ఆహా.. నేను ఒక్కరోజు ప్రధానినైతే!
ABN , Publish Date - Aug 21 , 2026 | 02:45 AM
భారతదేశం 80వ స్వాతంత్ర్య సంవత్సరంలోకి ప్రవేశించిన శుభ తరుణమిది. ఈ గొప్ప దేశానికి నేను ఒకే ఒక్క రోజు ప్రధానమంత్రిగా ఉన్నా ఎర్రకోట ప్రాకారం నుంచి నేను వెలువరించే స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ఎలా ఉండాలో...
భారతదేశం 80వ స్వాతంత్ర్య సంవత్సరంలోకి ప్రవేశించిన శుభ తరుణమిది. ఈ గొప్ప దేశానికి నేను ఒకే ఒక్క రోజు ప్రధానమంత్రిగా ఉన్నా ఎర్రకోట ప్రాకారం నుంచి నేను వెలువరించే స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ఎలా ఉండాలో ఊహించేందుకు సాహసించాను. ఆ ఆలోచనా ఫలితమే ఇది:
ఈ రోజు నేను కేవలం ఒక ప్రధానమంత్రిగా కాకుండా మీ ప్రధాన సేవకుడిగా ఇక్కడ నిలబడ్డాను. ప్రధాన సేవకుడు అనే మాటను మీరు వినే ఉంటారని నాకు తెలుసు. అయితే నేను చెప్పినవి చేస్తాను, వాగ్దానాలు నెరవేరుస్తాను. పదవీ బాధ్యతలు చేపట్టిన నెలరోజులలోనే నేను, నా మంత్రులు అందరూ తమ సువిశాల అధికారిక లుట్యెన్స్ బంగ్లాల నుంచి చిన్న గృహాలకు మారాలని నిర్ణయించాను. అనవసర విదేశీ యాత్రలను విరమిస్తాను. అవార్డు ప్రదానాల కార్యక్రమాలకు వెళ్లకూడదని నిశ్చయించుకున్నాను. ప్రభుత్వ హోర్డింగులు, బిల్లు బోర్డులు, వాణిజ్య ప్రకటనల్లో నా బొమ్మ ఉండకూడదని నా పార్టీకి సూచించాను, ముఖ్యమంత్రులందరికీ ఆదేశాలు జారీ చేశాను. వ్యక్తిపూజకు రోజులు చెల్లిపోయాయి. ప్రజాస్వామ్యమనేది ఏకవ్యక్తి ప్రదర్శన ఎంత మాత్రం కాదు.. ప్రధానమంత్రి పదవి తాత్కాలికమే. గణతంత్ర రాజ్యమే శాశ్వతం. ఈ శుభవేళ మరో వాగ్దానం చేస్తున్నాను. భారత ప్రభుత్వం ఏ ఒక్క నిర్దిష్ట మతంతోనూ తనను తాను గుర్తించుకోదు. నేను మతాన్ని పాటిస్తాను. అయితే ఆ మతాచరణలు నా ఇంటికీ, మనస్సాక్షికి మాత్రమే పరిమితం. ప్రధానమంత్రిగా నాకు ఒకే ఒక్క పవిత్ర గ్రంథం ఉన్నది: భారత రాజ్యాంగం. అవినీతిని తుదముట్టించేందుకు నిశ్చయించుకున్నాను.
ఈ స్వాతంత్ర్య దినోత్సవ శుభవేళ జెన్‌జీకి ఒక విషయాన్ని సూటిగా చెప్పదలుచుకున్నాను. మిమ్ములను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణలు చెబుతున్నాను. ప్రశ్నపత్రాల లీక్‌లు, ఉద్యోగాల అలభ్యతపై మీ ఆగ్రహం, అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉన్నాయో మేము తక్కువగా అంచనా వేశాము. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియా పోస్ట్‌లు, హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా మీకు సన్నిహితమవచ్చని భావించాము. అది తప్పు అని అర్థమయింది. యువజనులు నిరసనగా వీధుల్లోకి వచ్చినప్పుడు ఒక ప్రజాస్వామిక వ్యవస్థ మొదటి ప్రతిస్పందన వారు మౌనం వహించేలా చేయడం కాదు, లేదా వారిని ‘దిమాగి నక్సల్స్’గా, దేశద్రోహులుగా చూడడం అంతకంటేకాదు, యువత సమస్యలను సానుభూతితో వినడమూ, పట్టించుకోవడమే.
