Share News

ప్రతిఘటన పథంలో ‘ఇండియా’

ABN , Publish Date - Jun 25 , 2026 | 01:34 AM

ప్రతిఘటన. జూన్‌ 8న ‘ఇండియా కూటమి’ (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌) అంతర్గత సమావేశంలో రాహుల్‌గాంధీ వెలువరించిన స్ఫూర్తిదాయక ప్రసంగం సారాంశాన్ని...

ప్రతిఘటన పథంలో ‘ఇండియా’

ప్రతిఘటన. జూన్‌ 8న ‘ఇండియా కూటమి’ (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌) అంతర్గత సమావేశంలో రాహుల్‌గాంధీ వెలువరించిన స్ఫూర్తిదాయక ప్రసంగం సారాంశాన్ని సంగ్రహపరిచిన పదమది. ‘కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రతిఘటన ఉద్యమం’ అని రాహుల్‌ ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యను ప్రస్తుత కాంగ్రెస్‌ కార్యకలాపాల వాస్తవికత గురించిన ప్రకటనగా కాకుండా గతించిన తరాల వారిని ఎంతగానో ఉత్తేజపరిచిన ఒక ఆదర్శాన్ని పునరుద్ధరించి ఔదలదాల్చే సంకల్పంగా భావించాలి. వర్తమాన భారత ప్రజాస్వామ్యాన్ని పీడిస్తున్న సమస్యల గురించి ఆయన చేసిన నిశిత విశ్లేషణ, వాటిని అధిగమించేందుకు సూచించిన పరిష్కార మార్గాలే రాహుల్‌ ప్రసంగ విశిష్టతలు. అవి మౌలికమైనవి, కనుక సార్థకమైనవి. జాతి రాజకీయ జీవితంలో నిర్ణయాత్మక మార్పులు చోటుచేసుకుంటున్న తరుణమిది: పోటీతత్వ నిరంకుశత్వం (కాంపిటీటివ్‌ అథారిటేరియనిజం) నుంచి ఏకపక్ష ఆధిపత్యం (ఎలెక్టోరల్‌ ఆటోక్రసీ) భారత గణతంత్ర రాజ్య రాజకీయాలు పరివర్తన చెందుతున్న కీలక సందర్భంలో నేడు మనం ఉన్నాం. రాహుల్‌ ప్రసంగం దేశ రాజకీయాలలో రావాల్సిన ఒక వ్యూహాత్మక మార్పును కూడా స్పష్టంగా, తార్కికంగా ప్రకటించింది: ఎన్నికల పోటీ రాజకీయాల నుంచి ప్రతిఘటనాత్మక రాజకీయాలకు ప్రతిపక్షాలు పరివర్తన చెందాలి. ఈ ప్రకటనలోని ప్రధాన భావాలను చర్చించాలి, మెరుగుపరచాలి, సులభగ్రాహ్యం చేయాలి, ప్రజలలో వ్యాపింపజేయాలి. ఇది నేటి రాజకీయ కర్తవ్యాలలో ముఖ్యమైనది.

భారత ప్రభుత్వ యంత్రాంగాలు అన్నిటినీ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ స్వాధీనం చేసుకున్నదని రాహుల్‌ తన ప్రసంగంలో నిశితంగా విశ్లేషించారు. మీడియా, సోషల్‌ మీడియా, న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ దర్యాప్తు, గూఢచర్య సంస్థలు సమస్తమూ ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎప్పటికీ అధికారంలో ఉంచేందుకు దీక్షాదక్షతలు చూపుతున్నాయని ఆయన గర్హించారు. ఈ పరిస్థితి మరింతగా అధ్వానమవుతోందని ఆయన స్పష్టంగా చెప్పారు. ‘ఇంతవరకు తమ రాజ్యాంగ విధులను ఎలాగోలా సక్రమంగా నిర్వర్తిస్తున్న ప్రభుత్వ సంస్థలు సైతం సమీప భవిష్యత్తులోనే అలా పనిచేయడాన్ని నిలిపివేస్తాయి. కారణమేమిటి? భారత రాజ్య వ్యవస్థపై బీజేపీ, ఆరెస్సెస్‌లు తమ పట్టును ఎటువంటి మినహాయింపు లేకుండా సంపూర్ణంగా బిగిస్తాయని రాహుల్‌ అన్నారు.


