ఏ ఆకాంక్షలకీ రికార్డ్‌స్థాయి పోలింగ్‌లు!
ABN , Publish Date - May 12 , 2026 | 12:38 AM
భారత ప్రజాస్వామ్యం అంత సంక్లిష్టమైంది మరొకటి లేదు. అలాగే దాని విశిష్టతలకూ కొదవలేదు. అక్షరాస్యత, రాజకీయ చైతన్యం అంతంతమాత్రంగా ఉన్న భారత్ లాంటి దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కాదని 1950ల్లో...
భారత ప్రజాస్వామ్యం అంత సంక్లిష్టమైంది మరొకటి లేదు. అలాగే దాని విశిష్టతలకూ కొదవలేదు. అక్షరాస్యత, రాజకీయ చైతన్యం అంతంతమాత్రంగా ఉన్న భారత్ లాంటి దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కాదని 1950ల్లో ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. ప్రజలందరికీ ఒకేసారి సమానహక్కులను కల్పించటం దుస్సాహసమనే విమర్శలూ వెలువడ్డాయి. అప్పట్లో చాలా సహేతుకం అన్పించిన ఆ వ్యాఖ్యానాలూ, విమర్శలూ కాలపరీక్షకు నిలవలేకపోయాయి. అక్షరాస్యత అంతంత మాత్రమే అయినా ప్రజలు ఓట్లు వేయటానికి ఉత్సాహం చూపారు. మొదటి సార్వత్రక ఎన్నికల్లో 46శాతం మంది ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆనాటికి దేశంలో అక్షరాస్యత 15శాతానికి కాస్త అటూఇటూగానే ఉంది. స్వాతంత్య్ర ఉద్యమానికి సారథ్యం వహించిన చరిత్రతో కాంగ్రెస్ కీర్తి ఘనంగా వెలిగిపోతున్న నేపథ్యంలో కూడా ప్రజలు ఆనాడు రాజకీయ పరిణతిని ప్రదర్శించారు. 489 స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ను 364 చోట్లే గెలిపించారు. మిగతా స్థానాల్లో ప్రతిపక్ష పార్టీలకూ, స్వతంత్ర అభ్యర్థులకూ పట్టంకట్టారు. కాంగ్రెస్ పార్టీకి పడిన ఓట్లు 45 శాతం దాటలేదు. తొలి ఎన్నికల్లో 46శాతం మంది పాల్గొనటం కూడా అప్పట్లో ఒక రికార్డు. అమెరికా పౌరులు కూడా అంతటి రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించలేదు. 1948 నాటికే దాదాపు వందశాతం అక్షరాస్యతను అమెరికా సాధించింది. అయినా ఆ ఏడాది అక్కడ జరిగిన ఎన్నికల్లో 52శాతం మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. నిజానికి ఆనాటికి అక్కడ అన్నివర్గాల వారికీ ఓటువేసే హక్కుల్లేవు. రకరకాల కారణాలతో పలు రాష్ట్రాల్లో నల్లజాతీయులకూ, స్థానిక ఆదిమవాసులకూ, మహిళలకూ ఓటు హక్కును నిరాకరించారు. ఆ పరిమితులు ఉన్నా అక్కడి అక్షరాస్యతతో పోల్చితే ఓటింగ్ శాతం తక్కువేనని చెప్పాలి. ఏ రూపంలోనూ, ఏ వర్గానికీ ఓటుహక్కుని నిరాకరించని దేశంగా భారత్ 1950 నాటికి ప్రపంచంలోనే విశిష్టస్థానాన్ని సంపాదించింది.
వాగ్దానాలు చేసినట్లుగా జీవితాల్లో ప్రగాఢమార్పులను తీసుకురాలేని రాజకీయాలు ఉన్నచోట ప్రజల్లో కొంత నిరాసక్తత వ్యక్తంకావటం సహజం. కానీ ఆ నిరాసక్తతను కూడా ప్రదర్శించకుండా ప్రజలు ప్రతి ఎన్నికల్లో అధికంగా ఓటింగులో పాల్గొనటం మన దేశంలోనే బాగా జరుగుతోంది. ఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాలే అందుకు నిదర్శనం. సగటు పోలింగ్ 89.85 శాతం నమోదైంది. 2007– 2026 మధ్య రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే పోలింగ్ గణనీయంగా పెరిగిన పరిస్థితే కనపడుతుంది. మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ లాంటి చిన్న రాష్ట్రాల్లో మాత్రమే స్వల్ప తగ్గుదల కనపడింది. పెద్ద రాష్ట్రాల్లో పంజాబ్ మినహా ఎక్కడా ఈ పరిస్థితి లేదు. 2007లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 76.04 శాతంగా నమోదైన పోలింగ్ 2022 నాటికి 72.15 శాతానికి తగ్గిపోయింది.
