ఈ పూలకి ముందే తెలుసు
ABN , Publish Date - May 04 , 2026 | 12:26 AM
అతి జుగుప్సాకరమగు ఇదే నేల మీద అతి సుందరమగు ఇదే నేలమీద ఎన్ని చితిమంటల్ని కలగంటే గానీ, ఎన్ని విధ్వంసాలను ఊహిస్తే గానీ...
అతి జుగుప్సాకరమగు ఇదే నేల మీద
అతి సుందరమగు ఇదే నేలమీద
ఎన్ని చితిమంటల్ని కలగంటే గానీ, ఎన్ని విధ్వంసాలను ఊహిస్తే గానీ
ఈ పూలు ఇంత త్వరగా నేల రాలగలవు
ఈ పూలకు ముందే తెలుసు
నిన్నలా ఈ నది కనపడదని
ఎగువన యుద్ధాలు జరిగే దేశాల రక్తాన్ని
కలుపుకొని ఎర్రగా ప్రవహిస్తుందని
కమ్మిన కారు పొగలతో అసహ్యంగా మబ్బులు
ఆకాశానికి గూళ్లు కడతాయని
నిప్పు శకలాలు తగిలి తెగిన కాళ్లతో పక్షులు ఎగురుతాయని
మిస్సైళ్లు ముద్దాడిన పసికందుల ఆర్తనాదాలతో
గాలి ఘోష పెడుతుందని
భస్మీపటలమగు సౌధాల శిథిలాల కింద కుప్పల కుప్పల
శవాలతో భవనాలన్నీ మహాసమాధులై కనిపిస్తాయని
గాయాలై మిగిలిన క్షతగాత్రుల అనాథ శోకాలు
ఈ పూలకి ముందే తెలుసు
యుద్ధమొక దీర్ఘ దుఃఖం – రక్తం దాని దాహం
విస్ఫోటనమొకటే గానీ దాని విధ్వంసం విస్తరిస్తుంది
కాలాలను కాల్చి రుధిర ఋతువొకటే పరిమళిస్తుంది
రాత్రి, పగళ్ళను ఆ కార్చిచ్చు ఆక్రమిస్తుంది
ఈ రక్తపు కల్లాపి ఏ శాంతి కాంతుల్ని అలకగలదు వినాశనాన్ని తప్ప
యుద్ధాదినేతలంతా
భవిష్యత్తు శ్మశానాలుగా మిగిలిపోయే మహానగరాలకి
కాపలా కుక్కలుగా మిగిలిపోతారు
దహనం కాబోయే ఆధునిక మానవ చరితకంతా
అణుబాంబుదే సాక్షీ సంతకం
ఈ పూలకి అన్నీ ముందే తెలుసు
దానికే కాబోలు త్వరగా రాలిపోవడం – మౌన నిరసన
అని అనుకోవచ్చు
కానీ నేను మీలా రాలిపోలేను
వెంకటేష్ పువ్వాడ
7204709732
ఇవి కూడా చదవండి..
కౌంటింగ్ వేళ.. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళం సీఎం
ఓట్ల లెక్కింపు రోజున అవాంతరాలకు బీజేపీ పథకం... ఈసీకి డీఎంకే లేఖ