Share News

పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ఎన్నికలు వాయిదా వేయాలి!

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:36 AM

వాళ్లు తరతరాలుగా జీవించిన భూమిని, అడవిని, గలగల పారే గోదావరిని కోల్పోయారు. చివరికి వారి నివాసపు గుర్తింపును నిర్ణయించే పంచాయతీలను కూడా...

పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ఎన్నికలు వాయిదా వేయాలి!

వాళ్లు తరతరాలుగా జీవించిన భూమిని, అడవిని, గలగల పారే గోదావరిని కోల్పోయారు. చివరికి వారి నివాసపు గుర్తింపును నిర్ణయించే పంచాయతీలను కూడా కోల్పోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో పంచాయతీ స్వపరిపాలన ఒక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఐదో షెడ్యూల్, పెసా చట్టం కల్పించిన ప్రత్యేక హక్కులు, పునరావాస కాలనీలకు చేరకుండా ఆదివాసీలను వెక్కిరిస్తున్నాయి.

దేవీపట్నం మండలంలోని 13,741 మంది గిరిజన, గిరిజనేతర ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన ఆరు పంచాయతీలు పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల ఇప్పుడు ఉనికిలో లేవు. ఆ పంచాయతీలు వాటి సరిహద్దులన్నీ కొన్ని గోదావరిలో పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా మునిగాయి. ప్రభుత్వాల నిర్వాకాల ఫలితంగా సమగ్ర పునరావాసాన్ని, గ్రామం ఒక యూనిట్‌గా పూర్తి పునరావాసాన్ని ఆ ప్రజలు పొందలేకపోయారు. ప్రతి పంచాయతీ అనేక ముక్కలుగా మారి నిర్వాసితులందరూ చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు పోయారు. సంఘాలుండి, సంఘటిత నిర్మాణాలు ఉన్న చోట తమ ఉనికిని, అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి పెనుగులాడుతున్నారు. అలాంటి పెనుగులాటలో పూర్వపు దేవీపట్నం మండలానికి చెందిన కొండమొదలు ప్రజానీకం ఉన్నారు.

2022లో మెజారిటీ ఆదివాసీ ప్రజానీకం, తమ జీవనాధారానికి అనువైన చోటుగా గంగవరం మండలంలోని నేలదోనెలపాడు గ్రామ పరిసరాలను పునరావాస ప్రాంతంగా ఎంచుకున్నారు. 2022 ఏప్రిల్ 19న కలెక్టర్‌ను, ఆఫీసర్లను ఆహ్వానించి కొత్త కాలనీలోకి ప్రవేశించారు. అప్పటి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్‌ను ఏజెన్సీ పునరావాస కాలనీలను ప్రత్యేక పంచాయతీలుగా చేయాలని, పాత గ్రామాల నుంచి డీ నోటిఫై చేసి కొత్త పంచాయతీలను ఏర్పరచాలని కోరారు. అప్పటికి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 63 ప్రాతిపదికన... కనీసం 500 మంది ఆదివాసీ ఓటర్లు ఉండి, పంచాయతీ కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరం ఉన్న గిరిజన గూడేలను, పునరావాస కాలనీలను ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించాలని అధికారులను డిమాండ్ చేశారు. దేవీపట్నం మండలంలోని ఆరు గిరిజన, గిరిజనేతర పంచాయతీల పునర్వ్యవస్థీకరణ కోసం రంపచోడవరం పంచాయతీ అధికారి వివరమైన నివేదికను సమర్పించారు. ప్రభుత్వం కూడా పంచాయతీల డీ నోటిఫికేషన్ కోసం ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇంతలో ఏం జరిగిందో ఆ ఆదేశాలు ఉపసంహరించుకున్నారు. దీంతో నిర్వాసిత ప్రజలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.


పూర్వపు పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం మండలం నిర్వాసిత గ్రామాలు కూడా ఇదే విధంగా ప్రతి గ్రామం మూడు నాలుగు చోట్ల– కొన్ని పోలవరం మండలంలో, కొన్ని బుట్టాయిగూడెం మండలంలో, కొన్ని జీలుగుమిల్లి మండలంలో పునరావాసాన్ని పొందాయి. స్థానిక నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల్లో నిర్వాసిత కాలనీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వీటన్నిటినీ పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో మునిగిపోయింది. కొత్త ఓటర్ లిస్ట్ ఆధారంగా ఎన్నికలు జరుపుతామని ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. ఇప్పుడు ఉనికిలో లేని పంచాయతీలకు ఎన్నికలు ఎక్కడ నిర్వహిస్తారు? ఈ నిర్వాసితులందరినీ ఏదో ఒక పంచాయతీలో కలపటం ద్వారా అక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు పాత– కొత్తల మధ్య గందరగోళాలు పడుతున్నారు. ఇప్పటికే స్థిరపడిన గ్రామాల్లోని తమ వార్డుల్లో లేదా పంచాయతీల్లో నాయకత్వం వహించే అవకాశం కోల్పోతామని భయపడుతూ కొత్తగా వచ్చిన నిర్వాసితులను అనుమానంగా, విద్వేషంతో చూసే ప్రమాదం ఉంది. పుట్టిన మట్టిని, నదిని, జీవన మూలాలను కోల్పోయిన ప్రజలకు పంచాయతీ పాలన కూడా దూరమవడం అంటే వారి ప్రజాస్వామిక ఉనికినే దెబ్బతీయడం.

గతంలో సాగించిన ఆందోళనలో భాగంగా ఎన్నికలు ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల 12న ఏజెన్సీ గిరిజన సంఘం నాయకత్వాన వందలాది మందితో రంపచోడవరంలో ధర్నా నిర్వహించి, పునరావాస కాలనీలను ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించే వరకు ఎన్నికలు నిర్వహించరాదని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఉంచిన నిషేధాన్ని ఎత్తివేసి పోలవరం, ఏలూరు జిల్లా ఆదివాసీ ప్రాంతాల పంచాయతీల హద్దులను డీ నోటిఫై చేసి, కొత్త పంచాయతీలను పునర్వ్యవస్థీకరించి కొత్త, పాత గ్రామాలన్నీ సామరస్యంతో జీవించే స్థితిని నెలకొల్పాలి. గిరిజన సంఘం డిమాండ్ చేసినట్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాల్లో ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన గిరిజనులు సాగిస్తున్న న్యాయమైన పోరాటానికి రైతు సంఘాలు, పౌర హక్కుల సంఘాలు సంఘీభావం ప్రకటించాలి.

సింహాద్రి ఝాన్సీ

రాష్ట్ర అధ్యక్షులు, రైతు కూలీ సంఘం

ఈ వార్తలు కూడా చదవండి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!

ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు

Updated Date - Oct 30 , 2026 | 04:36 AM