పోలింగ్ శాతాలనూ ఎన్నికల్లో పార్టీలు ప్రకటిస్తున్న వాగ్దానాలనూ చూస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల కోరికలూ ఆకాంక్షలూ పెరుగుతున్నాయి. వాటికి అనుగుణంగా పార్టీల వాగ్దానాలు, నగదు బదిలీల హామీలు అధికమవుతున్నాయి. కులం, మతం అనేవి టిక్కెట్ల పంపిణీలో, ఓటర్లను సమీకరించటంలో ఇంకా గట్టి పాత్రను పోషిస్తున్నా అవే ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ప్రబలశక్తులుగా లేవు. నగదు బదిలీలు, సబ్సిడీలు, ఇళ్ల నిర్మాణాలు, స్థలాల కేటాయింపు లాంటివి ఓటర్లకు ప్రధానంగా మారాయి. వాటిని అధికంగా వాగ్దానం చేసే పార్టీల వైపు మొగ్గటం ఒక ప్రధాన ధోరణిగా 1990ల తర్వాత బాగా ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా గ్లామర్ లాంటివి జనంలోకి చొచ్చుకువెళ్లటానికి తోడ్పడుతున్నా, ప్రజలు కోరుకునే ఉచితాలనూ సంక్షేమపథకాలనూ పెద్దఎత్తున అమలుచేస్తామని హామీలు ఇవ్వకుండా ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకున్న సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కూడా పెద్దఎత్తున ఆ తరహా హామీలను ఇవ్వాల్సి వచ్చింది. వాటిని నిజాయితీగా అమలు జరిపితే ఏడాదికే అక్కడ రూ.90వేల కోట్లు అదనంగా ఖర్చుపెట్టాలి. జనాకర్షక పథకాలతో ఖజానాలు ఖాళీ అవుతున్నాయనీ అప్పుల ఊబిలోకి ప్రభుత్వాలను నెట్టివేస్తున్నాయనీ ఆర్థికవేత్తలూ వ్యాఖ్యాతలూ ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా పార్టీలు వాటిని పట్టించుకునే స్థితిలో లేవు. అంతకంటే ముఖ్యంగా వాటిని తగ్గిస్తే ఉపేక్షించటానికి ప్రజలు సిద్ధంగా లేరు. తాత్కాలిక ఉచితాలతో వారెందుకు సరిపెట్టుకుంటున్నారు? దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగించే పథకాలకు ఎందుకు ఆకర్షితులు కావటం లేదు? అని ప్రశ్నించుకుంటే మన ఆర్థిక వ్యవస్థ నడుస్తున్న తీరునూ ప్రభుత్వాలు దాన్ని ప్రభావితం చేస్తున్న వైనాన్నీ లోతుగా పరిశీలిస్తే వీటికి కొంతైనా జవాబు దొరుకుతుంది. 1990ల తర్వాత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగ సంస్థల పాత్ర గణనీయంగా తగ్గిపోయింది. ప్రైవేటురంగంలో వ్యాపారాలనూ పరిశ్రమలనూ ఆరంభించటానికి ప్రభుత్వ అనుమతులు రావటం చాలా సులభమైంది. వాటికి చౌకగా భూములను కేటాయించటం, రాయితీ ధరలకు కరెంటు సరఫరా చేయటం, పన్నుల్లో మినహాయింపులు ఇవ్వటం, రుణాల వెసులుబాటును బాగా పెంచటం పెద్ద ఎత్తున మొదలయ్యాయి. ఇదే తరహా ప్రోత్సాహకాలను విదేశీపెట్టుబడిదారులకు కూడా కల్పించటం ఆరంభించారు. వీటన్నిటి ఫలితంగా ఆర్థికవృద్ధిరేటు బాగా పుంజుకుంది. 1990లకు ముందు ప్రభుత్వపరమైన అనేక కట్టడులతో, నియంత్రణలతో ఆర్థిక వ్యవస్థ ఆశించినంత వేగంగా కదలలేకపోయింది. ఉత్పత్తుల్లో వైవిధ్యం లేకుండా పోయింది. అందుబాటులో ఉన్న వస్తువులూ పరిమితంగా ఉండేవి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టటం చాలా ఆలస్యమూ అయ్యేది. ప్రపంచమార్కెట్‌లో లభ్యమయ్యే వస్తువుల్లో చాలా వరకూ దేశంలో దొరికేవి కావు. ఆర్థిక సంస్కరణలతో ఈ పరిస్థితి మొత్తం మారిపోయింది. ప్రపంచ మార్కెట్‌లో లభ్యమయ్యే వినియోగవస్తువులన్నీ ఇప్పుడు భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుగోలుచేసే మధ్యతరగతి సంఖ్యా బాగా పెరిగింది.
