Share News

స్వార్థం వీడితేనే సామాజిక విప్లవం !

ABN , Publish Date - Jul 17 , 2026 | 03:02 AM

ఈ దేశంలో ఒక విచిత్రమైన అలవాటు ఉంది. సమాజంలో సమస్యలు కనిపించినప్పుడల్లా మనం పరిష్కారం కోసం ఒక మహానుభావుడిని వెతుకుతాం. ఒకరు బుద్ధుడిని తీసుకొస్తారు. మరొకరు అంబేడ్కర్‌ను...

స్వార్థం వీడితేనే సామాజిక విప్లవం !

ఈ దేశంలో ఒక విచిత్రమైన అలవాటు ఉంది. సమాజంలో సమస్యలు కనిపించినప్పుడల్లా మనం పరిష్కారం కోసం ఒక మహానుభావుడిని వెతుకుతాం. ఒకరు బుద్ధుడిని తీసుకొస్తారు. మరొకరు అంబేడ్కర్‌ను చూపిస్తారు. ఇంకొకరు మార్క్స్‌ను ముందుకు తెస్తారు. వారందరూ గొప్పవారే. మరి మనం ఇంకా ఎందుకు మారలేదు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకకుండా, మరొక మహానుభావుడి కోసం ఎదురు చూడడం అనేది– చీకట్లో పోగొట్టుకున్న తాళం చెవిని వెలుతురు ఉన్నచోట వెతకడం లాంటిది.

మన దేశంలో ఎంతో సిద్ధాంత సంపద ఉంది. మతాలు ఉన్నాయి. తత్వాలు ఉన్నాయి. విప్లవ గ్రంథాలు ఉన్నాయి. రాజ్యాంగం ఉంది. ఉద్యమాల చరిత్ర ఉంది. అయినప్పటికీ అన్యాయం ఉంది. అసమానత ఉంది. ద్వేషం ఉంది. దోపిడీ ఉంది. కులం ఉంది. మత వివక్ష కూడా ఉంది. అంటే మరి సమస్య ఎక్కడో వేరే చోట ఉన్నట్టే కదా!

మనిషి ఒక వింత జీవి. స్వేచ్ఛ గురించి మాట్లాడతాడు. కానీ అవకాశం దొరికితే ఇతరులను నియంత్రించాలని చూస్తాడు. సమానత్వం గురించి ఉపన్యాసాలు ఇస్తాడు. కానీ తనకు ఉన్న ప్రత్యేక హక్కులను వదులుకోవడానికి సిద్ధపడడు. న్యాయం గురించి గట్టిగా మాట్లాడతాడు. కానీ తనకు లాభం కలిగించే అన్యాయాన్ని మాత్రం మౌనంగా సమర్థిస్తాడు. ఇదే మానవ వైరుధ్యం.

బుద్ధుడు మనిషిలోని దుఃఖాన్ని చూశాడు. అంబేడ్కర్‌ కుల ఆధిపత్యాన్ని చూశాడు. మార్క్స్ ఆర్థిక దోపిడీని చూశాడు. కానీ ఈ ముగ్గురి ఆలోచనలు కూడా స్వార్థానికి అనుగుణంగా మారిపోయే మనిషి ‘మనస్తత్వాన్ని’ (విప్లవం ఓడిపోయే చోటు) తక్కువ అంచనా వేశాయనే అనిపిస్తుంది.

అందుకే చరిత్రలో ఒక విచిత్రమైన దృశ్యం: విప్లవం కోసం పోరాడిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తరువాత అధికార భాషనే మాట్లాడతాడు. సమానత్వం కోసం పోరాడిన నాయకుడు తన అనుచరుల మధ్య అసమానతలను సహజంగా స్వీకరిస్తాడు. మనిషి శత్రువును సులభంగా గుర్తిస్తాడు, కానీ తనలోని అహంకారాన్ని గుర్తించలేడు. తనను అణచివేసే వ్యవస్థను విమర్శిస్తాడు. కానీ తాను ఇంకొకరిపై చూపుతున్న ఆధిపత్యాన్ని చూడలేడు. సమస్య సిద్ధాంతంలో లేదు, సిద్ధాంతాన్ని ఉపయోగిస్తున్న మనసులో ఉంది. అందుకే సమాజం మార్పు గురించి మాట్లాడేటప్పుడు ముందు మాట్లాడాల్సింది మనిషి మనస్తత్వంలో రావాల్సిన మార్పు గురించి.


ఈ దేశంలో మహానుభావులను చదవరు, పూజిస్తారు. వారి ఆలోచనలను విశ్లేషించరు, నినాదాలుగా మార్చుకుంటారు. ప్రశ్నించరు, విశ్వసిస్తారు. ఫలితంగా సిద్ధాంతం ఒక మతంగా మారుతుంది. అందుకే ఈ దేశానికి కావలసింది మరో బుద్ధుడో, అంబేడ్కరో, మార్క్సో కాదు. వారి నుంచి నేర్చుకుంటూనే వారందరినీ ప్రశ్నించగలిగే ఒక కొత్త మేధో సంస్కృతి. తన కులాన్ని, తన మతాన్ని, తన రాజకీయ నాయకుడిని, అవసరమైతే తనను తాను కూడా ప్రశ్నించగలిగే వ్యక్తి ఇప్పుడు కావాలి. మనిషి తనను తాను పరిశీలించుకోవడం, ప్రశ్నించుకోవడం ప్రారంభించిన రోజే అసలు విప్లవం మొదలవుతుంది.

ఆయిరబోయిన బిక్షపతి

ఈ వార్తలనూ చదవండి:

వెనక్కి తగ్గిన మెటా.. ఇన్‌స్టాగ్రామ్‌లో వివాదాస్పద ఏఐ ఫీచర్ తొలగింపు..

మరో ఏఐ మోడల్‌‌ను లాంచ్ చేసిన స్పేస్ఎక్స్ఏఐ

Updated Date - Jul 17 , 2026 | 03:02 AM