మరచిపోలేని మహేంద్రుడు
ABN , Publish Date - Jun 10 , 2026 | 02:11 AM
ప్రజా బంధువు, రాజకీయ దురంధరుడు, దళిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి పుట్టపాగ మహేంద్రనాథ్. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన నిగర్వి,...
ప్రజా బంధువు, రాజకీయ దురంధరుడు, దళిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి పుట్టపాగ మహేంద్రనాథ్. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన నిగర్వి, నిరాడంబరుడు, నిస్వార్థ ప్రజాసేవకుడు. మహేంద్రనాథ్ జూన్ 10, 1926న నాగర్‌కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం జొన్నల బోగుడ గ్రామంలో బాలమ్మ, మసన్న దంపతులకు జన్మించారు. ఉర్దూ మీడియంలో లా డిప్లొమా చేశారు. 1957లో ఎమ్మెల్యేగా నాగర్‌కర్నూల్ ద్విసభ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1962లో అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1967, 1972లలో నాగర్‌కర్నూల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1972లో పీవీ నరసింహారావు కేబినెట్‌లో ఎక్సైజ్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 1978లో గిడ్డంగులశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
1988లో తెలుగుదేశం పార్టీలో చేరి, అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీ రామారావు కేబినెట్‌లో రెవెన్యూ, పౌరసరఫరాల మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. పటేల్, పట్వారి వ్యవస్థను రద్దు చేయటంలో కీలకపాత్ర వహించారు. పట్టాదారు పాసుపుస్తకాల ద్వారా ఋణాలు తీసుకోవడానికి, భూమి అమ్ముకోవడానికి వీలు కల్పించే చట్టం చేశారు. గ్రామంలో సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. నాగర్‌కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాలలో కమ్యూనిటీ హాళ్లు, రవాణా సౌకర్యాలు, బస్ డిపోలు, మార్కెట్ యార్డులు ఏర్పాటు చేశారు. జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఐటీఐ, ఉన్నత పాఠశాలల్లో ప్రతి మండలంలో దళిత, గిరిజన వెనుకబడిన తరగతులు విద్యార్థుల వసతి గృహాలను ఏర్పాటు చేయటంలో విశేష కృషి చేశారు. 1985లోనూ అచ్చంపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. రెండోసారి ఎన్టీఆర్ కేబినెట్‌లో ఆర్థికశాఖ, విద్యుత్‌శాఖ, చిన్నమొత్తాల పొదుపుశాఖ మంత్రిగా పని చేశారు. ఒక దళితుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థికమంత్రి కావడం అదే ప్రథమం.
పుట్టపాగ మహేంద్రనాథ్ 2005, జూలై 17న కన్నుమూశారు. ఎంతోమంది శిష్యులను రాజకీయంగా ఎదగడానికి ఆయన కృషి చేశారు. ఆయన చేసిన సేవలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి నాగర్‌కర్నూలు జిల్లా పేరును పుట్టపాగ మహేంద్రనాథ్ జిల్లాగా మార్చాలి.
సంకూరి రాజారావు
గుంటూరు
(నేడు పుట్టపాగ మహేంద్రనాథ్ శతజయంతి)
ఇవి కూడా చదవండి..
విజయ్ కీలక నిర్ణయం.. మహిళల భద్రత కోసం సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్
సంతకాల ఫోర్జరీ కేసు.. మమతా బెనర్జీ కార్యాలయానికి సీఐడీ టీమ్