Share News

ప్రజాఫర్మానాకు ఫిరాయింపుల తూట్లు

ABN , Publish Date - Jul 17 , 2026 | 03:05 AM

ప్రజాస్వామ్యానికి మూలం ప్రజల తీర్పు. అంటే జనాదేశం. ప్రజల ప్రతినిధిగా స్థానిక సంస్థలకో, శాసనసభకో, పార్లమెంటుకో ఎన్నికయ్యేవారు ఈ జనాదేశాన్ని అనుసరించి నడుచుకోవాలి. అందుచేత పార్టీ ఫిరాయించడమనేది...

ప్రజాఫర్మానాకు ఫిరాయింపుల తూట్లు

ప్రజాస్వామ్యానికి మూలం ప్రజల తీర్పు. అంటే జనాదేశం. ప్రజల ప్రతినిధిగా స్థానిక సంస్థలకో, శాసనసభకో, పార్లమెంటుకో ఎన్నికయ్యేవారు ఈ జనాదేశాన్ని అనుసరించి నడుచుకోవాలి. అందుచేత పార్టీ ఫిరాయించడమనేది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమే. అధికారం చేజిక్కించుకోవడానికి ఫిరాయింపులను ఆశ్రయించడం, మూడింట రెండొంతుల బలంతో చీలికలు తెచ్చి పబ్బం గడుపుకోవడం.. ఫిరాయింపుల నిరోధక చట్టం ఆశయాన్ని నీరుగారుస్తున్నవి. ఫిరాయింపుల చట్టానికి ఎన్ని సవరణలు చేసినా ఈ రాజకీయ అవినీతి బుల్డోజర్‌ను అడ్డుకోలేకపోతున్నాయి. కేంద్ర పాలకపక్షం స్వహస్తాలతో ఈ ఘాతుకానికి పాల్పడుతుండడాన్ని చూసి ప్రజాస్వామ్యం ముక్కున వేలేసుకుంటున్నది.

తగిన మెజారిటీ లేక ఇటీవల వీగిపోయిన డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ సంయుక్త రాజ్యాంగ సవరణ బిల్లు స్థానంలో మళ్లీ అదే బిల్లును ప్రవేశపెట్టి ఈసారి నెగ్గించుకోవడానికి కేంద్రంలోని ఎన్డీఏ పాలకులు తృణమూల్ కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్)లో చీలికలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల లోక్‌సభలో ఎన్డీఏ బలం పెరిగింది. కానీ రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గడానికి అవసరమైనంతగా అది పెరగలేదు. అయినా ప్రలోభాల ఎరవేసి ప్రతిపక్షంలో చీలికలు తేవడంలో తమకున్న నేర్పు మీద భరోసాతో ఎన్డీఏ పాలకులు ఈ రాజ్యాంగ సవరణ బిల్లును మరోసారి ముందుకు తోయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది.

లోక్‌సభలో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం స్థానాల రిజర్వేషన్‌ను అమల్లోకి తేవడం కోసం ‘నారీశక్తి వందన్ అధినియం’ పేరిట 2023లో 106వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారు. అయితే 2027 తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో దీనిని ముడిపెట్టారు. ఇందువల్ల చట్టసభల్లో మహిళల కోటా దాదాపు 2034 వరకు అమలుకు నోచుకోని పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు తమ రాజకీయ అవసరాల కోసం 2011 జనగణన ప్రాతిపదికగా డీలిమిటేషన్(నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ) చేపట్టి లోక్‌సభ నియోజకవర్గాలను సగం పెంచాలని, అదే పనిగా మహిళలకు చట్టసభల్లో 33శాతం కోటాను అమల్లోకి తేవాలని సంకల్పించి సంయుక్త రాజ్యాంగ సవరణ బిల్లును ఉద్దేశించారు.


చట్టసభల బలాన్ని పెంచడం కోసం జరపవలసిన సీట్ల పెంపు వ్యవహారం చుట్టూ అత్యంత వివాదం అల్లుకున్న సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల జనాభా ప్రకారం జరగవలసిన ఈ ప్రక్రియ వల్ల కుటుంబ నియంత్రణను కచ్చితంగా పాటించి జనాభా పెరుగుదలను పరిమితం చేసుకొని, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ పెంపులో తక్కువ సీట్లు పొందుతాయి. మరోపక్క జనాభా నియంత్రణలో, అభివృద్ధిలో బాగా వెనుకబడి ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు లభిస్తాయి. ఫలితంగా దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. అందుచేత జనాభా ప్రాతిపదికగా సీట్ల పెంపును దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలలో నియోజకవర్గాలను 50శాతం పెంచే చిట్కాను అమల్లోకి తెచ్చి ఈ వివాదం నుంచి బయటపడాలని కేంద్రంలోని ఎన్డీఏ పాలకులు ఆశిస్తున్నారు. మహిళల రిజర్వేషన్లను ముందుకు జరిపించి డీలిమిటేషన్‌కు జత చేయడం ద్వారా ప్రతిపక్షాన్ని కట్టడి చేయాలన్న ఉపాయాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే మహిళా వ్యతిరేకులుగా ముద్ర పడుతుందని విపక్షాలు భయపడతాయని పాలకపక్షం ఈ ఎత్తు వేసింది. విడిగా మహిళల రిజర్వేషన్ చట్టాన్ని అమలులోకి తెస్తే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేస్తూ సమైక్య ప్రతిపక్షం సంయుక్త రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించిన అపూర్వ అమోఘ సన్నివేశాన్ని గత ఏప్రిల్ 17న పార్లమెంట్‌లో చూడగలిగాం. ప్రతిపక్షం అపూర్వమైన ఐక్యతను ప్రదర్శించింది. ఇది ప్రధాని మోదీని అమితంగా కలచివేసిందని అంటున్నారు. అందుచేత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును మళ్లీ తెచ్చి నెగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసమే అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు శివసేనలో చీలికలు తీసుకొచ్చారు. దీనివల్ల లోక్‌సభలో ఎన్డీఏ బలం 25 స్థానాలు పెరిగి 313కి చేరింది. అయినప్పటికీ రాజ్యాంగ సవరణకు కావలసిన మూడింట రెండొంతులకు (362) ఇంకా తక్కువే. కాబట్టి ప్రతిపక్షాలను మరిన్ని ప్రలోభాలతో మరింతగా చీల్చి బిల్లును నెగ్గించుకోవడానికి ఎన్డీఏ పాలకులు వెనుకాడకపోవచ్చు. ఇది ప్రతిపక్ష ఐక్యతకు పెను సవాలే!

పాలకపక్షం అధికారం అండతో తెచ్చే ఇటువంటి చీలికలు ప్రజాస్వామ్య పునాది అయిన జనాదేశానికి తూట్లు పొడిచి ప్రజాప్రాతినిధ్య పరమార్థానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. అందుచేత ఎన్నికల్లో ఏ పార్టీ ద్వారా నెగ్గారో అదే పార్టీలో చివరివరకూ కొనసాగవలసిన విధ్యుక్త ధర్మాన్ని విధిగా పాటించేలా తగిన చట్టాన్ని తీసుకురావాలి.

గార శ్రీరామమూర్తి

(సీనియర్‌ జర్నలిస్ట్‌)

ఈ వార్తలనూ చదవండి:

వెనక్కి తగ్గిన మెటా.. ఇన్‌స్టాగ్రామ్‌లో వివాదాస్పద ఏఐ ఫీచర్ తొలగింపు..

మరో ఏఐ మోడల్‌‌ను లాంచ్ చేసిన స్పేస్ఎక్స్ఏఐ

Updated Date - Jul 17 , 2026 | 03:05 AM