ప్రశ్నించటమే అసలైన దేశభక్తి..!
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:08 AM
ప్రశ్న: అధికారం భయాన్నే ఒక ఆయుధంగా మార్చుకున్నప్పుడు, భయపడటానికి నిరాకరించడమే ఒక పెద్ద తిరుగుబాటు అవుతుంది. ‘జెన్ జీ’ (Gen Z) ఈ భయాన్ని ఎలా జయించింది...
ప్రశ్న: అధికారం భయాన్నే ఒక ఆయుధంగా మార్చుకున్నప్పుడు, భయపడటానికి నిరాకరించడమే ఒక పెద్ద తిరుగుబాటు అవుతుంది. ‘జెన్ జీ’ (Gen Z) ఈ భయాన్ని ఎలా జయించింది?
నేహా: భయం తన హద్దులు దాటినప్పుడు చివరకు భయమే చనిపోతుంది. హిందీలో ఒక కవిత ఉంది – ‘జుల్మ్ జబ్ హద్ సే బడ్తా హైతో మిట్ జాతా హై’ (అణచివేత హద్దులు దాటినప్పుడే దానికి అంతం మొదలవుతుంది). ప్రజలను ఎంతగా భయపెడతారు? లాఠీలు ఝుళిపిస్తారు, పెల్లెట్ గన్స్ ప్రయోగిస్తారు, ఉగ్రవాదులంటారు, వైరస్‌లంటారు. ఒక దశ తర్వాత ప్రజలు భయపడటం మానేస్తారు. భయం సరిహద్దు దాటితే వచ్చేది ధైర్యమే! మనమందరం సంఘటితమై పోరాడితే ఎంతటి భయమైనా పటాపంచలు కావాల్సిందే.
ఈ విద్యార్థి ఉద్యమం ప్రజా ఉద్యమంగా ఎప్పుడు మారుతుంది?
విద్యార్థులు ప్రజలు కాదన్నట్టు ‘విద్యార్థి ఉద్యమమా? ప్రజా ఉద్యమమా?’ అని విడదీయటం సరికాదు. విద్యార్థులు కూడా ఈ సమాజంలో భాగమే. జంతర్ మంతర్ పోరాటం చివరివరకు ‘విద్యార్థి ఉద్యమం’గానే నిలిచింది. కాకపోతే దాని పరిధి విశాలమైంది. ‘నీట్’ బాధితులతో మొదలై, పీహెచ్‌డీ స్కాలర్లు, ఇంజనీరింగ్ విద్యార్థులు, స్కూలు పిల్లలు, సివిల్స్ అభ్యర్థుల వరకు అందరినీ ఇది ఏకం చేసింది. రైతులు, కార్మికులు, మహిళలు, లాయర్లు, ప్రొఫెసర్లు వచ్చి మద్దతు తెలిపారు. ఇది విద్యార్థి ఉద్యమ స్వరూపానికి విస్తృతమైన ప్రజాదరణను, బలమైన మద్దతును ఇచ్చింది. అంటే విద్యార్థి అనే నిర్వచనం విస్తరించింది. అయినా విద్యార్థుల ఆకాంక్షల కేంద్రంగానే సాగింది.
‘విద్యార్థులు రాజకీయాల్లోకి రాకూడదు’ అని నిరంతరం వింటుంటాం. కానీ విద్యా విధానాలు, ఫీజులు, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగాలు... అన్నీ రాజకీయ నిర్ణయాల పైనే ఆధారపడి ఉన్నాయి కదా? రాజకీయాలను ప్రశ్నించకుండా విద్యార్థులు తమ భవిష్యత్తును మార్చుకోగలరా?
రాజకీయం అనేది ఏదో చెడ్డ విషయం కాదని ఈ తరం గుర్తించింది. కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను చూస్తూ ఊరుకోకుండా, ఆ పరిస్థితిని మార్చడానికి మన చేతిలో ఉన్న శక్తిమంతమైన ఆయుధమే రాజకీయం! అందుకే రాజకీయాల నుంచి పారిపోవడం కాదు. మన జీవితాలను ప్రభావితం చేసే రాజకీయ నిర్ణయాలను అర్థం చేసుకుని, ప్రశ్నించి, అవసరమైతే మార్చే శక్తిగా రాజకీయాలను చూడాలి. ఆ మార్పు సానుకూలమైనది, నిరీక్షణను నింపేది, మెరుగైన రేపటిని అందించేది.