స్వాతంత్ర్య శతాబ్ది(2047) నాటికి అందరికీ ఉద్యోగాలు లభించేలా చేయడమే నా లక్ష్యం. కృత్రిమ మేధ లక్షలాది ఉద్యోగాలను హరించివేస్తోంది. పని ప్రదేశం తీరుతెన్నులను ఆటోమేషన్ మార్చివేస్తోంది. అయితే ప్రతి సాంకేతిక విప్లవమూ కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ఆ నూతన అవకాశాలను అందిపుచ్చుకునేలా యువజనులను మనం సంసిద్ధపరచవలసిన అవసరమున్నది. 1991లో ఆర్థిక వ్యవస్థను సరళీకరించి అపూర్వ అభివృద్ధిని సాధించాము. 2026లో మన ఆలోచనలను సరళీకరించుకోవల్సిన సమయం ఆసన్నమయింది. నాకు సన్నిహితులుగా పరిగణన అవుతున్న ఏ వ్యాపారవేత్తకూ అనుకూలంగా నిర్ణయాలు తీసుకోనని మీకు హామీ ఇస్తున్నాను.
భారతీయ మహిళలకు నా సందేశం ఏమిటంటే బేటీ బచావో, బేటీ పడావో (ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలకు చదువు చెప్పండి) అనేది ఒక శక్తిమంతమైన నినాదం. అయితే ప్రభుత్వాల పాలనాదక్షతను నినాదాల ప్రాతిపదికన నిర్ణయించకూడదు. చేపట్టిన కార్యక్రమాలు సాధించిన ఫలితాల ఆధారంగానే ప్రభుత్వాల పనితీరుపై తీర్పు ఇవ్వాలి. ఇక నుంచి ప్రతి ఎన్నికలలోను 50శాతం టిక్కెట్లను మహిళలకే ఇవ్వాలని నా పార్టీ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నది. సాధికారత గురించిన ప్రసంగాలు మహిళలకు అవసరం లేదు. వారికి భద్రత, అవకాశాలు, సమాన అధికారాలు అవసరం. వీటిని తక్షణమే కల్పించడం ప్రభుత్వ బాధ్యత.
ఇక ఇప్పుడు పార్లమెంటు గురించి మాట్లాడతాను. ప్రతి బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నకు సమాధానాలు ఇస్తుంటాను. ప్రజాస్వామ్యం అంటే మీ ప్రత్యర్థి నోరు మూయించే కళ కాదు, వారికి సమాధానమిచ్చే కౌశలం. సరే, నా మీడియా స్నేహితులకు ఒక సంతోషకరమైన విషయం చెప్పదలిచాను. ప్రతి మూడునెలల కొకసారి విలేఖర్ల సమావేశంలో పాల్గొంటాను. ఏ విషయం మీదనైనా మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అధికారానికి భయపడవద్దని మీడియాకు నేను స్పష్టంగా చెబుతున్నాను. ప్రభుత్వాన్ని ఆనందపరచడం మీ విధ్యుక్త ధర్మం కాదు. ప్రశ్నించడమే మీ విధి. అవును, నాతో సహా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరినీ మీరు ప్రశ్నించాలి.
