Preserve Ayurveda: ఆయుర్వేదాన్నిపరిరక్షించుకుందాం
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:41 AM
భారతీయ సనాతన ధర్మంలో ఆయుర్వేదం కేవలం చికిత్సా విధానం కాదు. అది ప్రకృతితో మమేకమైన ఒక సమగ్ర జీవన శైలి. అనాదిగా ఋషులు, మునులు అందించిన ఈ అద్భుతమైన ఆరోగ్య జ్ఞాన సంపదను...
భారతీయ సనాతన ధర్మంలో ఆయుర్వేదం కేవలం చికిత్సా విధానం కాదు. అది ప్రకృతితో మమేకమైన ఒక సమగ్ర జీవన శైలి. అనాదిగా ఋషులు, మునులు అందించిన ఈ అద్భుతమైన ఆరోగ్య జ్ఞాన సంపదను, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నవారే మన ‘పరంపర వైద్యులు’ లేదా ‘అనువంశిక వైద్యులు’. కానీ, నేటి ఆధునిక వైద్యశాస్త్ర ఆర్భాటంలో, వేదాలకు పుట్టినిల్లు అయిన మన దేశంలోనే ఈ దేశీయ వైద్య నిపుణులు కనీస గుర్తింపునకు నోచుకోలేకపోవడం దురదృష్టకరం.
మన తెలుగు రాష్ట్రాలలో వేలాదిమంది నిష్ణాతులైన పరంపర వైద్యులున్నారు. పుస్తకాలకు ఎక్కని, ఆధునిక సైన్సుకు అందని ఎన్నో అరుదైన మూలికల రహస్యాలు, చికిత్సా విధానాలు వీరి వద్ద నిగూఢంగా ఉన్నాయి. వీరిని విస్మరించడం అంటే మన ప్రాచీన విజ్ఞానాన్ని మనమే చేజార్చుకోవడమే. ఈ జ్ఞానాన్ని మనం గ్రంథస్థం చేయకపోతే, విదేశీ సంస్థలు మన మూలికలపై పేటెంట్లు పొందే ప్రమాదం కూడా ఉంది.
అక్కడక్కడా జరిగే ఒకటి రెండు అశాస్త్రీయ ఘటనలను భూతద్దంలో చూపిస్తూ, మొత్తం పరంపర వ్యవస్థనే మూఢనమ్మకంగా కొట్టిపారేయడం సరికాదు. విపరీతమైన రసాయన ఔషధాల వాడకం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలు మన కళ్ళెదుటే ఉన్నాయి. పరంపర వైద్యం పూర్తిగా ప్రకృతి సిద్ధమైనది, దుష్ప్రభావాలు లేనిది. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా తక్కువ ఖర్చుతో కూడిన వైద్యం. దీనిలోని శాస్త్రీయతను ప్రభుత్వం గుర్తించాలి. ఆధునిక శాస్త్రవేత్తలు, పరంపర వైద్యులతో కలిసి పరిశోధనలు జరిపి, ఆ జ్ఞానాన్ని ధ్రువీకరించాలి.
జీవవైవిధ్యానికి వారసులు పరంపర వైద్యులు. వారు కేవలం చికిత్సకులు మాత్రమే కాదు, పర్యావరణ రక్షకులు కూడా. ఔషధాల కోసం అడవులపై ఆధారపడే వీరు, ఆ వనమూలికలను, అడవులను కన్నబిడ్డల్లా కాపాడుకుంటారు. వీరిని ప్రోత్సహించడం అంటే పరోక్షంగా పర్యావరణాన్ని రక్షించడమే. సంప్రదాయ వైద్య ప్రాముఖ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియాతో పాటు పలు ఆఫ్రికా దేశాలు తమ దేశీయ వైద్యానికి పెద్దపీట వేస్తున్నాయి.
ప్రపంచమంతా తమ సంప్రదాయ వైద్యాన్ని ఇంతలా గౌరవించుకుంటుంటే, ఆయుర్వేదానికి జన్మభూమి అయిన భారతదేశంలో పరంపర వైద్యులు గుర్తింపు కోసం పోరాడాల్సి రావడం బాధాకరం. ఈ అమూల్యమైన ఆయుర్వేద జ్ఞానం అంతరించిపోకముందే ప్రభుత్వాలు మేల్కోవాలి. నిస్వార్థంగా సేవ చేస్తున్న సంప్రదాయ పేద వైద్యులను ఆదుకోవాలి. పరంపర/ అనువంశిక వైద్యులను గుర్తించడానికి తక్షణమే ఒక ప్రక్రియను ప్రారంభించాలి. అవసరమైతే వారి నైపుణ్యాన్ని పరీక్షించడానికి ప్రామాణికమైన పద్ధతులను ప్రభుత్వం రూపొందించాలి. గతంలో ఉన్న ఆర్‌ఎంపీ వ్యవస్థ తరహాలో లేదా ఆయుష్ పరిధిలో వీరికి శిక్షణనిచ్చి, చట్టపరమైన అవగాహన కల్పించాలి. అధికారికంగా మెయిన్ స్ట్రీమ్ వైద్య విధానంతో అనుసంధానించాలి. ప్రతి జిల్లా లేదా మండల కేంద్రంలో పరంపర వైద్యశాలలను ప్రభుత్వమే ఏర్పాటు చేసి, నిష్ణాతులైన వైద్యులకు అవకాశం కల్పించాలి. వారి అనుభవానికి ఆధునిక సైన్స్‌ను జోడించి కొత్త ఆవిష్కరణలకు బాటలు వేయాలి.
సింహాచలం లక్ష్మణస్వామి
Also Read:
చలికాలం.. ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇదే
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!