Share News

అవినీతి నేతలపై తిరగబడాలి

ABN , Publish Date - Jun 26 , 2026 | 02:17 AM

ఇదివరకు రాజకీయ నాయకులు అందరికీ అందుబాటులో ఉండేవారు. అవినీతి చాలా తక్కువ స్థాయిలో ఉండేది. ఏ కాంట్రాక్టరో కలవాలంటే రహస్యంగా కలిసేవారు. ఇప్పుడు పద్ధతులు మారిపోయాయి,...

అవినీతి నేతలపై తిరగబడాలి

ఇదివరకు రాజకీయ నాయకులు అందరికీ అందుబాటులో ఉండేవారు. అవినీతి చాలా తక్కువ స్థాయిలో ఉండేది. ఏ కాంట్రాక్టరో కలవాలంటే రహస్యంగా కలిసేవారు. ఇప్పుడు పద్ధతులు మారిపోయాయి, అంతా బహిరంగమే. రాజకీయ నాయకులే నేడు కాంట్రాక్టర్లు, లేదా కాంట్రాక్టర్లే రాజకీయ నాయకులుగా మారుతున్నారు. సరైన చదువు అవసరం లేదు. ఏ ఉద్యోగమూ, వ్యాపారమూ చేయకుండా వందల, వేల కోట్ల సంపాదనపరులు కావడం మన దేశంలోనే సాధ్యం.

వేల కోట్ల ప్రాజెక్ట్‌లు, వందల కోట్ల అవినీతి మన కళ్ల ముందే జరుగుతున్నా పట్టించుకోలేని దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. అవినీతికి పాల్పడిన పార్టీ ఓడిపోయి ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చినా మార్పు ఏమీ లేదు. నువ్వు అవినీతిపరుడువంటే, మీ అవినీతి ముందు మాదెంత అని సవాళ్లు విసురుకుంటారే తప్ప, మేము అవినీతి చేయబోమని చెప్పే పరిస్థితి లేకపోవడం శోచనీయం. ఒక్కసారి మంత్రి కాగానే నాయకుల పద్ధతి మారిపోతున్నది. కోట్ల ఖరీదు చేసే కార్లు, ఎస్కార్టు వాహనాలు, సెక్యూరిటీ సిబ్బంది... అవసరమా ఇవన్నీ? ప్రజలను కలవరు. ఇంటి ముందు సెక్యూరిటీ, ఆఫీసు ముందు సెక్యూరిటీ. ఇంత పిరికివాళ్లకెందుకు ఈ మంత్రి పదవులు? ఎవరి ఖర్చుతో ఈ సెక్యూరిటీ, ఈ హడావిడి? లక్ష చదరపు అడుగుల ఇల్లు ముఖ్యమంత్రి తన కోసం కట్టించుకున్నాడంటే, ప్రజలు అడుగుతారనే భయం లేకుండా పోయింది!

యథా రాజా తథా ఆఫీసర్‌గా మారిపోయారు అధికారులు. ఇదివరకు ప్రభుత్వంలో అవినీతిపరులైన అధికారులు ఎవరైనా ఉంటే, వారికి ప్రాధాన్యం లేని పోస్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు వారి అనుభవాన్ని నాయకులు వాడుకుంటున్నారు. ప్రజల సొమ్మును దోపిడీ చేయటం, వాటాలు కుదరకనో, వేరేవారు పోటీపడటం వల్లనో అవినీతి సంగతి బయటపడితే ఎదుటివారి మీద దాడి చేయటం, దబాయించటం మామూలు అయింది. కానీ ప్రజలేం చేస్తున్నారు... చూస్తూ ఊరుకుంటున్నారు. మనమేం చేయగలమనేది వారి భావన. మనం ఓటు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు, మనకు అందుబాటులో లేకుండా అవినీతిపరులైతే మనకు అడిగే అధికారం లేదా? పేద ప్రజలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పే వారి ప్రకటనలోనే ఉన్నది వారి ఆలోచనా విధానం... మేము వేరు, పేద ప్రజలు వేరనేది వారి ఉద్దేశం.


మన దేశం అభివృద్ధి చెందకుండా ఆపే దుష్టశక్తులు ఈ అవినీతి నాయకులు. ఇదివరకు ఎక్కడో ఒక్క దగ్గర కొద్దిగా అవినీతి చేసే వీరు, ఇప్పుడు ఎక్కడో ఒక్క పనిని అవినీతి లేకుండా చేసి అది తమ ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు. వీరి అవినీతి భరించలేని స్థాయికి చేరింది. ఎన్నో దేశాలలో యువత ‘జెన్ జీ’ పేరుతో ఉద్యమాలు చేస్తున్నారు. మన యువతకు ఇది పట్టకపోయినా సీనియర్‌ జనరేషన్‌ (సెన్‌ జీ)ను చూసి ఊరుకోలేక బాధ పడుతున్నారు. ఇతర దేశాల్లో వలె ఇక్కడ కూడా యువత తిరగబడితే ఈ అవినీతి అంతమవుతుంది.

జమలాపురపు శ్రీనివాస్

ఈ వార్తలనూ చదవండి:

పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీ విచారం

వెలుగులోకి సంచలన విషయాలు.. హత్య ఎలా చేయాలో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి..

Updated Date - Jun 26 , 2026 | 02:17 AM