ఇప్పుడు మన నేర న్యాయ విచారణ వ్యవస్థ గురించి రెండు మాటలు చెప్పదలిచాను. సమాజంలోని అవినీతిపరులకు అనుకూలంగా వ్యవహరించే పోలీసు వ్యవస్థతో మనం ఆధునిక సమాజాన్ని నిర్మించుకోలేము. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పోలీస్ సంస్కరణలను శీఘ్రగతిన అమలుపరుస్తున్నాను. తద్వారా అవినీతి రాజకీయ నాయకులు– పోలీసుల మధ్య చట్ట విరుద్ధ, హానికర బంధాన్ని రూపుమాపుతాను. మన గౌరవనీయ న్యాయమూర్తులకు ఒక విషయాన్ని స్పష్టం చేయదలిచాను. ఈ రోజు ఒక ఇబ్బందికరమైన తీర్పు ఇచ్చినందుకు రేపు మరే ప్రభుత్వ పదవిలోనూ నియమించరనే భయం వద్దు. కలత పడవద్దు. పదవీ విరమణ తరువాత న్యాయమూర్తులను మరింత ఉన్నత పదవులలో నియమించే సంస్కృతికి స్వస్తి చెబుతున్నాను. నిర్భీతితో స్వతంత్రంగా వ్యవహరించే న్యాయవ్యవస్థ మనకు అవసరం. న్యాయాధికారులు నా ఉద్యోగులు కారు. వారు రాజ్యాంగ సంరక్షకులు. ఎన్నికల సంఘంలో కూడా సంస్కరణలు అమలుపరచాలని నిర్ణయించాను. ప్రభుత్వం, ప్రతిపక్షం, న్యాయవ్యవస్థ, స్వతంత్ర సభ్యులను భాగస్వాములను చేస్తూ ఒక నిజమైన విస్తృత ఎంపిక విధానాన్ని సృష్టిస్తాను. ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ప్రతి చిన్న వివరాన్ని బహిరంగంగా వెల్లడించి, తీసుకున్న నిర్ణయాలకు ఎలా వచ్చిందీ బహిరంగంగా వెల్లడించడం కూడా ఆ ఎంపిక ప్రక్రియలో అంతర్భాగంగా ఉంటుంది. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికలు. వాటిని నిర్వహించే అధికారులు నిష్పాక్షికంగా ఉండాలి. ఆ మధ్యవర్తులు ఏ పక్షానికి చెందినవారుగానూ కనిపించకూడదు.
నేను అత్యంత ప్రాధాన్యమిస్తున్న మరో అంశం: పర్యావరణ పరిరక్షణ. భారతీయులు నివసిస్తున్న ప్రాకృతిక ఆవరణలను ధ్వంసం చేయడం ద్వారా భారత్ అభివృద్ధి చెందదు. మన పిల్లలు స్వచ్ఛమైన గాలిని శ్వాసించలేకపోతే పది లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందడం వల్ల ప్రయోజనమేముంది? ఇప్పుడు అత్యంత ముఖ్యమైన వాగ్దానం విషయానికి వస్తాను: సమాఖ్య పాలనా విధానం. నా ప్రభుత్వ పాలనలో ‘డబుల్–ఇంజిన్’ వివక్ష ఉండబోదు. మా పార్టీ అధికారంలో ఉన్న ఒక రాష్ట్రం, ప్రతిపక్షం పాలనలో ఉన్న ఒక రాష్ట్రం కంటే ఏ విధంగాను మరింత ఎక్కువగా భారతీయ రాష్ట్రం కాదు. ఆర్థిక వనరుల పంపిణీలో ఎటువంటి పక్షపాతం ఉండదు. రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం జరగదు. ఎన్నికైన ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం నా విధానం కాదు. ఫిరాయింపుల వ్యతిరేక సంస్కరణలను అమలుపరుస్తాను. మీరు ఒక పార్టీ టిక్కెట్‌పై ఎన్నికై, ఆ పార్టీ నుంచి వైదొలిగినప్పుడు విధిగా మళ్లీ ప్రజల తీర్పును కోరాలి. పాలకులు ఎవరో నిర్ణయించేది ప్రజలు మాత్రమే.