ఈ మార్పులన్నిటినీ అయిదు పదుల వయస్సు దాటిన వాళ్లందరూ ప్రత్యక్షంగా చూశారు. 1997 తర్వాత పుట్టిన జెన్–జీ తరానికి అంతకుముందున్న ఆర్థిక జీవితం గురించి పెద్దగా తెలియదు. ప్రతి విషయాన్ని స్మార్ట్‌ఫోన్ల ద్వారానే తెలుసుకునే వారికి సామాజిక మార్పులను గ్రహించే అవకాశం ఉండటం లేదు. విరామం లేకుండా వచ్చిపడే తాజా సమాచార భారాన్ని మోయటానికే సతమతమయ్యే తరానికి గతంలోకి తొంగిచూడటం కష్టమైన పనైపోయింది. సామాజిక మార్పులను క్రమపద్ధతిలో అర్థంచేసుకోవటం ఒకపట్టాన సాధ్యం కావటం లేదు.
అవగాహనలో పరిమితులు ఎన్ని ఉన్నా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు కొత్త వస్తువులను, కొత్త సేవలను పొందాలన్న తహతహలను జెన్–జీ తరంలో విపరీతంగా పెంచాయి. ఈ తహతహ నగర, పట్టణ ప్రాంతాలకే పరిమితం కాలేదు. గ్రామాలను చుట్టుముట్టేస్తోంది. హుందాగా, సౌకర్యంగా జీవితాన్ని గడపటానికి అత్యవసరమైనవన్నీ అందులో ఉన్నాయి. ఒకప్పుడు పైవర్గాలే మొబైల్ ఎక్కువగా వాడేవారు. ఇప్పుడది అందరికీ అవసరమైన పరికరం అయిపోయింది. అది లేకపోతే అనేక సేవలూ, వస్తుపంపిణీలూ స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది. అట్టడుగు వర్గాలకు కూడా స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఉపాధి ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రైవేటు స్కూళ్లల్లో చదివి మంచి ఉద్యోగం సంపాదించాలన్న ఆకాంక్ష.. చిన్న వ్యాపారంలోనైనా కుదురుకుని పైకి ఎదగాలన్న కోరిక.. సొంత వాహనాన్ని పొందాలన్న తపన.. అట్టడుగు జెన్–జీ తరంలో కూడా బలంగా పాదుకున్నాయి. ఇలాంటి తపనలను తీర్చేందుకు తగిన ఆదాయాన్నీ ఉపాధినీ సమకూర్చేలా ప్రభుత్వ విధానాలు సమగ్రంగా ఉంటే ఎన్నికలప్పుడు విపరీత ఉచిత వాగ్దానాలను ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తేది కాదు. ఆర్థిక వ్యవస్థలో సంపద పెరుగుదల లేకపోవటం ఇక్కడ ప్రధాన సమస్యకాదు. ఆ పెరుగుదలలో సముచిత భాగం కిందివర్గాలకు చేరుకోకపోవటమే అసలు సమస్య. జాతీయాదాయంలో 58శాతం 10శాతం ప్రజల చేతుల్లోకి వెళుతోంది. దిగువనున్న 50శాతం ప్రజలకు దక్కేది 15శాతానికి మించటం లేదు. అలాగే దేశసంపదలో ఒక్కశాతం ప్రజల చేతుల్లో ఉన్నది చాలా ఎక్కువ. 40శాతం సంపద ఆ ఒక్కశాతం చేతుల్లో పోగుపడింది. గతంతో పోల్చితే 40శాతంగా ఉన్న మధ్యతరగతి ప్రజల జీవితాలు కొన్ని విషయాల్లో చాలా మెరుగుపడ్డాయి. దాన్ని కాదనలేం. కానీ పెరిగే జాతీయాదాయంలో వాళ్లు పొందే వాటా తగ్గిపోతోంది. 1980ల నాటికి జాతీయాదాయంలో వాళ్ల వాటా 44శాతం దాకా ఉంటే ఇప్పుడది 30 శాతానికి పడిపోయింది. సంపద వాటాలోనూ ఇదే పరిస్థితి ఉంది. మొత్తం దేశజనాభాను ఎగువ తరగతి (10శాతం), మధ్య తరగతి (40శాతం), అట్టడుగు తరగతి (50శాతం)గా విభజించి ఆదాయ, సంపదల్లో ఆ తరగతులకు ఎంతెంత దక్కుతోందో చెప్పటానికి వరల్డ్ ‘ఇనీక్వాలిటీ లాబ్’ పెద్ద కసరత్తే చేసింది. ఆ కసరత్తుతో ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. పెరిగే ఆదాయంలో, సంపదలో అట్టడుగు, మధ్యతరగతి ప్రజల వాటా తగ్గిపోవటాన్ని అరికట్టలేని స్థితికి దేశ రాజకీయ నాయకత్వం చేరుకుంది. మరోవైపు కోరికలు, ఆకాంక్షలు ఈ వర్గాల్లో సముచిత రీతిలో పెరుగుతున్నాయి.
