జాతి నిర్మాణంలో ‘జుగల్బందీ’లు
ABN , Publish Date - May 15 , 2026 | 01:26 AM
ఏడు సంవత్సరాల క్రితం (6 ఆగస్టు 2019) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో నా సహచరులతో పిచ్చాపాటీ చేస్తున్నాను. అంతకు ముందు రోజు పార్లమెంటు, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన...
ఏడు సంవత్సరాల క్రితం (6 ఆగస్టు 2019) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో నా సహచరులతో పిచ్చాపాటీ చేస్తున్నాను. అంతకు ముందు రోజు పార్లమెంటు, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన అధికరణ 370ని రద్దు చేయడం గురించి మా సంభాషణ సాగుతోంది. కంప్యూటర్ సైంటిస్ట్ అయిన నా యువమిత్రుడు ఒకరు ఇలా వ్యాఖ్యానించారు: ‘ఇప్పుడు మనం చూస్తుంది మోదీ రెండోపాలన ఆరంభం కాదు, అమిత్ షా మొదటి పాలన ప్రారంభం’. భారతదేశపు ఏకైక ముస్లిం మెజారిటీ రాష్ట్రమైన కశ్మీర్ స్థాయిని తగ్గించే పథక రచన, దాని అమలులో ప్రధానపాత్ర వహించింది కొత్త హోం మంత్రి అమిత్ షా అని మరి చెప్పనవసరం లేదు. అధికరణ 370 రద్దు అమిత్ షా పాలన ప్రారంభం అన్న వ్యాఖ్య ఒక అతిశయోక్తే. అయితే షా ఇప్పుడు భారత ప్రభుత్వంలో రెండో అత్యంత శక్తిమంతుడైన నాయకుడు మాత్రమే కాదు, ప్రధానమంత్రి మినహా మరెవరికీ లేని అధికారాలను పూర్తి స్వతంత్రతతో నిర్ణయాత్మకంగా చెలాయిస్తున్న నేత.
మోదీ–షా జుగల్బందీ (ఇరువురి మధ్య అత్యంత సమన్వయంతో కూడిన రాజకీయ భాగస్వామ్యాన్ని సూచించే రూపకాలంకారమది) భారతీయ జనతా పార్టీ చరిత్రలోగానీ, స్వతంత్ర భారతదేశ పాలనా చరిత్రలోగానీ ప్రత్యేకమైనదేమీ కాదు. స్వతంత్ర భారతదేశ తొలి సంవత్సరాలలో జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్ మధ్య భాగస్వామ్యాన్నే చూడండి. అది సార్థకమైనది, ఆదర్శప్రాయమైనది. అయితే వర్తమాన రాజకీయాల తర్కవితర్కాలు ఆ శిఖర సమానులను ప్రత్యర్థులుగా, పరస్పర శత్రువులుగా చిత్రిస్తున్నాయి. నిజానికి వారిరువురూ నిస్వార్థ స్నేహితులు, సన్నిహిత సహచరులు. దేశ విభజన కల్లోలంలో వారిరువురు అధికార స్వార్థాలకు తావివ్వకుండా తమ తమ విధ్యుక్త ధర్మాలను కలసికట్టుగా నిర్వహించి ఉండకపోతే సమైక్య, ప్రజాస్వామిక భారత గణతంత్ర రాజ్యం ఆవిర్భవించి వర్ధిల్లేదే కాదు. పటేల్ తన అసాధారణ రాజనీతిజ్ఞత, కార్యదక్షతతో భారతదేశాన్ని భౌగోళికంగా సమైక్యపరిచి, పరిపాలనా వ్యవస్థను ఆధునికీకరించారు. హిందూ మితవాదులను, వామపక్షీయులను నియంత్రించారు. డాక్టర్ అంబేడ్కర్ నిర్దేశకత్వంలో ఆరంభమైన రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియకు