Share News

రాజకీయ కథనాల తీరు మారాలి

ABN , Publish Date - Jul 24 , 2026 | 01:35 AM

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత గొప్పదో, ఓటు వేయడానికి వెళ్లే ముందు ప్రజలు ఏ అంశం గురించి ఆలోచిస్తారన్నది కూడా అంతే గొప్ప విషయం. ఎన్నికలప్పుడు ప్రజల మనస్సుల్లో ఏ ప్రశ్నను ప్రధాన సమస్యగా...

రాజకీయ కథనాల తీరు మారాలి

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత గొప్పదో, ఓటు వేయడానికి వెళ్లే ముందు ప్రజలు ఏ అంశం గురించి ఆలోచిస్తారన్నది కూడా అంతే గొప్ప విషయం. ఎన్నికలప్పుడు ప్రజల మనస్సుల్లో ఏ ప్రశ్నను ప్రధాన సమస్యగా నిలబెట్టగలిగారన్న దానిపైన విజయం లభిస్తుంది. రాజకీయ శాస్త్రంలో దీనినే ‘రాజకీయ కథనం’ అంటారు. ఇది ఓటర్‌ను నవ్విస్తుంది, కోపం తెప్పిస్తుంది, భావోద్వేగానికి గురిచేస్తుంది. చివరకు అతని ఓటు ఎటు పడాలో కూడా అదే ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రజాస్వామ్యంలో అసలు పోటీ పార్టీల మధ్య కంటే, కథనాల మధ్యనే ఎక్కువగా జరుగుతుంది.

గత మూడు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఈ వాస్తవం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఎన్నికకు ఒక కొత్త కథనం తయారైంది. 1990లలో హైటెక్, సంస్కరణలు, ఐటీ విప్లవం ప్రధాన రాజకీయ చర్చగా నిలిచాయి. 2004 తర్వాత జలయజ్ఞం, రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్ వంటి అంశాలు ప్రజల ఆలోచనలను ఆక్రమించాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు–నిధులు–నియామకాలు, ఆత్మగౌరవం, ప్రత్యేక రాష్ట్రం అనే నినాదాలు కోట్లాది మందిని కదిలించాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి, ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థ రాజకీయ చర్చకు కేంద్రబిందువయ్యాయి. తెలంగాణలో కాళేశ్వరం, రైతుబంధు, హైడ్రా, ఫోన్ ట్యాపింగ్, పార్టీల మధ్య వ్యక్తిగత ఘర్షణలు ప్రధాన కథనాలుగా మారాయి. ఈ కథనాలన్నింటిలోనూ కొంత ప్రజా ప్రయోజనం ఉంది. కానీ కాలక్రమేణా విధానాలపై జరిగే రాజకీయ చర్చ క్రమంగా వ్యక్తుల చుట్టూ తిరిగే రాజకీయంగా మారిపోయింది.

టెలివిజన్ చర్చలు, సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ వీడియోలు చూస్తే ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎవరిని తిట్టారు లేదా అవమానించారు తదితర అంశాలే రోజులు, వారాలు, నెలల తరబడి ప్రజల ముందుంటాయి. సోషల్ మీడియా సైన్యాలతో పార్టీలు రాజకీయ యుద్ధాలు చేస్తున్నాయి. ప్రజలను అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టిస్తున్నాయి.


ఈ రాజకీయ కోలాహలం మధ్య కొన్ని ప్రశ్నలు మాత్రం ఎప్పుడూ బయటే నిలబడిపోతాయి. బీసీ రక్షణ చట్టం ఎందుకు రాలేదు? స్థానిక సంస్థల్లో బీసీలు, బీసీ ముస్లింలకు 34 శాతం లేదా 42 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు కాలేదు? దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఎప్పుడు లభిస్తుంది? రెండో విడత కులగణనలో ప్రత్యేక కుల కోడ్‌లు ఎందుకు ఇవ్వడం లేదు? ఆదివాసీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ఎక్కడ ఉంది? పోలవరం నిర్వాసిత ఆదివాసీలకు సాగునీటి భూమి ఎందుకు ఇవ్వడం లేదు? ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి విద్య, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం ఎందుకు అందుబాటులోకి రావడం లేదు? విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తు ఏమిటి? అన్నింటికంటే ముఖ్యంగా శాసనసభల్లో, మంత్రివర్గాల్లో, పాలనా వ్యవస్థలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులకు వారి జనాభాకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఉందా అనే ప్రశ్న ఎన్నికల ప్రధాన చర్చగా ఎందుకు మారడం లేదు?

