ఒక విషాదమూ... విస్తృత మానవానుభవమూ!
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:32 AM
కొన్ని జీవితాలను పదవులు, పురస్కారాలు, విజయాల జాబితాతో కొలవడం సాధ్యం కాదు. కొన్ని జీవితాలు సమాజం ముందు కొన్ని అసౌకర్యకరమైన ప్రశ్నలను ఉంచి వెళ్తాయి. న్యాయం అంటే ఏమిటి? రాజ్యాధికారానికి...
కొన్ని జీవితాలను పదవులు, పురస్కారాలు, విజయాల జాబితాతో కొలవడం సాధ్యం కాదు. కొన్ని జీవితాలు సమాజం ముందు కొన్ని అసౌకర్యకరమైన ప్రశ్నలను ఉంచి వెళ్తాయి. న్యాయం అంటే ఏమిటి? రాజ్యాధికారానికి ఉన్న హద్దులు ఏమిటి? భిన్నమైన ఆలోచనలకు ప్రజాస్వామ్యంలో ఎంత స్థలం ఉంది? ఒక వ్యక్తి స్వేచ్ఛను కోల్పోయిన సంవత్సరాలను తిరిగి ఎలా ఇవ్వగలం? ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా జీవితం ఇలాంటి అనేక ప్రశ్నలను మన ముందుంచింది.
2024 అక్టోబర్ 12న, 57 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. అంతకు కొద్ది నెలల ముందే, దాదాపు పదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం, బాంబే హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. తీవ్రమైన శారీరక వైకల్యంతో జీవించిన వ్యక్తి నుంచి విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, ఖైదీగా, రచయితగా ఆయన ప్రయాణం సాగింది. ఆ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే పరిశీలించడం కాదు. మన సమాజంలో వైకల్యం, సామాజిక అసమానత, అభివృద్ధి, రాజ్యాధికారం, న్యాయవ్యవస్థ, సాహిత్యం వంటి అనేక అంశాలను ఒకేసారి పరిశీలించడం.
ఒక చిన్న గ్రామం నుంచి దేశ రాజధానిలోని విశ్వవిద్యాలయ ప్రాంగణం వరకు సాగిన ఈ ప్రయాణం ఆయన వ్యక్తిగత పట్టుదలకు ఒక ఉదాహరణ. సాయిబాబా జీవితాన్ని ఆయన రాజకీయ, సామాజిక కార్యకలాపాల నుంచి వేరుచేసి చూడలేం. ఆయనకు శారీరక వైకల్యం చిన్నప్పటి నుంచే జీవితంలోని ప్రతి దశలో ఒక వాస్తవిక అడ్డంకిగా ఉంది. ఆయన జైలులో ఉన్న సమయంలో తన తల్లిని కోల్పోయారు. అభివృద్ధి పేరుతో జరిగే భూసేకరణ, ఖనిజ వనరుల వినియోగం, ఆదివాసీ ప్రాంతాల్లో నిర్వాసితత్వం, సాయుధ ఘర్షణ ప్రాంతాల్లో మానవ హక్కుల పరిస్థితులపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతులు పెరగడం మాత్రమే కాదు. ఆ అభివృద్ధి వల్ల ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు, భూమి, జీవనాధారాలను కోల్పోయే ప్రజల పరిస్థితి ఏమిటి అనే అంశాలు కూడా చర్చలో ఉండాలి.
2014, మే నెలలో సాయిబాబాను మావోయిస్టు సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అరెస్టు చేశారు. ఆయనపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) సహా పలు నిబంధనల కింద కేసులు నమోదయ్యాయి. 2017 మార్చిలో గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆ తరువాత ఆయన జీవితంలో దాదాపు ఏడేళ్లకు పైగా జైలులో గడిచింది. ఈ కాలంలో ఆయన కుటుంబం కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.