కాంగ్రెస్ నుంచి పరిపూర్ణ, ఫలప్రదమైన మద్దతు లభించేలా చూశారు. అదే సమయంలో లౌకిక ప్రజాస్వామ్య సమాజంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో జవహర్‌లాల్ నెహ్రూ కీలకపాత్ర వహించారు. సమ్మిళిత పౌరసత్వాన్ని ప్రోత్సహించడం, మైనారిటీలకు సమాన హక్కులు కల్పించడం, జెండర్ సమానత్వాన్ని సమర్థించడం, సకల అంతరాలకు అతీతంగా వయోజన ఓటు హక్కు కల్పించడం మొదలైన ప్రగతిశీల కృషితో ఆసేతు హిమాచలం సమస్త భారతీయులలో భావోద్వేగ సమైక్యతను నిర్మించి పెంపొందించారు. పలు విషయాలలో నెహ్రూ, పటేల్ మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే విశాల జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆ విభేదాలను విస్మరించి వారు కలసికట్టుగా కృషి చేశారు. డాక్టర్ అంబేడ్కర్, ఇతర నాయకులు, సమర్థులైన సివిల్ సర్వెంట్ల సహాయ సహకారాలు వారికి నిస్వార్థంగా లభించేవి. నవభారత నిర్మాణంలో నెహ్రూ–పటేల్ భాగస్వామ్యం కీలకమైన, నిర్ణయాత్మకమైన పాత్ర వహించిందని చరిత్రకారులు ధ్రువీకరించారు.
1960వ దశకంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన ముఖ్య కార్యదర్శిగా మాజీ దౌత్యవేత్త పి.ఎన్.హక్సర్‌ను నియమించడంతో దేశ పాలనను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసిన రెండవ భాగస్వామ్యం ప్రభవించింది. ఇందిర కేబినెట్ మంత్రులలో మహాశక్తిమంతుడుగా హక్సర్ అతి కొద్ది కాలంలోనే పరిణమించారు. ఇందిరకు కుడి భుజంగా, ప్రభావశీల సలహాదారుగా ఆయన పేరు పొందారు. ఇందిరాగాంధీకి అజరామర కీర్తిప్రతిష్ఠలు సమకూర్చిన బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం విజయంలో హక్సర్ కీలకపాత్ర నిర్వహించారు. వ్యవసాయం, అంతరిక్ష రంగాలలో ఉత్కృష్టమైన పరిశోధనలను ప్రోత్సహించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిని దెబ్బతీసిన ఇందిర ఆర్థిక విధానాల నిర్ణేత కూడా హక్సరే. 1975లో ప్రధాని ఇందిర తన రెండవ కుమారుడు సంజయ్‌గాంధీకి ప్రాధాన్యమిస్తూ హక్సర్‌ను తొలుత దూరంపెట్టి, ఆ తరువాత పూర్తిగా ఉపేక్షించారు. ఇలా మొదలైన ఇందిర–సంజయ్ భాగస్వామ్యం భారత్ నిరంకుశ పాలనలోకి జారిపోవడానికి కారణమయింది. పౌర స్వేచ్ఛల అణచివేత జరిగింది. పత్రికా స్వాతంత్ర్యం హరించింది. న్యాయవ్యవస్థను ప్రభుత్వానికి అనుకూలంగా నియంత్రించారు. పౌర, పోలీసు అధికారులు తల్లీతనయులకు పూర్తిగా విధేయులు అవడం అనివార్యమయింది. ఇందిర–హక్సర్ భాగస్వామ్యం వలే ఇందిర–సంజయ్ భాగస్వామ్యం జాతి శ్రేయస్సుకు దోహదం చేసిన సార్థక విజయాలను సాధించలేదు.