ప్రజలను భయపెట్టేందుకు పాలకులు కల్పిస్తున్న కృత్రిమ భయాలను ఎలా గుర్తించాలి? దాన్ని సామూహిక ధైర్యంగా ఎలా మార్చాలి?
ఫాసిస్టుల అతిపెద్ద ఆయుధం– ప్రజల్లోనే ఒకరినొకరు శత్రువులుగా మార్చడం! ఉద్యోగాలు ఎందుకు లేవని అడిగితే, ‘ముస్లింలు మీ ఉద్యోగాలు లాక్కుంటున్నారు’ అంటారు. క్యాంపస్‌లలో సీట్లు ఎందుకు లేవని అడిగితే, ‘రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు మీ సీట్లు కొట్టేస్తున్నారు’ అంటారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, కార్పొరేట్ మిత్రులను సంతృప్తిపరచడానికి ప్రభుత్వం సామాన్య ప్రజల మధ్యే పూడ్చలేని గోడలు కడుతోంది. ప్రశ్నించేవారిని ‘దేశద్రోహులు’, ‘పాకిస్తానీలు’ అని ముద్రవేయడం బాధ్యతల నుంచి పారిపోవడానికే. చరిత్రలో ఫాసిస్టు శక్తులు ఎప్పుడూ ఇదే పద్ధతిని ఉపయోగించాయి. ఒక శత్రువును తయారు చేయడం, భయాన్ని సృష్టించడం, ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించడం. ఈ కుట్రను ప్రజలు గుర్తించిన రోజే ఆ భయం ఉమ్మడి పోరాట ధైర్యంగా మారుతుంది. కొన్ని ప్రభుత్వాలు లేదా వ్యక్తులు అధికారంలో లేకపోవడమే దేశానికి మేలు అనుకున్నప్పుడు, ఆ ఫాసిస్టుల రాజీనామాను డిమాండ్ చేయడమే ఈ దేశానికి మనం చేసే అతిపెద్ద, అత్యంత నిజమైన ‘దేశభక్తి’.
జంతర్ మంతర్ వద్ద ఎంతోమంది యువతులు ముందుకొచ్చారు. అవమానాలను, అణచివేతలను ఎదుర్కొన్నారు. దేశంలోని ప్రతీ యువతికి మీరిచ్చే సందేశం ఏమిటి?
రాజ్యాంగాన్ని తీసివేసి ‘మనుస్మృతి’ని తేవాలని చూసే పాలకులకు మహిళలు ఇంట్లోనే ఉండి పురుషులకు సేవ చేయాలన్న ఆలోచన సహజమే. మహిళలు రోడ్డుపైకి వచ్చి మాట్లాడినా తమవైపు మాట్లాడినంత కాలం ఓకే. ఎదురు తిరిగి ప్రశ్నిస్తే తట్టుకోలేరు! 15 ఏళ్ల రుచిక అనే చిన్నారిపై ఐదు ఎఫ్‌ఐఆర్‌లు పెట్టారు. పార్లమెంట్‌లో ఎంపీలు మమ్మల్ని ‘గట్టర్ జనరేషన్’, ‘ఉగ్రవాదులు’ అని తిట్టినా సమాజం కంగారుపడదు కానీ, ఒక మహిళ బిగ్గరగా, రాజకీయం మాట్లాడితే – ‘ఈమె దుస్తులు చూడు, ఈమె ప్రవర్తన చూడు, కుటుంబ గౌరవాన్ని తీస్తోంది’ అని వేళ్లు చూపిస్తారు. ఇది పితృస్వామ్య ఆలోచన. ఒక మహిళ వీధిలోకి వచ్చి గళమెత్తిందంటే... ఆమె తన ఇంట్లో, తన సమాజంలో ఎన్నో పోరాటాలు చేసి, ఆ గోడలను బద్దలు కొట్టుకుని వచ్చిందని అర్థం! ఆ నిర్భయత్వమే పాలకులను వణికిస్తోంది.