భారత ప్రజాస్వామ్యంలోని తిరోగమన పోకడలు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థల పతన రీతులను ప్రతిబింబిస్తున్నాయని రాజనీతి శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పతనం రాత్రికిరాత్రే సంభవించినది కాదని మనకు తెలుసు. ప్రజాస్వామ్యం అంటే ‘సంస్థాగత అనిశ్చితి’ అని పోలిష్‌–అమెరికన్‌ రాజనీతి శాస్త్రవేత్త ఆడమ్‌ ప్రెవోర్స్కీ సుప్రసిద్ధంగా నిర్వచించారు. ప్రజాస్వామ్యం అంటే పార్టీలు ఎన్నికలలో ఓడిపోయే వ్యవస్థ అని, అధికారాన్ని కోల్పోయే అపాయాన్ని పాలకులు అంగీకరించే విధానమే ప్రజాస్వామ్యమని ఆయన విశదీకరించారు. అధికారాన్ని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకే పాలకులు రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రతను తగ్గించి వాటిని తమకు అనుకూలంగా చేసుకుంటున్నారు. తత్ఫలితంగా ప్రజాస్వామ్యం తిరోగమిస్తోంది.

ప్రజాస్వామ్య తిరోగమనంలో రెండు మధ్యంతర దశలు ఉన్నాయి. మొదటిది– పోటీతత్వ నిరంకుశత్వం. ఈ నిరంకుశత్వ పాలనా విధానం బహుళ పార్టీల ఎన్నికలను నిర్వహిస్తుంది. అధికారంలో ఉన్న వారు పరిస్థితులను ఎలాగైనా సరే పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకుంటారు. అధికారానికి పార్టీల మధ్య పోటీ ఉంటుంది. అయితే అది ప్రాథమికంగా అసమమైనది, అన్యాయమైనది. ఈ దృష్ట్యా ఇది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. ఇక రెండోది– ఏకపక్ష ఆధిపత్యం. ఈ వ్యవస్థలో క్రమం తప్పకుండా బహుళ పార్టీ ఎన్నికలు జరుగుతుంటాయి. అయితే ఆ ఎన్నికలు నామమాత్రమైనవే. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన పౌర స్వేచ్ఛలు ఉండవు. పోటీ చేసే రాజకీయ పక్షాలకు సమాన అవకాశాలు ఉండవు. పాలకులు తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి నిర్నిబంధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడతారు. నియంతృత్వ పాలనకు చట్టబద్ధత కల్పించేందుకు మాత్రమే ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి.