ఉచితాలు, సబ్సిడీలు, నగదు పంపిణీలపై ఆశగా ఎదురుచూడటానికి ఇదే ప్రధాన కారణం. ప్రజాస్వామ్యంలో ఈ రెండు వర్గాలను ఉపేక్షించి రాజకీయాలు చేయటం సాధ్యంకాదు. పార్టీలు వివిధ తాయిలాలతో ఈ వర్గాలను తాత్కాలికంగా సంతృప్తిపరచటానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్ని కూడా చెప్పినట్లుగా చేయలేని పరిస్థితికి క్రమేపీ ప్రభుత్వాలు చేరుకుంటున్నాయి. ఈ వైఫల్యం ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో ఇప్పుడే కచ్చితంగా ఊహించలేం. హామీలను తీర్చలేని ప్రభుత్వాలను దించటానికీ, ఎక్కువ హామీలను ఇచ్చే పార్టీలకు పట్టం కట్టటానికీ ప్రజలు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. పోలింగ్ శాతమూ అందుకే పెరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యేలూ ఎంపీలుగా ఎన్నికవుతున్న వారిలో ఎగువతరగతికి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. అసమానతలను సహేతుకస్థాయికి తగ్గించలేకపోవటానికి ఇదీ ఒక ప్రతిబంధకంగా మారింది. వర్గ ప్రయోజనాలను అధిగమించి వ్యవహరించటం అంత సులభం కాదు. ప్రకటించినట్లుగా ఉచితాలనూ నగదు పంపిణీ వాగ్దానాలనూ అమలుచేయాలంటే ఎగువతరగతి ఆదాయాలూ సంపదల్లో ఏదో విధంగా కోతలు పడాలి. అది చేయలేకపోవటం వల్లే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంతగా ఆదాయాలు సమకూరటం లేదు. అప్పుల భారంతో పరిస్థితిని నెట్టుకురావటమూ వాటికి కష్టంగా మారింది.
మతం పేరుతో, అక్రమవలసల పేరుతో, కులాల పేరుతో ప్రజల్లో ఉద్వేగాలను కలిగించి ఎన్నికల్లో పార్టీలు గట్టెక్కొచ్చు. విన్యాసాలెన్ని చేసినా వారి ఆర్థిక ఆకాంక్షలపై ఎల్లకాలమూ శీతకన్ను వేయలేరు. అరకొర తాత్కాలిక తాయిలాలతో ఎల్లకాలమూ బుజ్జగించలేరు. ఆశించిన విధంగా అవి సాకారం కానప్పుడు జెన్–జీ తరం కొత్త దారుల్లో ఆందోళనకు ఉపక్రమించే పరిస్థితినీ నివారించలేరు. నిన్నటి రికార్డ్‌స్థాయి పోలింగ్‌లకే అది పరిమితం కాదు. రేపు రికార్డ్‌స్థాయి పరివర్తనలకూ అది దారితీస్తుంది. దేశంలో కొన్ని రాజకీయపక్షాలు గణనీయంగా బలహీనపడొచ్చు. ప్రజల ఆర్థిక ఆకాంక్షలు మాత్రం బలహీనపడవు! కొత్త రాజకీయాలకు ఊపిరులు ఊది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేవీ అవే!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలు కూడా చదవండి...
మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు
జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం
కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News