నక్షత్రాల పూల తోట
ABN , Publish Date - May 25 , 2026 | 01:06 AM
పూల తోటలు నాటి, వృద్ధులైన కొందరు పొద్దువాలే వేళ, సజల నేత్రాల, వణికే చేతులతో నేల రాలిన, వాడిన పూలను ఏరుతూ లోకానికి వాటి పేర్లు...
పూల తోటలు నాటి, వృద్ధులైన కొందరు
పొద్దువాలే వేళ, సజల నేత్రాల, వణికే చేతులతో
నేల రాలిన, వాడిన పూలను ఏరుతూ
లోకానికి వాటి పేర్లు చెబుతున్నారు
ఆ పూలు కొన్ని మొగ్గలుగా ఉన్నవి
రెక్కలు విరిగి మరణించినవి
సంపూర్ణంగా విప్పారి జీవించినవి
మరికొన్ని అకాలంగా చంపబడ్డవి
పూల విత్తనాలను, పేర్లను భద్రపరిచేందుకు
తాపత్రేయపడే ఆ వృద్ధులను అడిగాను
మీ అనంతరం ఈ పూల పేర్లను
నిజంగా లోకం గుర్తు పెట్టుకుంటుందా?
పూల విత్తనాలకు నిజంగా
మరో జన్మంటూ ఉంటుందా?
మేఘాలు రాల్చే ఆనంద భాష్పాలతోనే
పూల తోటలు వికసిస్తాయా?
అసంఖ్యాక నక్షత్రాల్లో కొన్నే
జాజ్వల్యమానంగా ఎందుకు
వెలుగుతాయి? నేలపై నక్షత్రాల
పూల తోటలు పునర్జన్మిస్తాయా?
వృద్ధులు నాకు దయగా చెప్పారు
వాళ్ళ నమ్మమైన, దృఢమైన వాక్యాలకు
నేల రాలిన పూలు పక్షులై ఎగిరి
ఆకాశంలో మెరిసే నక్షత్రాలయ్యాయి
నాకు పూల రహస్యాల్ని చెప్పిన
ఆ వృద్ధులు కూడా రేపు మరణిస్తారు
ఇహ వాళ్ళలా పూల తోటలు నాటేవారు
వెనువెంటే ఎవరూ లేకపోవచ్చు
ఎవరూ లేని, పలుకని వేళలలోనూ
పక్షులు, సీతాకోక చిలుకలు, తుఫాను గాలులు,
నదులు విత్తనాలను మోసుకు వెళ్లి
తోటలను ఎలా సృష్టిస్తాయో తెలుసు నాకు
నేను నా కన్నీళ్ళు తుడుచుకుని
పూలు రాలిన ఆ దారులలో, తోటలలో
నా కవిత్వ నక్షత్ర ధూళిని చల్లుతూ వెడతాను
నా పద్యాలు పూలకు సుగంధాలను అద్దుతాయి
విమల
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో అరుదైన ఫీట్.. కోహ్లీ, సెహ్వాగ్ సరసన శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. పంజాబ్ ఓపెనర్ అరుదైన ఘనత