దేశ పాలనలో తదుపరి ప్రముఖ భాగస్వామ్యం ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రి మన్మోహన్‌సింగ్‌ది. 1991–96 సంవత్సరాల మధ్య ఈ నాయకద్వయం దేశ ఆర్థిక వ్యవస్థను లైసెన్స్–పర్మిట్–కోటా రాజ్ నుంచి విముక్తం చేశారు. దేశ ప్రజల ఆర్థిక, వ్యవస్థాపనా సామర్థ్యాలకు ఊపిరులు పోశారు. పీవీ–మన్మోహన్ భాగస్వామ్యం దేశ ప్రజల పేదరికాన్ని తగ్గించింది. మధ్యతరగతి ప్రజల సమున్నతికి తోడ్పడింది. ప్రపంచంలో దేశ ప్రతిష్ఠను ఇతోధికంగా పెంపొందించింది.
పీవీ–మన్మోహన్ అనంతరం అటల్‌బిహారీ వాజపేయి –లాల్‌కృష్ణ ఆడ్వాణీ రాజకీయ భాగస్వామ్యం రంగంలోకి వచ్చింది. కాంగ్రెస్‌కు ప్రధాన సవాల్‌దారుగా బీజేపీని నిలబెట్టేందుకు 1980లు, 1990ల్లో ఈ నాయకద్వయం కలిసికట్టుగా కృషిచేసింది. 1998–2004 సంవత్సరాల మధ్య బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వాజపేయి ప్రధానమంత్రి, ఆడ్వాణీ హోం మంత్రి. పీవీ–మన్మోహన్‌ల ఆర్థిక సంస్కరణలను వీరు కొనసాగించారు. ఈ కృషిలో వాజపేయి–ఆడ్వాణీకి జస్వంత్‌సింగ్, యశ్వంత్‌సింగ్ మొదలైన సమర్థనేతల సహకారం లభించింది. అయితే బీజేపీ ప్రభుత్వం బహుళ పార్టీల సంకీర్ణం కావడంతో సంఘ్ పరివార్ ఆధిపత్యవాద ధోరణులు పాలనలో ప్రాబల్యం వహించేందుకు ఆస్కారం లేకపోయింది.
2004 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ ఓడిపోయింది. దరిమిలా ఒక దశాబ్దం పాటు కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ కాలంలో ఇద్దరు వ్యక్తులు మరెవ్వరి కంటే ఎక్కువ అధికారాలను చెలాయించారు. వారిలో ఒకరు ప్రధాని మన్మోహన్‌సింగ్, మరొకరు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. మన్మోహన్ నిర్దేశకత్వంలో దేశ ఆర్థిక పురోగతి ప్రభావదాయకంగా ముందుకు సాగింది. సోనియా, ఆమె జాతీయ సలహామండలి మార్గదర్శకత్వంలో పేద ప్రజలకు సంక్షేమాన్ని సమకూర్చేందుకు విలువైన కృషి జరిగింది. 2014 సార్వత్రక ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం పాలయింది, బీజేపీ అధికారంలోకి వచ్చింది.
నరేంద్రమోదీ–అమిత్ షా భాగస్వామ్యం మన రాజకీయాలలో ఏడవ కీలక భాగస్వామ్యం. దేశ పాలన, భారతీయుల వ్యవహారాలలో ఈ ఇరువురు వ్యక్తులు, వారి రాజకీయ భాగస్వామ్యం కీలకపాత్ర వహించడం ప్రారంభమయింది. 2002–14 సంవత్సరాల మధ్య ఈ నాయకద్వయం గుజరాత్ రాజకీయాలలో కలిసికట్టుగా పనిచేశారు. 2014 నుంచి జాతీయ రాజకీయాలనూ నిర్దేశిస్తున్నారు. గత 24 సంవత్సరాలలో వీరిద్దరూ ఒక్కసారి కూడా రాజకీయ అధికారాన్ని కోల్పోలేదు. నిజానికి వారు తమ అధికారాన్ని అంతకంతకూ విస్తరించుకుంటూ వస్తున్నారు. తొలుత గుజరాత్‌ను ఏకపార్టీ రాష్ట్రంగా చేశారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా బీజేపీ అడుగుజాడలను విస్తరిస్తున్నారు.
