Share News

ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యవాది

ABN , Publish Date - Apr 22 , 2026 | 01:48 AM

భారతదేశ ఆధ్యాత్మిక చింతనలో సమానత్వం, మానవతాభావం కలగలిపిన మహర్షి రామానుజాచార్యులు. శాస్త్రచింతనను లోతుగా అధ్యయనం చేసి విశిష్టాద్వైత తత్వాన్ని ప్రతిపాదించారు....

ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యవాది

భారతదేశ ఆధ్యాత్మిక చింతనలో సమానత్వం, మానవతాభావం కలగలిపిన మహర్షి రామానుజాచార్యులు. శాస్త్రచింతనను లోతుగా అధ్యయనం చేసి విశిష్టాద్వైత తత్వాన్ని ప్రతిపాదించారు. పీడిత, అణగారిన వర్గాలకు సమాన గౌరవం, ఆధ్యాత్మిక హక్కులు కల్పించడానికి ఆచరణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. కాబట్టే ఆయన్ను సమతామూర్తిగా పిలుస్తారు. దైవభక్తికి కులం, వర్ణం, జాతి, లింగ భేదాలు అడ్డురావని పేర్కొన్నారు. పీడితులకు, అంటరానివారికి దేవాలయ ప్రవేశం వీరి సేవల్లో అత్యంత ప్రధానం. పండితులు, పామరులు అందరూ భక్తిమార్గంలో భగవంతుణ్ణి ఆరాధించి ముక్తి పొందవచ్చునని చాటారు.

భారత సమాజ గమనాన్ని, ఆలోచనా చింతనను మార్చిన గొప్ప వ్యక్తి రామానుజులు. ఆలయ ప్రవేశం, భగవదర్చనపై ఎవరికీ హక్కులేదని వ్యక్తుల మధ్య తేడాను చెరిపే ప్రయత్నం చేశారు. రామానుజుల సామాజిక దృక్పథం ఆధునికం. తరతమ భేదాలు లేని సమాజాన్ని ఆయన వాంఛించారు. సంప్రదాయం పేరిట కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు సామాజిక పురోగతికి అడ్డుకాక మునుపే వాటిని గుర్తించి మార్చడమో, మాన్పించడమో చేయడం ఆచార్యుల కర్తవ్యం– అని రామానుజులు నిర్దేశించారు. పూర్వపు గురువులు చెప్పినదంతా ఒప్పుకోవలసిన పనిలేదని, సమకాలీన పరిస్థితులకు తగిన విధంగా విశ్లేషణ చేసి ప్రస్తుతానికి పనికి వచ్చే అంశాలనే పరిగణనలోకి తీసుకోవాలని మార్గదర్శనం చేశారు. వ్యక్తి శ్రేయస్సుతో పాటు సామాజిక శ్రేయస్సుతో ముందుకు సాగాలని చెప్పారు. చెరువులోని పాతనీళ్ళను పంపించి కొత్తనీటిని ఆహ్వానించకపోతే కుళ్ళి కంపు కొడుతుందని హెచ్చరించారు. మానవుని మౌలిక ప్రవృత్తులను సమర్థించలేని శాస్త్రాన్ని, మతం నిగూఢభావాన్ని వివరించలేని సిద్ధాంతాన్ని సాధారణ ప్రజానీకం స్వీకరించదు.

బ్రహ్మజ్ఞానానికి వర్ణాశ్రమాలతో నిమిత్తం లేకుండా అందరూ అర్హులే అన్నారు. దైవకృప ఏ ఒక్కరి సొత్తూ కాదు, అది అందరి హక్కు అన్నారు. కుల బేధాలకు భక్తి అతీతమనీ భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనని రామానుజులు బోధించారు. విశిష్టాద్వైత సిద్ధాంత రూపకల్పనకే పరిమితం కాకుండా తన భావాలను ప్రజానీకంలోకి తీసుకుపోయారు. మంత్రాలను బ్రాహ్మణులు మాత్రమే వల్లించాలని మనుస్మృతి నిర్దేశించినా, దాన్ని ధిక్కరించి సామాన్యులకూ నేర్పారు. సంస్కృతంలోనే కాకుండా సామాన్యుల భాషలో వైష్ణవభక్తి ఉద్యమాన్ని ప్రజలకు చేరువ చేశారు.


