Share News

ఒక ప్రాథమిక హక్కు కోసం మరో ప్రాథమిక హక్కుని కోల్పోవాలా?

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:55 AM

కులం, మతం లాంటి అస్తిత్వాలు సామాజిక–రాజకీయ–ఆర్థిక చట్రంలో ఒక విధంగా పనిచేస్తే, న్యాయ, పరిపాలనా రంగాల్లో మాత్రం వాటి అర్థాలు, చరిత్రలు ప్రత్యేక రూపాలు తీసుకుంటాయి. ఈ విషయం అక్టోబర్ 15న...

ఒక ప్రాథమిక హక్కు కోసం మరో ప్రాథమిక హక్కుని కోల్పోవాలా?

కులం, మతం లాంటి అస్తిత్వాలు సామాజిక–రాజకీయ–ఆర్థిక చట్రంలో ఒక విధంగా పనిచేస్తే, న్యాయ, పరిపాలనా రంగాల్లో మాత్రం వాటి అర్థాలు, చరిత్రలు ప్రత్యేక రూపాలు తీసుకుంటాయి. ఈ విషయం అక్టోబర్ 15న ‘ది సెక్రటరీ టు గవర్నమెంట్ వర్సెస్ సమీర్ అహ్మద్ అండ్ అదర్స్‌’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా మరొక్కసారి తేటతెల్లం అయ్యింది.

తమిళనాడులో ట్యూటికొరిన్ జిల్లాకి చెందిన సమీర్ అహ్మద్ హిందూ మతంలో వెనుకబడిన తరగతులకి చెందిన ఒక కులంలో జన్మించారు. 2015లో ఇస్లాం మతం తీసుకున్నారు. తర్వాత ఇస్లాం మత ఆచారాల ప్రకారమే పెళ్లి చేసుకున్నారు. తమిళనాడులో కొన్ని ముస్లిం సమూహాలని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చారు. అందులో ‘లెబెయ్’ ఒకటి. వీరు చారిత్రకంగా వర్తకులు. తనను ఆ సమూహానికి చెందినవాడిగా గుర్తిస్తూ, వెనుకబడిన తరగతుల ధ్రువీకరణ పత్రం ఇవ్వమని సమీర్ అహ్మద్ 2020లో స్థానిక తహసీల్దారుకి అర్జీ పెట్టుకున్నారు. అయితే అతను కేవలం మతం మారాడే కానీ కులం కాదు కాబట్టి ఇవ్వటం కుదరదని తహసీల్దార్ తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో 2022లో సమీర్ అహ్మద్ సవాలు చేశారు. ఈ కేసు అక్కడ ఉండగానే 2024లో తమిళనాడు ప్రభుత్వం ఒక ఉత్తర్వు విడుదల చేసింది. హైందవ మతం నుంచి ఎవరైనా ఇస్లాంలోకి మారితే, వారికి వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చిన ఏదైనా సమూహానికి చెందిన వ్యక్తిగా ధ్రువీకరణ పత్రం ఇవ్వవచ్చునని ఈ ఉత్తర్వు సారాంశం. దీని ప్రకారం సమీర్ అహ్మద్‌కి తాను కోరుకున్న లెబెయ్ ధ్రువీకరణ పత్రం సమకూరుతుంది. అయితే మద్రాస్ హైకోర్టు 2026లో ఈ ప్రభుత్వ ఉత్తర్వుని కొట్టివేసింది. పర్యవసానంగా సమీర్ అహ్మద్ కేసును కూడా కొట్టివేసింది. ఈ తీర్పుని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.

‘ఇస్లాం ధర్మశాస్త్రం అసమానతను వ్యతిరేకించినా కూడా వాస్తవంగా ఇస్లాంలో కూడా వర్ణ–కుల వ్యవస్థలని తలపించే సోపానుక్రమ కట్టుబాట్లు ఉన్నాయని, అయితే వాటి ఆధారం హైందవ ధర్మంలో లాగా మతంలో లేదని, అవి చారిత్రకంగా ఏర్పడిన కట్టుబాట్లు’ అని వివిధ అకడెమిక్ పేపర్లని ఉటంకిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అదే విధంగా రాజ్యాంగంలో వెనుకబడిన తరగతులు అనే కేటగిరీకి కులం ఒక్కటే ప్రాతిపదిక కాదని 35 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇందిరా సాహ్నే కేసులో ఇచ్చిన తీర్పును కూడా ఉటంకించింది.


అయితే ప్రస్తుత ప్రశ్న హైందవేతర మతాలలో వెనుకబడిన తరగతులు ఉన్నాయా లేవా అని కాదు. అవి కచ్చితంగా ఉన్నాయి కాబట్టే అనేక రాష్ట్రాలలో ఇస్లాంలోని వివిధ సమూహాలని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చారు. ఇక్కడ ప్రశ్న హైందవ మతానికి సంబంధించిన వెనుకబడిన తరగతుల కులం నుంచి హైందవేతర మతంలోకి– ముఖ్యంగా ఇస్లాంలోకి– మారినప్పుడు ఆ మతానికి సంబంధించిన వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న ఏదైనా సమూహానికి సదరు వ్యక్తి చట్టబద్ధంగా భాగం అవుతారా లేదా అన్నది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు అవ్వరు అని స్పష్టం చేసింది.

