భారత ఫోటోగ్రఫీ పితామహుడు
ABN , Publish Date - Aug 19 , 2026 | 01:20 AM
19వ శతాబ్దంలో బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న కెమెరా కళను భారతీయ దృక్పథంలోకి మార్చి హైదరాబాద్ సంస్కృతికి ఒక దృశ్య రూపాన్ని (Visual Identity) అందించిన గొప్ప కళాకారుడు రాజా దీన్ దయాళ్. హైదరాబాద్ ఫోటోగ్రఫీ చరిత్రలో...
19వ శతాబ్దంలో బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న కెమెరా కళను భారతీయ దృక్పథంలోకి మార్చి హైదరాబాద్ సంస్కృతికి ఒక దృశ్య రూపాన్ని (Visual Identity) అందించిన గొప్ప కళాకారుడు రాజా దీన్ దయాళ్. హైదరాబాద్ ఫోటోగ్రఫీ చరిత్రలో రాజా దీన్ దయాళ్ పాత్ర అత్యంత కీలకం. ఆయన మొదట చిత్రకారుడిగా నైపుణ్యం సాధించి వ్యాపార దృక్పథంతో సికింద్రాబాద్, బొంబాయి, మద్రాసు, ఇండోర్ వంటి నగరాల్లో స్టూడియోలను స్థాపించాడు. అవి కాలక్రమేణా ఫోటోగ్రఫీ కళకు ఒక బ్రాండ్‌గా పేరు ప్రతిష్టను సంతరించుకున్నవి. ఆంగ్లేయుల ఉనికి స్పష్టంగా కనిపించే ఆ వలస కాలంలో బౌర్న్ & షెపర్డ్, జాన్‌స్టన్ & హాఫ్‌మాన్‌లతో సహా ఎందరో యూరోపియన్ ఫోటోగ్రాఫర్‌లకు, ఫోటోగ్రాఫిక్ సంస్థలకు భారతదేశం నిలయంగా ఉండేది. కానీ 1903 నాటి ఢిల్లీ దర్బార్ అనే ఆ అత్యంత వైభవమైన దృశ్యానికి సంబంధించిన ఛాయాచిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అవి రాజా దీన్ దయాళ్ తీసిన ఫొటోలే. హైదరాబాద్‌లో ఫోటోగ్రఫీ ఆరంభం 1850–1870ల మధ్యకాలంలో ప్రారంభమైందని చెప్పవచ్చు.
1850ల ప్రాంతంలో నిజాం పాలనలో హైదరాబాద్ ఆర్థికంగా, సాంకేతికంగా వేగంగా ఎదుగుతోంది. సికింద్రాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెంట్లు మొదటిసారి ఇక్కడకు కెమెరాలను తీసుకువచ్చారు. వారంతా సికింద్రాబాద్ కంటోన్మెంట్, బ్రిటిష్ అధికారులు. వారు చార్మినార్ వంటి ప్రదేశాలను ఫోటోలు తీశారు. ఐతే ఆనాటి ఫోటోలన్నీ వలస పాలనా (బ్రిటిష్) దృక్పథంతోనే ఉండేవి. స్థానిక సంస్కృతి, ప్రజల జీవన విధానాలు అందులో ప్రతిబింబించేవి కావు. ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ (ఆసఫ్ జా VI) రైల్వేలు, విద్యుత్ వంటి నూతన సాంకేతికతలతో పాటు ఫోటోగ్రఫీ పట్ల ప్రత్యేకమైన ఆసక్తి చూపేవారు. ఈ కాలంలోనే రాజా దీన్ దయాల్ ఫోటోగ్రాఫర్‌గా హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని సర్ధనాలో 1844లో జన్మించిన దీన్ దయాళ్, ఇండోర్ రాజ్యంలో గుమాస్తాగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, 1866లో హాబీగా ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు. ఇండోర్ మహారాజా ప్రోత్సాహంతో 1870లలో ఇండోర్, సికింద్రాబాద్, ముంబైలలో ‘లాలా దీన్ దయాళ్ & సన్స్’ పేరిట స్టూడియోలు స్థాపించారు. 1885లో ఆరవ నిజాం ఆయనను ‘కోర్ట్ ఫోటోగ్రాఫర్’గా నియమించాడు. ఆ తర్వాత వైస్రాయ్ ఫోటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందాడు. దీన్ దయాళ్ 1887లో క్వీన్ విక్టోరియా చేతుల మీదుగా ‘రాజా’ బిరుదు పొందిన ఏకైక భారతీయ ఫోటోగ్రాఫర్‌గా చరిత్ర సృష్టించారు. భారతీయుడు కావడం వల్ల ఆయన రాయల్ జనానాలలోకి (అంతఃపురం), ప్రైవేట్ కోర్టులు, దేవాలయాల్లోకి వెళ్లి ఫోటోలు తీసే అరుదైన అవకాశం పొందాడు.