భారత్‌ ప్రస్తుతం ఈ రెండు దశల మధ్య ఉన్నది. 2019 సార్వత్రక ఎన్నికల అనంతరం మన దేశం ఒక నిరంకుశత్వ పాలనా రాజ్యంగా పరిణమించింది. ఏకపక్ష ఆధిపత్యంలోకి భారత్‌ పతనాన్ని 2024 సార్వత్రక ఎన్నికలలో ప్రజా తీర్పు నిలువరించింది. దేశ పాలకులు ఆనాటి నుంచీ ఏ ఎన్నికలలోనూ పరాజయం పాలవ్వకుండా ఉండేందుకు చేయని ప్రయత్నమేదీ లేదు. అందులో భాగంగా మీడియా ద్వారా సమాచారాన్ని నియంత్రిస్తున్నారు; ప్రభుత్వ అధికారాలను ఉపయోగించుకుని ఆర్థిక వనరులను అపారంగా సమకూర్చుకుంటున్నారు; ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. ఇలా సమస్త సమాజంపై అసాధారణ గుత్తాధిపత్యం ద్వారా సంభావ్య రాజకీయ నష్టాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటున్నారు లేదా నివారించుకుంటున్నారు. వీటి ద్వారా తమకు ఏర్పడిన అనుకూలతలను మరింతగా పెంపొందించుకునేందుకై ఎన్నికల వ్యవస్థకు పునఃరూపకల్పన చేస్తున్నారు: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియల ద్వారా దేశ రాజకీయ భౌగోళిక స్వరూపాన్ని మార్చివేసేందుకు పూనుకున్నారు; పంచాయత్‌ నుంచి పార్లమెంటు దాకా సమస్త ప్రజాప్రాతినిధ్య సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడమనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో ఆ లక్ష్య పరిపూర్తికి ప్రజల ఆమోదాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు; మరీ ముఖ్యంగా ఓటర్‌ జాబితాల సమగ్ర ప్రత్యేక సవరణ ద్వారా ఎన్నికల వ్యవస్థను ఎటువంటి మినహాయింపులేకుండా తమకు అనుగుణంగా మార్చుకునేందుకు ప్రస్తుత పాలకులు చురుగ్గా కృషి చేస్తున్నారు.


ఈ ప్రక్రియలన్నీ పూర్తయినప్పుడు మన ప్రజాస్వామ్యం పూర్తిగా ఏకపక్ష ఆధిపత్యంగా రూపొందుతుంది. ఎన్నికల ద్వారా సాధారణ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక రాజకీయ పక్షం నుంచి మరో రాజకీయ పక్షానికి అధికారం బదిలీ అయ్యేందుకు చాలా చాలా తక్కువ అవకాశం మాత్రమే ఉంటుంది. నిక్కచ్చిగా చెప్పాలంటే అది పూర్తిగా ఉపేక్షణీయ అవకాశం. మన ప్రజాస్వామ్యం నేతి బీర చందమవుతుంది. ప్రతిపక్షాలు ఎట్టకేలకు ఈ కఠోర, నైరాశ్యపూరిత సత్యాన్ని గ్రహించాయి. దాన్ని ఎదుర్కోవడానికి సమకట్టాయి.

రాహుల్‌ గాంధీ ప్రసంగం భారత ప్రజాస్వామ్యానికి వాటిల్లిన ప్రమాదాల విశ్లేషణకే పరిమితమైనది కాదు. అదొక ఉత్తేజకరమైన ఉపన్యాసం. ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడమేకాకుండా ధర్మ రక్షణకై చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణకు విస్పష్టమైన సూచనలు అందులో ఉన్నాయి. తత్కారణంగానే అది స్ఫూర్తిదాయకమైనది. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిలబడే సంకల్పాన్ని మనలో జనింపజేసింది. మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్షాలు ఇప్పటిదాకా అనుసరిస్తున్న రాజకీయ పద్ధతులు సత్ఫలితాలనివ్వడంలో సఫలమవడం లేదు. ఎందుకని? రాజ్యాంగ వ్యవస్థలను నియంత్రిస్తున్న పాలకులు రాజ్యాంగం నిర్దేశించిన విధంగా ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు కల్పించడం లేదు. సమాన అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామిక రాజకీయ సాధనాలు ప్రభావశీలంగా ఉంటాయి. అటువంటి అవకాశాలు ప్రతిపక్షాలకు ఇంకెంత మాత్రం లేవు. రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న ప్రామాణిక రాజకీయ పద్ధతులు పని చేయనప్పుడు ఏది కార్యసాధకమవుతుంది? ప్రతిఘటన, అవును ప్రతిఘటనే అని రాహుల్‌ స్పష్టం చేశారు. ఎన్నికల రాజకీయాలపైనే ఎక్కువగా ఆధారపడడం ఇంకెంత మాత్రం శ్రేయస్కరం కాదని ఆయన గట్టిగా చెప్పారు. ‘ప్రతిపక్షాలు ఎన్నికలలో గెలిచేందుకు అవి స్వేచ్ఛగా, సక్రమంగా జరగడం లేదు. కనుక మనం ప్రతిఘటన మార్గాన్ని అనుసరించాలి’ అని రాహుల్‌ దృఢస్వరంతో చెప్పారు. ప్రతిఘటన ఒక స్ఫూర్తి కావాలి, ఒక మనోవైఖరిగా భాసించాలి అని రాహుల్‌ వక్కాణించారు. ప్రతిఘటన కేవలం సంస్థాగతంగా మాత్రమే ఉండకూడదు. అలా ఉన్న పక్షంలో దాని ప్రభావశీలత పరిమితమవుతుందని ఆయన అన్నారు. వివేకవంతమైన అంతర్దృష్టి ఇది, సందేహం లేదు.