ఇక్కడే రాజకీయ కథనం అసలు స్వరూపం అర్థమవుతుంది. రాజకీయాల్లో బలమైన పార్టీలు, వాటి ప్రచార వ్యవస్థలు, మీడియా నిర్వహణ, సోషల్ మీడియా సేనలు కలిసి ప్రజల దృష్టి ఏ అంశాలపై నిలవాలో నిర్ణయిస్తాయి. ఇది ప్రజాస్వామ్యంలో కొంతవరకు సహజమే. అయితే తెలుగు రాష్ట్రాల్లో మరో ప్రత్యేకత కనిపిస్తుంది. దశాబ్దాలుగా అధికార రాజకీయాలను ప్రధానంగా ఆధిపత్య సామాజిక వర్గాలకు చెందిన నాయకత్వమే ప్రభావితం చేస్తోంది. ఫలితంగా ఎన్నికల కథనాలు కూడా వారి రాజకీయ ప్రాధాన్యాలకు అనుగుణంగానే రూపుదిద్దుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రజల దృష్టి వ్యక్తిగత ఘర్షణలు, భావోద్వేగ అంశాలు, కక్షపూరిత వివాదాలపై నిలిచినంతకాలం సామాజిక న్యాయం, రాజకీయ వాటా, అధికార భాగస్వామ్యం, రాజ్యాంగ హక్కులు వంటి మౌలిక ప్రశ్నలు ప్రజా చర్చకు దూరంగా వెళ్లిపోతాయి. దీనివల్ల ఇప్పటికీ రాజకీయంగా బలమైన శక్తులకు అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఇంకా ఎదురుచూస్తున్న సామాజిక వర్గాల సమస్యలు ఎన్నికల అజెండాలోకి రావు.

తెలుగు రాష్ట్రాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు ఎన్నికల్లో అత్యంత చురుకుగా పాల్గొంటారు. సభలు నింపేది, పార్టీ జెండాలు మోసేది, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేది, ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది కూడా వారే. కానీ నిర్ణయాలు తీసుకునే వేదికలపై వారి భాగస్వామ్యం ఎంత అన్న ప్రశ్న మాత్రం పెద్దగా వినిపించదు. ఇదే ప్రాతినిధ్య లోటు.


అందుకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారాల్సింది కేవలం ప్రభుత్వం కాదు, రాజకీయ కథనం కూడా. ప్రజలు అడిగే ప్రశ్నలు మారాలి. ‘ఎవరు గెలుస్తారు?’ అనే ప్రశ్నతో పాటు ‘‘బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రిస్టియన్లు పాలనలో భాగస్వాములు అవుతున్నారా?’’ అనే ప్రశ్న కూడా ఎన్నికల కేంద్రబిందువుగా మారాలి. బీసీ రక్షణ చట్టం, స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధమైన బీసీ రిజర్వేషన్లు, కులగణన పూర్తి స్థాయిలో అమలు, దళిత క్రైస్తవులకు న్యాయం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పోలవరం నిర్వాసితులకు గౌరవప్రదమైన పునరావాసం, ప్రభుత్వ విద్యా–వైద్య వ్యవస్థల బలోపేతం వంటివి ఎన్నికల ప్ర‌ధాన చర్చగా మారాలి. అలాగే ప్రజారంగ సంస్థల పరిరక్షణ, శాసనసభలు, మంత్రివర్గాలు, పాలనా వ్యవస్థల్లో సముచిత సామాజిక ప్రాతినిధ్యం, రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం వంటివి కూడా ప్రధాన చర్చగా మారినప్పుడే ప్రజాస్వామ్యం మరింత అర్థవంతమవుతుంది.

డా. జె. పూర్ణచంద్రరావు

నేషనల్ కోఆర్డినేటర్, ఆల్ ఇండియా బీఎస్పీ

ఈ వార్తలనూ చదవండి:

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

Updated Date - Jul 24 , 2026 | 01:35 AM