నా సహచర భారతీయులారా! ఎనభై సంవత్సరాల స్వాతంత్ర్యంలో మనమెన్నో విజయ శిఖరాలను అధిరోహించాము. యుద్ధాలు, కరువుకాటకాలు, ఉగ్రవాద బీభత్సాలు, రాజకీయ ఉపద్రవాలు, మహమ్మారులు, ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొని అభివృద్ధి పథంలో సుస్థిరంగా ముందుకు సాగుతున్నాం. చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపాం. ప్రపంచ అతి పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థలలో నొకదాన్ని అభివృద్ధిపరిచాం. అసాధారణ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, సైనికులు, క్రీడాకారులు మన స్వాతంత్ర్యం నుంచి ప్రభవించారు.
ఆ ప్రశస్త విజయాలు అన్నిటినీ ఉత్సాహంగా వేడుక చేసుకుందాం. అయితే ఒక వాస్తవాన్ని కూడా గుర్తుంచుకుందాం: నవ భారతదేశం ఒక్క ప్రధానమంత్రి వల్లనో, ఒక్క పార్టీ వల్లనో లేదా ఒక్క సిద్ధాంతం వల్లనో నిర్మాణమవలేదు.. భారతదేశం అంచెల మీద సాగే పరుగుపందెం లాంటిది. ప్రతి తరం ఈ పరుగుపందెంలో పాల్గొంటుంది. తనవంతు పరుగును పూర్తి చేసి, ఆపై కొత్త తరం ఆ పరుగుపందెంలో పాల్గొనేందుకు స్వేచ్ఛగా, స్ఫూర్తిదాయకంగా ఆస్కారమిస్తుంది. ఈ కారణంగానే నేను ఈ శుభ సందర్భంలో జవహర్‌లాల్ నెహ్రూకు ప్రణామాలు అర్పిస్తున్నాను. నా సొంత పార్టీలో కొంతమంది ఇందుకు ఆక్షేపణ తెలుపుతారని నాకు బాగా తెలుసు. నెహ్రూ ప్రస్తావన ఎందుకు అని వారు ప్రశ్నిస్తారు. జాతి నిర్మాణంలో మన ముందు తరాల వారి కృషిని విస్మరించడం లేదా రూపుమాపడమే దేశభక్తి అని నేను విశ్వసించను. గతంలోని పాత విషయాలతో గొడవపడడం వల్ల జాతులు పురోగమించవు. గతం నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారానే ఎవరైనా తమ దేశాన్ని మరింత మహోన్నత స్థితికి తీసుకుపోవడం సాధ్యమవుతుంది. సమున్నత భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం మనలో ప్రతి ఒక్కరిదీ. కుల మతాలు, ప్రాంతాలు, ఆదాయాలకు అతీతంగా ఈ రిపబ్లిక్ ప్రతి భారతీయుడికీ చెందుతుంది. ప్రస్తుత ప్రధాన సేవకుడిగా అది నా దార్శనికత. ‘జై హింద్’ అనేది మాతో ఏకీభవించేవారికే పరిమితమైన నినాదం కాదు, అది ప్రతి భారతీయుడి స్ఫూర్తిదాయక ఉద్ఘోష అని ఈ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ మనం గుర్తుంచుకుందాం. జై హింద్.
తాజా కలం: నేను భారత ప్రధానమంత్రిని అయ్యే అవకాశం లేనే లేదు కనుక ఈ ప్రసంగం పూర్తిగా నా ఊహాజనితమే.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఈ వార్తలను కూడా చదవండి:
పార్క్‌లో భారీ కొండచిలువ హల్‌చల్.. వీడియో వైరల్
ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా.. గంటకు 45.6 కిలోమీటర్ల వేగంతో చైనా 'సూపర్‌మ్యాన్' రోబో..