ప్రతిఘటన స్ఫూర్తి విశాల ప్రజానీకంలో మనసా, వాచా, కర్మణా వెలుగొందాలని ప్రతిపక్ష నాయకుడు ఆశించడం సూచిస్తున్నదేమిటి? ప్రతిపక్ష రాజకీయాలలో ఒక మౌలిక మార్పునే కాదూ? అవును, విపక్ష రాజకీయ కార్యాచరణ పార్లమెంటు నుంచి ప్రజా నిరసనలకు, ఎన్నికలలో పోటీ చేయడం నుంచి క్షేత్ర స్థాయిలో జన సమీకరణకు, అధికారాన్ని గెలుచుకునే రాజకీయాల నుంచి రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన మార్గంలోకి మన ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాన్ని మళ్లీ తీసుకువెళ్లే రాజకీయాలకు మారాలి, మారితీరాలి. ఇది జరూరుగా జరగాలి. మనదైన ఒక ప్రజాస్వామిక పోరాటపథాన్ని మనం ఎంచుకోవాలి. తద్వారా మాత్రమే మన గణతంత్ర రాజ్యాన్ని సంకుచిత శక్తుల నుంచి విముక్తి చేయగలుగుతాము. ఈ చరిత్రాత్మక బాధ్యత కేవలం ఒక్క ‘ఇండియా’ కూటమిది మాత్రమే కాదు. చైతన్యశీల శక్తులు అన్నిటినీ సమ్మేళనపరచడం ద్వారా మాత్రమే ఆ బాధ్యతను సమర్థంగా, సార్థకంగా నిర్వహించడం సాధ్యమవుతుంది.


ప్రతిఘటనకు ఇలా ప్రాధాన్యమివ్వడం రాజ్యాంగ విహిత, పార్లమెంటరీ పోరాట పద్ధతులను త్యజించాలని పిలుపునివ్వడం ఎంత మాత్రం కాదు. రాజకీయాలను అర్థవంతంగా, ఆచరణయోగ్యంగా మళ్లీ ప్రజలకు చేరువ చేసేందుకు అదొక అభ్యర్థన అన్న వాస్తవాన్ని గ్రహించాలి. ప్రజలు, ప్రతిపక్షాలు నిరంతరం ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశ్నిస్తుండాలి. ప్రశ్నించడాన్ని, నిరసనలు తెలపడాన్ని మానివేస్తే వీధులు నిశ్శబ్దంగా ఉంటాయని, ప్రజల మౌనం పార్లమెంటు ఒక ధూర్త సంస్థగా మారిపోయేందుకు దారితీస్తుందని దశాబ్దాల క్రితం డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా హెచ్చరించారు. ప్రజాశ్రేయస్సు పట్ల చిత్తశుద్ధిలేని పార్లమెంటు ప్రజాస్వామిక పాలనకు ఎలా దోహదం చేస్తుంది?

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఇవి కూడా చదవండి

వైభవ్ సూర్యవంశీ తమ్ముడు మరో భారీ సెంచరీ

80 ఏళ్ల వయసులో కళాకారుడి కష్టాలు.. వీడియో చూసి చలించిపోయిన ఆనంద్ మహీంద్ర..

Updated Date - Jun 25 , 2026 | 01:34 AM