నేడు భారతీయ సమాజంలో ప్రవేశించిన కుల, మత, అస్పృశ్యతా జాడ్యాన్ని విదేశీయులపై మోపకుండా అంతర్మథనంతో అందరం కలిసిమెలసి పరిష్కరించుకోవాలి. భారత నాగరిక చరిత్ర అంతటా కుల భేదాలను, దాని కాఠిన్యతను నిరసించిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి. అయితే ఇవేమీ జాతి మనసును చెప్పుకోదగినంత ప్రభావితం చేయలేకపోయాయి. ఎన్ని చట్టాలు, తీర్పుల ద్వారా రద్దుచేసినా దురాచారం రద్దు కాదు. చట్ట నిబంధనల కన్నా సంఘ నిబంధన బలమైనది. సామాజిక, ఆర్థిక న్యాయం జరగనిదే భారతదేశం ప్రగతిపథంలో ప్రయాణించడం కష్టమవుతుందని అంబేడ్కర్ రాజ్యాంగ పీఠికలో పేర్కొన్నారు. మతపరంగా స్వేచ్ఛ, సమాజపరంగా సమత, భౌతికంగా ప్రగతి, భారతీయ మూలాల్లో నుంచి అందరం వెతుక్కోవాలి. కులం ద్వారా వ్యక్తి స్వేచ్ఛను అడ్డుకోకూడదు. నేడు ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక, ఒకే దేశం– ఒకే చట్టం’ వంటి నినాదాలతో దేశం ముందుకెడుతుంటే కులాల పేరుతో ఏ వృత్తినైనా అడ్డుకోవడం ధర్మం కాదు. ధర్మం గోడలు కట్టదు, గోడలను పగలగొడుతుంది. అంతరాల్ని తొలగిస్తుంది. మన గురువులైన రామానుజులు, శంకరుల బోధనలను కేవలం ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు పరిమితం చేయకూడదు. నిత్య జీవితంలో సమస్యలకు పరిష్కారాలు చూపే మార్గాలుగా పెద్దలు బోధించాలి.

భారత ఆధ్యాత్మిక రంగాన రామానుజులు ప్రకటించిన ‘సమానత్వ’ అవకాశాలు అనే భావన నేటి భారత రాజ్యాంగ అమలు లక్ష్యాలకు దగ్గరగా ఉంది. ప్రత్యేకించి సామాజిక న్యాయం, సమానత్వం భావనలు రాజ్యాంగ తాత్త్వికతకు అద్దం పడుతున్నాయి. ప్రతి మనిషికీ గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం ఉండాలనే మానవ హక్కుల సిద్ధాంతానికి రామానుజులు ప్రవచించిన శరణాగతి భావం బలమైన ఆధారం. మత స్వేచ్ఛ భావనకు శరణాగతి భావం కూడా పూనికగా మత విభజనలను, వాటి మధ్య ఘర్షణలను తగ్గించి ఐక్యతను ప్రబోధించేదిగా ఉంది. రామానుజులు నేటి సమాజం ముందు ఏకీకరణ శక్తిగా నిలుస్తారు. ఆయన జీవితం, వినయం, సేవ, దయ, జ్ఞాన ప్రచారం నేటి పాలకులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలకు నిలువెత్తు ఆదర్శం.

డొక్కా మాణిక్యవరప్రసాద్

మాజీ మంత్రి

(నేడు రామానుజాచార్యుల జయంతి)

ఇవి కూడా చదవండి..

అది నాకు గర్వకారణం.. సీఎం స్టాలిన్ వీడియో సందేశం

విజిల్ రెవల్యూషన్‌‌కు పిలుపు.. టీవీకే చీఫ్ విజయ్ బహిరంగ లేఖ

Updated Date - Apr 22 , 2026 | 01:48 AM