2024, మార్చి 7న సాయిబాబా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే న్యాయపరమైన విజయం వచ్చిన సమయానికి జీవితంలో ఒక పెద్ద భాగం అప్పటికే గడిచిపోయింది. న్యాయం ఆలస్యంగా వచ్చినప్పుడు... అది స్వేచ్ఛను తిరిగి ఇవ్వగలదు; కానీ గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి ఇవ్వలేదు. దాదాపు పదేళ్ల కాలం ఒక మనిషి జీవితంలో చిన్న వ్యవధి కాదు. సాయిబాబా జైలు నుంచి విడుదలైన ఏడు నెలలకే మరణించారు. సాయిబాబాను కేవలం ఒక రాజకీయ కార్యకర్తగా లేదా ఒక క్రిమినల్ కేసులో నిందితుడిగా మాత్రమే గుర్తించడం ఆయన మేధో జీవితాన్ని అసంపూర్ణంగా చూడటమే. ఆయన ప్రధానంగా ఒక ఆంగ్ల సాహిత్య అధ్యాపకుడు, పరిశోధకుడు, రచయిత. సాహిత్యం ఆయనకు కేవలం భాషా సౌందర్యం కాదు. అది సమాజాన్ని, చరిత్రను, అధికార సంబంధాలను, మనుషుల అనుభవాలను అర్థం చేసుకునే ఒక మార్గం. ఆయన రచనల్లో అణగారిన వర్గాల అనుభవాలు, నిర్వాసితత్వం, అభివృద్ధి నమూనాలు, సామాజిక అసమానత వంటి అంశాలు కూడా కనిపిస్తాయి.
సాయిబాబా జైలు నుంచి రాసిన కవితలు, ఉత్తరాలు తరువాత ‘‘Why Do You Fear My Way So Much? Poems and Letters from Prison’’ పేరుతో వెలువడ్డాయి. తెలుగులో వచ్చిన ‘‘నేను చావును నిరాకరిస్తున్నాను’’ అనే కవితా సంపుటి కూడా ఆయన జైలు అనుభవాల నుంచి వచ్చిన రచనలకు ప్రతీకగా నిలిచింది.
సాయిబాబా జీవితంలో సాహిత్యం ఒక వృత్తిపరమైన అంశం మాత్రమే కాదు; కుటుంబ సంబంధాల్లోనూ అది ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆయన కుమార్తె మంజీర కూడా ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించారు. సాయిబాబా జైలులో ఉన్నప్పటికీ, పుస్తకాల గురించి, సాహిత్యం గురించి, రచయితల గురించి కుమార్తెతో ఉత్తరాల ద్వారా చర్చించేవారు.
ఆయన జీవితంలో అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, అరెస్టు సమయంలో ఆయన గత రెండు దశాబ్దాలుగా సేకరించిన పరిశోధన సామగ్రి, కంప్యూటర్, పెన్‌డ్రైవ్‌లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పరిశోధనలోని ముఖ్యమైన భాగాన్ని తిరిగి పొందలేకపోయానని తరువాత ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాయిబాబా కేసులో ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ మాత్రమే కాదు, ఆయన మేధో జీవితంలోని ఒక ముఖ్యమైన భాగం కూడా దెబ్బతిన్నది. భౌతిక స్వేచ్ఛను కోల్పోయిన రచయిత తన అనుభవాలను భాషలోకి మార్చినప్పుడు, వ్యక్తిగత బాధ ఒక విస్తృతమైన మానవ అనుభవంగా మారుతుంది. సాయిబాబా రచనలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఇందుకే ఉంది. ఆయన రాజకీయ జీవితాన్ని దాటి, ఆ రచనలు భారతీయ జైలు సాహిత్యం, సామాజిక న్యాయం, మానవ స్వేచ్ఛ, నిర్బంధ అనుభవాలపై మన అవగాహనకు ఏమి జోడిస్తున్నాయో పరిశీలించాలి.
సాయిబాబాను స్మరించుకోవడం– ఒక వ్యక్తి స్వేచ్ఛను రాజ్యవ్యవస్థ ఎంతవరకు పరిమితం చేయగలదు, న్యాయం ఆలస్యమైనప్పుడు దాని మూల్యం ఏమిటి, జైలు గోడల మధ్య కూడా సాహిత్యం ఎలా పుడుతుంది అనే ప్రశ్నలను మరోసారి మన ముందుకు తెచ్చుకోవడం. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఒక్క సాయిబాబా జీవితంలో దొరకకపోవచ్చు. కానీ ఆయన జీవితం వాటిని తప్పించుకోకుండా ఎదుర్కొనేలా మనల్ని మాత్రం ఆహ్వానిస్తుంది.
పి. విక్టర్ విజయ్‌కుమార్
(రేపు ప్రొఫెసర్ సాయిబాబా వర్ధంతి)
ఇవీ చదవండి:
ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి
ఢిల్లీలో పరిస్థితి ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉంది: అరవింద్ కేజ్రీవాల్