Share News

పీహెచ్‌డీ ముసుగులో సివిల్స్‌ సన్నాహాలు!

ABN , Publish Date - Mar 11 , 2026 | 02:12 AM

ఈ ఏడాది సివిల్స్‌ పరీక్షల్లో ఎంపికైన 958 మందిలో సుమారు 239మంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండగానే సివిల్స్‌ పరీక్షకు సిద్ధమవుతున్న,,,

పీహెచ్‌డీ ముసుగులో సివిల్స్‌ సన్నాహాలు!

ఈ ఏడాది సివిల్స్‌ పరీక్షల్లో ఎంపికైన 958 మందిలో సుమారు 239మంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండగానే సివిల్స్‌ పరీక్షకు సిద్ధమవుతున్న అధికారులపై చర్చలు జరుగుతున్నాయి కానీ, మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది: అది యూపీఎస్‌సీ అభ్యర్థులు చాలామంది పీహెచ్‌డీ కార్యక్రమాలను ఒక రకమైన బ్యాకప్‌గా వాడుకోటం గురించి.

ఇటీవల ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేస్తున్న వారిలో కొందరు పరిశోధనపై దృష్టి పెట్టడానికి బదులు యూపీఎస్‌సీ సన్నాహాల్లో నిమగ్నమై ఉంటున్నారు. పీహెచ్‌డీ విద్యార్థులకు లభించే నెలవారీ స్టైఫండ్‌, హాస్టల్ వసతి, సబ్సిడీ ఆహారం వంటి సదుపాయాలు వీరికి కొన్నేళ్లపాటు ఆర్థిక భద్రతను కల్పిస్తాయి. దీంతో ఉద్యోగ ఒత్తిడి లేకుండా ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్‌ అవటం సులభమవుతుంది. వారి కోణం నుంచి ఆలోచించినప్పుడు ఇది ఒక మంచి వ్యూహాత్మక నిర్ణయమే కావచ్చు. కానీ దీని ప్రభావం విశ్వవిద్యాలయాల పరిశోధన వాతావరణంపై ప‌డుతుంది.

విశ్వవిద్యాలయాలు పరిశోధనాపరమైన ఆలోచనలు, అకడమిక్ చర్చలు జరిగే ప్రదేశాలుగా ఉండాలి. కానీ కొన్నిచోట్ల పీహెచ్‌డీ విద్యార్థుల మధ్య పరిశోధన అంశాలకన్నా ప్రిలిమ్స్ వ్యూహాలు మెయిన్స్‌ సన్నాహాలు, ఇంటర్వ్యూ టిప్స్... ఇలాంటి చర్చలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. పరిశోధన ఆలోచనలు, పబ్లికేషన్లు, అకడమిక్ సహకారం గురించి మాట్లాడుకోవాల్సిన గ్రంథాలయాలు కూడా కొన్నిసార్లు పోటీ పరీక్షల చర్చలతో నిండిపోతున్నాయి. ఇదే కొనసాగితే క్రమంగా విశ్వవిద్యాలయాల పరిశోధన సంస్కృతి బలహీనపడే ప్రమాదం ఉంది. పీహెచ్‌డీ కార్యక్రమాలు నిజమైన పరిశోధన దిశగా కాకుండా ఇతర లక్ష్యాల కోసం ఉపయోగించబడితే, దీర్ఘకాలంలో పరిశోధన నాణ్యతపై ఆ ప్రభావం పడుతుంది.

అయితే ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే భారతదేశంలో అకడమిక్ ఉద్యోగాల అనిశ్చితిని కూడా గుర్తించాలి. పీహెచ్‌డీ పూర్తి చేయడం ఐదేళ్ళపాటు సాగే కఠినమైన ప్రయాణం. కానీ ఆ ప్రయాణం పూర్తయిన తరువాత స్థిరమైన ఉద్యోగం పొందడం మరింత కష్టతరమైన విషయం. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేష‌న్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం కేంద్ర విశ్వవిద్యాలయాల్లో మొత్తం 18,940 అధ్యాపక పోస్టులు ఉండగా, వాటిలో 13,758 మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 5,182 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ ఉన్నప్పటికీ తక్కువ జీతాలు, అధిక పబ్లికేషన్ లక్ష్యాలు, అలాగే పరిపాలనా బాధ్యతలు కూడా విధించబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అకడమిక్ కెరీర్ అనేకమందికి అనిశ్చితంగా కనిపించడం సహజమే. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు పీహెచ్‌డీ కార్యక్రమాలను ఒక రకమైన భద్రతగా వాడుకుంటూ యూపీఎస్‌సీ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఆ అభ్యర్థులను తప్పుపట్టేందుకు ఏమీ లేదు. వ్యవస్థలో ఉన్న అవకాశాలు, అనిశ్చితుల ఆధారంగా వారి నిర్ణయాలు ఉంటున్నాయి. అయినప్పటికీ దీని ప్రభావం గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది.


ప్రతి పీహెచ్‌డీ సీటు ప్రభుత్వ నిధులతో నడుస్తుంది. అది ఒక విలువైన అవకాశం. నిజంగా పరిశోధనపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు అందాల్సిన అవకాశాలు ఈ విధంగా తగ్గే ప్రమాదం ఉంది. ఇక్కడ సమస్య యూపీఎస్‌సీ అభ్యర్థుల ఆశయాల్లో లేదు. సమస్య వ్యవస్థలో ఉన్న ప్రోత్సాహకాల్లో ఉంది. భారతదేశంలో పరిశోధన వ్యవస్థను బలపరచాలంటే అకడమిక్ కెరీర్‌కు స్థిరత్వాన్ని కల్పించడం, అలాగే పీహెచ్‌డీ కార్యక్రమాలు నిజమైన పరిశోధనకు కేంద్రాలుగా ఉండేలా చూడడం అత్యంత అవసరం.

ఆద‌ర్శ్ వెంక‌ట్ కోట‌

పీహెచ్‌డీ స్కాల‌ర్,

బిట్స్ పిలానీ, హైద‌రాబాద్ క్యాంప‌స్‌

ఇవి కూడా చదవండి..

సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం... ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమల్ ఖరాజీ

నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Mar 11 , 2026 | 02:12 AM