Share News

మహిళల కలల్ని అణచివేసిన ప్రతిపక్షాలు

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:59 AM

‘ఈ దేశంలో మహిళల కలలను ప్రతిపక్షాలు నిర్దాక్షిణ్యంగా అణచివేశాయి’ అని జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ చెప్పిన మాటల్లో ఎంతో ఆవేదన కనిపిస్తోంది. ఎంతో ఆలోచించిన...

మహిళల కలల్ని అణచివేసిన ప్రతిపక్షాలు

‘ఈ దేశంలో మహిళల కలలను ప్రతిపక్షాలు నిర్దాక్షిణ్యంగా అణచివేశాయి’ అని జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ చెప్పిన మాటల్లో ఎంతో ఆవేదన కనిపిస్తోంది. ఎంతో ఆలోచించిన తర్వాతనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లోనే మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. ఇప్పుడున్న సీట్లలో రిజర్వేషన్ కల్పించడం వల్ల చాలామంది పురుష అభ్యర్థులు సీట్లు కోల్పోతారు కనుక సీట్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. అది కూడా జనాభా ప్రాతిపదికన చేస్తే... జనాభాను అదుపులో ఉంచిన రాష్ట్రాలు నష్టపోతాయి కాబట్టి అన్ని రాష్ట్రాలకూ ఒకే శాతం సీట్లు పెంచాలని భావించారు. నియోజకవర్గాల పునర్విభజనకు డీలిమిటేషన్ కమిషన్ వేస్తే అది కూడా వెంటనే తన పని ప్రారంభించేందుకు ఆస్కారం కలుగుతుందని అనుకున్నారు.

సాధారణంగా డీలిమిటేషన్ కమిషన్ దేశమంతటా నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటే కనీసం అయిదారేళ్లు పడుతుంది. అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల సరిహద్దుల్ని మార్చడం అంత సులభం కాదు. వివరంగా మ్యాపింగ్, వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ప్రజాసభలను నిర్వహించడం, రాజకీయ పార్టీల, అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడం, భద్రతాపరమైన, న్యాయపరమైన, ప్రాంతీయ ఆందోళనలను పట్టించుకోవడం అనేది సుదీర్ఘమైన ప్రక్రియ. దీనిని వేగవంతం చేసి రెండున్నర, మూడేళ్లలో పూర్తి చేస్తే కానీ 2029లో మహిళలకు రిజర్వుడు స్థానాలు కేటాయించడం సాధ్యం కాదు. అందుకే, మోదీ ఆగమేఘాలపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇది దేశవ్యాప్తంగా మహిళల్లో ఆశలు రేకెత్తించింది. కానీ ప్రతిపక్షాలు సంకుచితంగా ఆలోచించి ఈ ఆశల్ని అడియాశలు చేశాయి. విషయం కేవలం మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించింది మాత్రమే కాదు, లింగపరమైన న్యాయం, సమాఖ్య స్ఫూర్తిని పాటించడం, వాస్తవాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య సంస్థల నిర్మాణాన్ని పటిష్ఠం చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్ అమలు మరెంత ఆలస్యం అవుతుందో తెలియదు. 2023లో నారీశక్తి వందన్ అధినియమ్ పేరిట ఆమోదించిన 106వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారమే వెళితే జాతీయ జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే 2029లో మహిళలకు రిజర్వేషన్ లభించడం సాధ్యపడదు. ప్రభుత్వం ముందడుగు వేయాలంటే ప్రతిపక్షాలు ఏదో ఒక కారణంతో మోకాలు అడ్డు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల మహిళలకు 33శాతం రిజర్వేషన్‌కు రాజ్యాంగం హామీ ఇచ్చినప్పటికీ అది కాగితాలకే పరిమితం కావాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది.


నిజానికి 131వ సవరణకు సంబంధించిన సంస్కరణల్లో భాగంగా లోక్‌సభ స్థానాలను సుమారు 850కి పెంచాలనే ప్రతిపాదన ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నది. అమెరికాలో 33 కోట్ల జనాభాకు 435 మంది, బ్రిటన్‌లో 6.8 కోట్ల మందికి 650 మంది, జర్మనీలో 8.4 కోట్ల మందికి 630 మంది, ఫ్రాన్స్‌లో 6.8 కోట్ల మందికి 577 మంది ప్రతినిధులు ఉన్నారు. పాకిస్థాన్‌లో కూడా 24 కోట్ల మంది జనాభాకు నేషనల్ అసెంబ్లీలో 336 మంది ప్రతినిధులు ఉన్నారు. అలాంటప్పుడు 140 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న భారతదేశంలో ఎంతమంది ప్రజాప్రతినిధులుండాలి? ప్రతి దేశంలోనూ ఒక ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహించే జనాభా లక్ష నుంచి 8 లక్షల లోపే ఉంటుంది. కానీ మన దేశంలో మాత్రం ఒక ప్రజాప్రతినిధి దాదాపు 25 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఈ ప్రతినిధి వారికి న్యాయం చేయగలరా? 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల సమయంలో, దేశంలో ప్రతి ఎంపీ సుమారు 7 లక్షల మంది పౌరులకు ప్రాతినిధ్యం వహించేవారు. ఇప్పుడు దాదాపు మూడున్నర రెట్ల మందికి ప్రాతినిధ్యం వహించవలసి ఉంటుంది.