ఇరవై మూడు రోజుల నిరాహార దీక్ష తర్వాత కొన్ని డిమాండ్లు నెరవేరాయి. డిమాండ్లు నెరవేరగానే ఉద్యమం ముగుస్తుందా?
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థుల ఆగ్రహం, లేదా విద్యావ్యవస్థలోని లోపాలు ఒక్కసారిగా మాయమైపోవు. మోదీ–అమిత్ షాల ప్రభుత్వం ఎంతటి నిరంకుశమైనదో, ఎంతటి అసమర్థమైనదో ఈ ఉద్యమంతో వారి గాలిబుడగ పంక్చర్ అయి ప్రపంచానికి తేటతెల్లమైంది. ఈ దేశపు కొత్త తరం (యువత)తో మాట్లాడే దారి, వారి మద్దతు వారికి పూర్తిగా పోయింది. ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఈ యువతరమే. కాబట్టి యువత తిరస్కరించిన పాలకులు త్వరలోనే అధికారం కోల్పోవడం ఖాయం.
మీ తరం కేవలం నిరసన తెలపడానికే పరిమితమా? లేక మెరుగైన విద్య, ఉపాధి, సమానత్వం, స్వేచ్ఛలతో కూడిన నవభారతాన్ని నిర్మించే స్పష్టమైన విజన్ ఉందా?
ఆగస్టు 20 నాటి హింస తర్వాత, ఒక్క మంత్రి రాజీనామాతో వ్యవస్థ మారదని అందరికీ అర్థమైంది. విద్యా, ఉపాధి, సామాజిక రంగాల్లో పాలకులు నిర్మించిన ఈ పునాదులనే కూల్చివేసి, ఒక నూతన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ కొత్త భారత్ విజన్ విత్తనం ఇప్పటికే నవతరంలో నాటుకుంది. అది త్వరలోనే వటవృక్షమై ఈ దేశాన్ని కాపాడుతుంది.
కులం, మతం, ప్రాంతం, భావజాలాల పేరుతో సమాజం విడిపోతున్న వేళ ఈ గోడలను బద్దలుకొడుతూ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ఎలా నిర్మించగలం?
మన మధ్య తేడాలు, విభేదాలు మాత్రమే ఉన్నాయని ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ ప్రచారార్భాటం మనల్ని నమ్మించింది. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే – కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా కలిసి పోరాడిన విప్లవ పోరాటాల చరిత్ర ఈ దేశానికుంది. ఈ రోజు కుప్పకూలుతున్న ప్రజా ఆరోగ్యం, ప్రైవేటీకరణ అవుతున్న విద్య, పెరిగిపోతున్న నిరుద్యోగం ప్రతీ ఒక్కరి సమస్య! ఈ ఉమ్మడి సమస్యలపై మనం గళమెత్తితే, ద్వేషపూరిత రాజకీయాలను తుత్తునియలు చేసే ఉమ్మడి పోరాట వేదిక దానంతట అదే ఏర్పడుతుంది.
ఎలాంటి భావి భారతాన్ని మీరు కోరుకుంటున్నారు?
ప్రతీ ఒక్కరికీ జీవించే హక్కు, ఆత్మగౌరవం, సమాన విద్యావకాశాలు ఉండే భారతాన్ని మేము కోరుకుంటున్నాం. కేవలం పొట్టకూటి కోసం బతకడం కాదు... సృజనాత్మకతతో, సంతోషంతో బతికే స్వేచ్ఛ కావాలి. పేద–ధనిక, కుల–లింగ భేదాల మధ్య ఉన్న అంతరాలను తుడిచిపెట్టినప్పుడే ఇది సాధ్యమవుతుంది. సౌహార్ద్రత, సమానత్వంతో ప్రజలందరినీ ఏకం చేయడమే మా వ్యూహం.
ఇవి కూడా చదవండి..
నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం..
పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..