పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభలు
ABN , Publish Date - May 23 , 2026 | 03:01 AM
శ్రామికవర్గ మహిళా విముక్తే లక్ష్యంగా స్త్రీ–పురుష సమానత్వం కోసం పనిచేస్తున్నది ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ). ఈ సంఘం పుట్టుక, పెరుగుదల యాదృచ్ఛికంగా జరుగలేదు. ఐదు దశాబ్దాల...
శ్రామికవర్గ మహిళా విముక్తే లక్ష్యంగా స్త్రీ–పురుష సమానత్వం కోసం పనిచేస్తున్నది ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ). ఈ సంఘం పుట్టుక, పెరుగుదల యాదృచ్ఛికంగా జరుగలేదు. ఐదు దశాబ్దాల క్రితమే పీవోడబ్ల్యూ హైదరాబాద్‌లో పురుడుపోసుకుంది. 1970 దశకానికి ముందు కొంత కృషి జరిగినా, 1974లో ఉస్మానియా యూనివర్సిటీలో అభ్యుదయ మహిళా సంఘంగా పీవోడబ్ల్యూ ప్రస్థానం మొదలైంది. ఆనాటి నుంచి మెట్టుమెట్టుగా ఎదిగి పునాదివర్ణ మహిళలను కూడగట్టి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేపట్టి దేశవ్యాప్త గుర్తింపు పొందింది. పీవోడబ్ల్యూ ప్రయాణం పూలబాటలా సాగలేదు. 1976లో విధించిన అత్యవసర పరిస్థితి చీకటి కాలంలో ఎన్‌కౌంటర్లు, జైళ్ళు, నిర్బంధం, అణచివేతలను ఎదుర్కొన్నది. భూస్వాముల, గుండాల దాడులకు గురయ్యింది. రాజ్యహింసను భరించింది. ఈ క్రమంలో చింతాలక్ష్మి, సుశేనా, శాంతక్క, రాధ లాంటి అనేక మంది వీరవనితలను సంఘం కోల్పోయింది.
మహత్తర తెలంగాణ, వీరోచిత శ్రీకాకుళ సాయుధ పోరాటాన్ని, గోదావరిలోయ ప్రతిఘటనా పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తన గమ్యాన్ని సాధించడానికి పట్టుదలగా కృషి చేస్తున్నది. నాటి నుంచి నేటి వరకు పోరాటాలే ప్రాణంగా, ఉద్యమాలే ఊపిరిగా ఉద్యమాల కర్తవ్యాలను తన భుజస్కంధాలపై వేసుకొని రాష్ట్రంలో పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పీవోడబ్ల్యూ 12 జిల్లాల్లో బలమైన నిర్మాణం, సంబంధాలు కలిగివుంది. నేటి స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమబాటను ఎంచుకొంది.
స్త్రీలకు ఉపాధి భద్రత, ఆహార భద్రత, నివాస హక్కులు, భూమిహక్కులు కావాలని పీవోడబ్ల్యూ పోరాడుతోంది. రేషన్ కార్డులు, ఫించన్లు లాంటి సంక్షేమ పథకాలు అమలయ్యేలా పోరాడింది. కుటుంబాలను గుల్లచేసే మద్యాన్ని నిషేధించాలని ఉద్యమించింది. స్త్రీలపై నిత్యం జరిగే లైంగిక వేధింపులకు, గృహహింసకు వ్యతిరేకంగా పోరాడింది. సమాన పనికి సమాన వేతనం కావాలని ఉద్యమిస్తోంది. విద్య, వైద్యం, ఆరోగ్యం తదితర సంక్షేమ పథకాల అమలు కోసం, ప్రత్యేక కేటాయింపుల కోసం పీవోడబ్ల్యూ నిరంతరం పోరాడుతోంది. ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకమౌతున్న వేళ ఆదివాసీ హక్కుల కోసం పోరాడింది. విజయవాడలో బుడమేరు పొంగి కనీవినీ ఎరుగని రీతిలో వరదలు వెల్లువెత్తినపుడు పీవోడబ్ల్యూ రాష్ట్రవ్యాప్తంగా విరాళాలు సేకరించి, రాజరాజేశ్వరీపేట, సింగ్‌నగర్, సుందరయ్యనగర్, కండ్రిక, భవానిపురం పేద ప్రజలకు నిత్యావసర సరుకులు, బట్టలు పంపిణీ చేసింది.
విజయవాడ ఆయేషా మీరా మొదలు విశాఖ మౌనిక వరకు జరిగిన అత్యాచారాలు, హత్యలపై మహిళల్ని సమీకరించి ఉద్యమాలు చేపట్టింది. చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని వివిధ రూపాల్లో పోరాటాలు నిర్వహించి ప్రజల్ని చైతన్యపరిచింది. మహిళల శరీరాల్ని మార్కెట్ సరుకులుగా మార్చే ఫ్యాషన్ పెరేడ్లు జరిగినపుడు వాటికి వ్యతిరేకంగా ఉద్యమించింది. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మహిళల ఉపాధి, నివాస, రక్షణ, భద్రత, జీవించే హక్కులపై దాడి మరింతగా పెరిగింది. 33శాతం రిజర్వేషన్లను డీలిమిటేషన్‌కు ముడిపెట్టి మహిళా రిజర్వేషన్లను అందని ద్రాక్షగా మోదీ ప్రభుత్వం మార్చివేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ఆర్థిక, రాజకీయ విధానాలు ప్రజలను ముఖ్యంగా మహిళలను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయి. అభివృద్ధి పేరిట ప్రపంచబ్యాంకు విధానాలను అమలు చేయడంతో బహుళజాతి సంస్థల పట్టు పెరగడమే కాకుండా సంపన్నులు, పేదల మధ్య అంతరాలు చాలా వేగంగా తీవ్రతరం అవుతున్నాయి. తన లాభాల కోసం, మార్కెట్ల విస్తరణ కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను అవసరం తీరిన తర్వాత క్రమంగా రద్దుచేసే పనిలో ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం ఉంది.
గత మూడు సంవత్సరాలుగా నిర్వహించిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోడానికి, సంస్థను నిర్మాణపరంగా బలోపేతం చేసుకోవడానికి మే 23, 24 తేదీలలో గుంటూరులో 9వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభలను ప్రముఖ సామాజిక కార్యకర్త సోషీ సోర్ ప్రారంభిస్తారు. ఈ సభలలో మౌమితా ఆలం (బెంగాల్), జహారా (విశాఖపట్నం), కాత్యాయనీ విద్మహే (వరంగల్) ఇతర మేధావులు, రచయితలు పాల్గొంటారు.
బి. పద్మ
పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇవి కూడా చదవండి..
ఆ పెళ్లికి వెళితే నన్ను బతకనీయరు.. మీడియాపై ట్రంప్ సెటైర్లు