రాజకీయ దీర్ఘకాలికత, సాఫల్యత పరంగా చూస్తే మోదీ–షా భాగస్వామ్యం ప్రభావవంతమైనది. అయితే ఈ నాయకద్వయం అధికారాన్ని ఎలా సాధించారు, అధికారంలోకి వచ్చిన తరువాత ఏమి చేశారు అన్నది అవలోకిస్తే వారి రికార్డు వెలుగు బాటల చరిత్రగా కనిపించదు. అధికార సముపార్జనకు వారు ప్రత్యర్థి పార్టీలను ఆర్థిక ప్రలోభాలు, నిర్బంధాలతో నిట్టనిలువునా చీల్చివేశారు. మీడియాను బెదిరింపులతో లోబరచుకుని వ్యక్తిగత, పార్టీపర ప్రచారానికి వినియోగించుకున్నారు. న్యాయవ్యవస్థనూ మచ్చిక చేసుకున్నారు. భారత సమాఖ్య పాలనావిధానాన్ని బలహీనపరిచారు. రాజ్యంగ సంస్థల, మరీ ముఖ్యంగా ఎన్నికల సంఘం స్వతంత్రత, నైతిక నిష్ఠను నిమజ్జనం చేశారు. అతి కొద్దిమంది పెట్టుబడిదారులకు (ప్రత్యేకించి సొంత రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యాపార దిగ్గజాలు) అనుకూలంగా వ్యవహరించారు. విదేశీ మదుపుదారులు నిష్క్రమించే పరిస్థితులు కల్పించారు. వస్తూత్పత్తి రంగంలో ఉద్యోగావకాశాలను పెంపొందించడంలో విఫలమయ్యారు. వైజ్ఞానిక పరిశోధనలను రాజకీయీకరణ చేశారు. అడవులు, నీటి వనరులను నాశనం చేశారు. ఇవన్నీ దేశ ఆర్థిక పురోగతికి ప్రతిబంధకాలుగా పరిణమించాయి.
మోదీ–షా రాజకీయ జుగల్బందీ కారణంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థకు వాటిల్లిన నష్టం, భారత అభ్యుదయానికి ఏర్పడిన అవరోధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మన సామాజిక, సాంస్కృతిక వైవిధ్య సంప్రదాయాలపై దాడులను ఈ నాయకద్వయం పర్యవేక్షిస్తోంది, ప్రోత్సహిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న చోటల్లా ద్వితీయస్థాయి పౌరులుగా ముస్లింలు పరిగణన పొందుతున్నారు. చట్టసభలలో వారికి ప్రాతినిధ్యమే ఉండని పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో నేను ఇదే కాలమ్‌లో పేర్కొన్నట్టుగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో మున్నెన్నడూ లేని రీతిలో మోదీ–షా భారత్ ఒక హిందూ పాకిస్థాన్‌గా పరిణమించే స్థితికి వేగంగా చేరుకుంటోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే స్వతంత్ర భారతదేశ పాలనలో కీలకపాత్ర వహించిన ఏడు భాగస్వామ్యాల– నెహ్రూ–పటేల్; ఇందిర–హక్సర్; ఇందిర–సంజయ్; పీవీ–మన్మోహన్; సోనియా–మన్మోహన్; వాజపేయి–ఆడ్వాణీ; నరేంద్ర మోదీ–అమిత్ షా– లో మొదటిదే నిస్సందేహంగా సమున్నతమైనదీ, నిర్మాణాత్మకమైనదీ అని, మూడవది, ఏడోది నష్టదాయకమైనవీ, వినాశనకరమైనవీ అని చరిత్ర తప్పక తీర్పునిస్తుంది.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
ఇవీ చదవండి:
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?