ఈ సంస్కరణ నిలిచిపోవడం వల్ల సమాఖ్య వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. ప్రస్తుత రాష్ట్రాల మధ్య సీట్ల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతోంది. జనాభా నియంత్రణను ప్రోత్సహించడానికి ఈ పద్ధతిని అప్పట్లో తెచ్చారు. అయితే, ఇది ఉత్తర–దక్షిణ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. తాజా జనాభా లెక్కల ప్రకారం.. పునర్విభజన జరిగితే, జనాభా పెరుగుదల తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రతిపాదిత సవరణ ప్రకారం.. మొత్తం సీట్లను పెంచి, అన్ని రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో సీట్లు పెంచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని భావించారు. దీని ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 265కు, లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి. అదే తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 178కి పెరుగుతాయి. నిజానికి 2014లో కాంగ్రెస్ అడ్డగోలుగా చేసిన ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం, ఏపీ అసెంబ్లీ సీట్లు 225, తెలంగాణ అసెంబ్లీ సీట్లు 153 స్థానాలకు పెరుగుతాయి. ఈ చట్టంలో లోక్‌సభ సీట్ల ఊసే లేదు. మరి ఇప్పుడు రాజ్యాంగ సవరణకు మోకాలడ్డడం ద్వారా ఏపీ, తెలంగాణలకు ఎంత నష్టం జరిగిందో అర్థమవుతోందా?

ఈ మొత్తం ఘట్టంలో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ పాత్ర ఎంతో కీలకం. ఎన్నికల సరిహద్దులను మార్చడం రాజకీయ పోటీని నేరుగా ప్రభావితం చేసే సున్నితమైన అంశం. గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం సరిహద్దులను మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. 131వ సవరణ ద్వారా ఈ కమిషన్‌కు రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించి, మరింత పారదర్శకత తీసుకురావాలని ప్రభుత్వం భావించింది.


రాజకీయంగా చూస్తే, ఈ బిల్లును ఆమోదించలేకపోవడం నరేంద్రమోదీ ప్రభుత్వ వైఫల్యం కానే కాదు. ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా మహిళా సాధికారతకు కల్పించిన ఆటంకం. 2023లో రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్షమే, ఇప్పుడు ప్రభుత్వం వాటిని ఆచరణ రూపంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించేసరికి కుంటిసాకులు చెబుతూ అడ్డుకోవడం దారుణం. కాంగ్రెస్ నేతలతో పాటు ఇండియా కూటమిలో ఉన్న పలు పార్టీల నేతలు గతంలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భాలున్నాయి. యూపీఏ హయాంలో సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ సభలో బిల్లును తీవ్రంగా వ్యతిరేకించగా, సమాజ్‌వాది పార్టీ ఎంపీ ఒకరు రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి చేతిలో నుంచి బిల్లు లాక్కుని చించేశారు. పైకి కాంగ్రెస్ పార్టీ మహిళలపై కపట సానుభూతి ప్రకటిస్తూనే ప్రతిసారీ ఆ బిల్లు గట్టెక్కకుండా శల్యసారథ్యం చేసింది. ఈసారి కూడా కాంగ్రెస్ అదే పనిచేసింది.

కానీ, మోదీ ఏ పనిచేసినా నిజాయితీగా, నిర్భయంగా చేస్తారు. మహిళల ఓట్ల కోసం బూటకపు సానుభూతిని ప్రకటించాల్సిన అవసరం మోదీ సర్కార్‌కు లేదు. మహిళలకు రాజకీయ సాధికారిత కల్పించాలన్నదే మోదీ ప్రభుత్వ ఆశయం. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశంలో మహిళల్లో పెద్ద సంఖ్యలో బీజేపీకి ఓటు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మహిళలే కాంగ్రెస్, ప్రతిపక్షాలకు ప్రతి ఎన్నికల్లోనూ గట్టి బుద్ధి చెప్పడం ఖాయం.

వై. సత్యకుమార్

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

ఇవి కూడా చదవండి

ఆర్టీసీ సమ్మెలో ఆందోళనకర పరిణామాలు..

చిన్న నౌకలనూ కాల్చేయండి.. అమెరికా నేవీకి ట్రంప్ కీలక సూచనలు

Updated Date - Apr 24 , 2026 | 12:59 AM