హైందవ మతంలోని ఒక కులం నుంచి ఇస్లాం మతంలోకి మారినప్పుడు అందులో కులం లాంటి సమూహంలో భాగం అవ్వడానికి కుదరదు అనీ, అందుకు ఈ సమూహంలో పుట్టి పెరిగి ఉండవలసిన అవసరం ఉంది అనీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనితో పేచీ ఉండవలసిన పని లేదు. ఏదైనా కులాన్ని లేదా సమూహాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చారు అంటే, ఆ కులం లేదా సమూహం చారిత్రక కారణాల చేత వెనుకబడింది కాబట్టి అందులో చేర్చారు అని. ఆ నిర్దిష్ట కులం లేదా సమూహం చారిత్రక పరిణామంలో భాగం కాకుండా, ఈ వెనుకబాటుతనానికి గురికాకుండా, ఆ జాబితాలో భాగం అవుతాను అని కోరడం అసంబద్ధమే అవుతుంది.

అయితే, సుప్రీంకోర్టు ఇక్కడ చేసిన కొన్ని సూత్రీకరణలు మాత్రం ఇబ్బందికరమైనవి. హైందవ మతం నుంచి హైందవేతర మతంలోకి మారినప్పుడు ఆర్థిక, విద్య, ఉద్యోగ తదితర వెనుకబాటుతనం అలాగే ఉండవచ్చేమో కానీ హైందవ మతంలో కులం ఆధారంగా ఏర్పడిన వెనుకబాటుతనం అక్కడ ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్న రిజర్వేషన్లు అక్కడ కోరుకోవడం కుదరదు అని చెప్పింది. పైన ఒక చోటేమో వెనుకబాటుతనానికి కులం కేవలం ఒక ప్రాతిపదిక అని చెప్పి, ఇక్కడ కులమే పునాది అని చెప్పటం ఎంతవరకు సబబు? హైందవేతర మతాల ధర్మశాస్త్రాలలో కులానికి చోటు లేదు కాబట్టి ఆయా మతాలలో అసమానతకి కులం పునాది అవ్వదు అని సుప్రీంకోర్టు చెప్పటమంటే వాస్తవిక పరిస్థితిని కాదని వేల ఏళ్ల ధర్మశాస్త్రాలని రాజ్యాంగ నిర్ణయాలకి ఆధారం చేసుకోవడమే అవుతుంది. ఇది క్రైస్తవ మతం విషయంలో చాలా ఇబ్బందికరమైన సూత్రీకరణ అవుతుంది. ఇదే సూత్రీకరణని అడ్డుపెట్టుకుని ఈనాటికీ దళిత క్రైస్తవ, దళిత ముస్లింలకి షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్లని నిరాకరిస్తున్నారు. ఈ అసంబద్ధ మత ప్రాతిపదికని తొలగించాలని ప్రభుత్వ కమిషన్లే గత 40 ఏళ్లుగా సిఫార్సు చేస్తూ వచ్చాయి.


సుప్రీంకోర్టే గత 75 ఏళ్లలో అనేకానేక తీర్పులలో కులానికి మతానికి అవినాభావ సంబంధం ఉండవలసిన అవసరం లేదనీ, అటువంటి సంబంధం సామాజిక వాస్తవంగా కూడా లేదనీ చెప్పింది. ఇది ముఖ్యంగా క్రైస్తవ మతం నేపథ్యంలో చెప్పినా, ఇస్లాం మతానికి కూడా ఈ సూత్రీకరణని అన్వయిస్తూ సుప్రీంకోర్టు అనేకమార్లు వ్యాఖ్యానించింది. ఇప్పుడు అటువంటి సామాజిక వాస్తవ వ్యాఖ్యానాన్ని తిరగదోడి ధర్మశాస్త్రాలకి ప్రాధాన్యం ఇచ్చినట్టు అయ్యింది. ఈ ప్రస్తుత వ్యాఖ్యానానికి మద్దతుగా సుప్రీంకోర్టు 1950 నాటి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్‌ను ఉటంకించింది. అయితే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది అస్పృశ్యత అనే ఒక ప్రత్యేకమైన ఉమ్మడి సామాజిక వాస్తవికత ఆధారంగా తీసుకువచ్చిన కేటగిరీ. దానిని వెనుకబడిన తరగతుల కేటగిరికీ అన్వయించడం రాజ్యాంగపరంగా కూడా ఇబ్బందికరమైన విషయం.

ఈ విషయాన్ని మత స్వేచ్ఛ నేపథ్యం నుంచి కూడా చూడవలసిన అవసరం ఉంది. ఇటువంటి సూత్రీకరణలు ఒక రకంగా మత స్వేచ్ఛకి సంకెళ్లు వేసినట్టే. ఒకరు స్వచ్ఛందంగా, మనస్ఫూర్తిగా మతం మారాలి అనుకున్నా కూడా– ముఖ్యంగా వెనుకబడిన తరగతులకి చెందినవారు– ఈ సూత్రీకరణల నేపథ్యంలో తమకి రాజ్యాంగబద్ధంగా, చారిత్రకంగా దఖలుపడిన రిజర్వేషన్ హక్కుని వదులుకోవలసిన పరిస్థితి. ఒక ప్రాథమిక హక్కు కోసం మరొక ప్రాథమిక హక్కుని కోల్పోవలసిన స్థితి ఏర్పడుతుంది. ప్రాథమిక హక్కులని ఒక దానితో ఒకదానిని అన్వయిస్తూ రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించాలి అనేది ఒక న్యాయశాస్త్ర సూత్రం. దానికి ఇప్పుడు అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇన్ని అంశాలు ఇమిడి ఉన్న ఈ తీర్పులోని సూత్రీకరణలని మరొక్కసారి సమీక్షించవలసిన అవసరం ఉంది.

గుత్తా రోహిత్

మానవ హక్కుల వేదిక

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓపై మేము గూఢచర్యం చేయలేదు: చైనా

వాళ్లు చాలా క్లోజ్.. ఎన్విడియా సీఈఓ ఎఫైర్‌పై 6 నెలల క్రితమే డౌట్

Updated Date - Nov 10 , 2026 | 01:55 AM