రాజా దీన్ దయాళ్ 1885–1895 మధ్యకాలంలో తీసిన ఫోటోలు హైదరాబాద్ రూపురేఖలను ప్రపంచానికి చాటిచెప్పాయి. ఆయన సృష్టించిన ‘Views of Hyderabad’, ‘Views of Deccan’ ఆల్బమ్‌లు ప్రపంచప్రసిద్ధి పొందాయి. చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా, కింగ్ కోఠి, పురానీ హవేలీ వంటి రాజభవనాలు; చార్మినార్, మక్కా మసీదు, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్ వంటి ల్యాండ్‌మార్క్‌లు; నిజాం నవాబు, నర్తకులు, మల్లయోధులు, పండుగలు, ఏనుగుల ఊరేగింపులు వంటి వ్యక్తులకు, సామాజిక జీవితానికి సంబంధించిన దృశ్యాలు ఆయన కెమెరాతో శాశ్వతంగా భావితరాలకు దృశ్య రూపంలో అందినవి. శతాబ్దాల వారసత్వ సంపదగా హైదరాబాద్ సౌందర్యం కేవలం దీన్ దయాళ్ ఫోటోల ద్వారానే చరిత్రలో చెరగని స్థానం సంపాదించుకున్నవి.
రాజా దీన్ దయాళ్ తాను నెలకొల్పిన సికింద్రాబాద్ స్టూడియో ద్వారా ఎంతో మంది భారతీయ ఫోటోగ్రాఫర్లకు శిక్షణ ఇచ్చి, నగరాన్ని ఒక ఫోటో హబ్‌గా మార్చారు. ఆయన తీసిన వేలాది గ్లాస్ ప్లేట్ నెగెటివ్‌లు నేటికీ సాలార్‌జంగ్ మ్యూజియం, అల్కాజీ ఫౌండేషన్ (ఢిల్లీ), చౌమహల్లా ప్యాలెస్, బ్రిటిష్ లైబ్రరీలలో భద్రపరచబడి ఉన్నాయి. రాజా దీన్ దయాళ్ ఫోటోగ్రఫీలో వేసిన నాటి పునాదులపైనే హైదరాబాద్ నేడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, హెరిటేజ్ డాక్యుమెంటేషన్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఫోటోగ్రఫీ విభాగంతో దేశంలోనే ప్రముఖ కేంద్రంగా నిలిచింది.
రాజా దీన్ దయాళ్‌కు ముందు హైదరాబాద్‌ను బయటివారు చిత్రీకరిస్తే, ఆయన ద్వారా హైదరాబాద్ తనను తాను ఫోటోలు తీసుకోవడం ప్రారంభించింది. హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలకు తన అద్భుతమైన సహజ సుందర ఛాయాచిత్రాల ద్వారా మొదటి గుర్తింపు తెచ్చిపెట్టిన మహానీయుడు రాజా దీన్ దయాళ్. హైదరాబాద్‌ను ఒక ఎత్తయిన భవనాల వింతగా కాకుండా భారతీయ దృక్పథంతో దక్కన్ సంస్కృతిలోని ఆత్మను పట్టి చూపించాడు. 140 ఏళ్ల క్రితం ఆయన రూపొందించిన పెద్ద ఫార్మాట్ గ్లాస్ ప్లేట్లు నేటికీ కూడా పదునుగా ఉన్నాయంటే దీన్ దయాళ్ సాంకేతిక నైపుణ్యం ఈ స్థాయిలో ఉండేదో మనం అంచనా వేయవచ్చు. 19వ శతాబ్దపు హైదరాబాద్‌ను చూసేందుకు నేటికీ ఆయన ఫోటోలే ఏకైక మార్గం. 1905 జూలైలో తన కెమెరాను విడిచిపెట్టి కన్నుమూసిన రాజా దీన్ దయాళ్ భారతీయ ఫోటోగ్రఫీకి పితామహుడిగా తన స్థానాన్ని పదిలపరచుకున్నాడు.
హెచ్. రమేష్‌బాబు
ఇండిపెండెంట్ జర్నలిస్ట్
(నేడు వరల్డ్ ఫోటోగ్రఫీ డే)
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం