమిటి? శ్రామిక ప్రజల నించీ లాగిన అదనపు విలువని కౌళ్లూ, లాభాలూ, వర్తక కమీషన్లూ, వడ్డీలూ– అనే ఆదాయాల రూపాల్లో పంచుకోవడం.

వీళ్ల గురించి ‘సయ్యద్ అలీ జవాద్ జైదీ’ అనే కవి, శ్రామికవర్గపు భావజాల గ్రహింపుతో చక్కటి ప్రాసతో ఉర్దూలో ఇలా రాశాడు: ‘‘ముస్లిం లీగ్ అయినా, హిందూ మహాసభ అయినా, ఈ రెండూ పెట్టుబడిదారుల చేతుల్లో బానిసలే. శ్రామికుడి నోటికాడి కూడును లాక్కొని, ఆకలిని దాచడానికి వీళ్లు మతం పేరిట రాజకీయం చేస్తారు. కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం, కుర్చీలాట కోసం ఒకే దేశంలో కలిసి బతికే అన్నదమ్ముల్లాంటి హిందూ–ముస్లింలను విడదీసి కొట్లాటలు పెడతారు. వీళ్లు నడిపే ఈ ద్వేషపూరితమైన దుకాణాలలో (‘నఫ్రత్ కే దుకాన్’) బలైపోయేదీ, నడిరోడ్డుపై చిందేదీ ఎప్పుడూ పేదవాడి, శ్రామికుడి రక్తమే.’’

బి.ఆర్. బాపూజీ

ఈ వార్తలనూ చదవండి:

బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్

’ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు

Updated Date - Oct 29 , 2026 | 03:31 AM