వ్యక్తి పూజతో పాతాళంలోకే..!
ABN , Publish Date - Sep 23 , 2026 | 01:03 AM
ప్రజలు తమకు నచ్చిన హీరో, హీరోయిన్లను అభిమానించడం, మొదటి ఆట సినిమా కోసం ఎగబడి ప్రాణాలు కూడా కోల్పోవడం వివిధ సందర్భాలలో చూశాం. అది ఒక రకమైన వ్యక్తి పూజ. రాజకీయాలలో...
ప్రజలు తమకు నచ్చిన హీరో, హీరోయిన్లను అభిమానించడం, మొదటి ఆట సినిమా కోసం ఎగబడి ప్రాణాలు కూడా కోల్పోవడం వివిధ సందర్భాలలో చూశాం. అది ఒక రకమైన వ్యక్తి పూజ. రాజకీయాలలో కూడా నాయకులను దేవుళ్లుగా చూడడం, ఇంకా పిచ్చి ముదిరి గుడులు కట్టించిన వార్తలు కూడా వచ్చాయి. సినీ నటులను పూజిస్తే అది వారి వ్యక్తిగతం. కానీ, రాజకీయ నాయకుల విషయం వేరు. వీరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా దేశ భవిష్యత్తుపై పెద్ద ప్రభావమే కలిగిస్తారు. వ్యక్తి పూజ ఎక్కువైతే, అది క్రమంగా నిరంకుశత్వంగా మారి, దేశాన్ని అంధకారంలోకి నెట్టేయడమే కాక, అంతిమంగా ఆ నాయకుణ్ణి కూడా పాతాళంలోకి నెట్టేస్తుంది. అందుకు హిట్లర్, ముస్సోలినీ వంటి నాయకులే ఉదాహరణ.
మన దేశంలో ‘ఇండియాయే ఇందిర–ఇందిరే ఇండియా’ వంటి వ్యక్తి పూజ చివరకు ఎమర్జెన్సీకి దారితీసి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసింది. అవి దేశంలో చీకటి రోజులుగా నిలిచాయి. అంతిమంగా అది వారి పార్టీకీ నష్టం కలుగజేసి, అర్ధ శతాబ్దం అయినా నేటికీ వారిని వెంటాడుతూనే ఉంది. నేడు మరలా అలాంటి లేదా అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితులు దేశంలో ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా ఈ వ్యక్తి పూజ ప్రమాదాన్ని గురించి ఆధునిక భారత నిర్మాతలు ఏమన్నారో గుర్తు చేసుకోవడం సందర్భోచితం.
గణతంత్ర ఆవిర్భావ సమయాన బి.ఆర్.అంబేడ్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారత రాజకీయ ఆలోచనలో అత్యంత లోతైన హెచ్చరికలలో ఒకదాన్ని చేశారు: ‘మతంలో భక్తి ఆత్మ మోక్షానికి మార్గం కావచ్చు. కానీ రాజకీయాల్లో భక్తి లేదా వ్యక్తి పూజ కచ్చితంగా పతనానికి, ఆ తర్వాత నిరంకుశత్వానికి దారితీసే మార్గం.’ మన ఆధ్యాత్మిక సంప్రదాయాలలో భక్తికి పవిత్రమైన స్థానం ఉంది. కానీ రాజకీయం వేరని అంబేడ్కర్ స్పష్టం చేశారు.
సంప్రదాయ రూపంలో ఉండే నిరంకుశత్వం కంటే, ప్రజాస్వామ్య సంస్కృతి నెమ్మదిగా క్షీణించడం గురించే అంబేడ్కర్ ఎక్కువగా భయపడ్డారు. రాజ్యాంగాలను రూపొందించవచ్చు, ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ గణతంత్రాలు అంతిమంగా ప్రజల ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటాయి. కఠినమైన ప్రశ్నలను అడగడానికి, అధికారం ఒకేచోట కేంద్రీకృతం కావడాన్ని అనుమానించడానికి, దేశం పట్ల భక్తికి, నాయకుడి పట్ల విధేయతకు మధ్య ఉన్న తేడాను గుర్తించడానికి సిద్ధంగా ఉన్న పౌరులపైనే అవి ఆధారపడతాయి.
దీనికి పన్నెండేళ్ల ముందు అంటే 1937లో దేశం ఒకవైపు పరాయి పాలన, మరోవైపు అనిశ్చితమైన స్వాతంత్ర్య హామీల మధ్య ఊగిసలాడుతున్న సమయంలో, ‘మోడరన్ రివ్యూ’ పత్రికలో ‘రాష్ట్రపతి’ అనే శీర్షికతో ఒక వ్యాసం ప్రచురితమైంది. అందులో ‘ఒక దయాగుణం ఉన్న, సమర్థుడైన నిరంకుశ పాలకుడి కింద దేశం కొంతకాలం పురోగమించినప్పటికీ, అది కుంగిపోతుంది, దాని వల్ల ప్రజల విముక్తి రోజు ఆలస్యమవుతుంది’ అని రాశారు. ఆ వ్యాసం చివర ‘చాణక్య’ అని సంతకం చేసి ఉంది. ఆ రచయిత జవహర్‌లాల్ నెహ్రూ అని అప్పటి పాఠకులకు తెలియదు. ఆధునిక చరిత్రలో అత్యంత విచిత్రమైన ఆత్మపరిశీలనలలో ఇది ఒకటి. ఒక నాయకుడి సొంత ప్రజాదరణ దేశానికి ఎంత ప్రమాదకరమో గుప్తంగా రాశారు. నెహ్రూ అప్పటికే కోట్ల మంది ప్రజలకు, భారత ఆశయాలకు ప్రతీకగా, స్వాతంత్ర్య కాంక్షకు నిలువెత్తు రూపంగా కనిపించారు. ఆయనపై ఉన్న అభిమానం హద్దులు కూడా దాటింది. ఆ హద్దులు దాటడాన్నే ప్రమాదంగా పరిణమిస్తుందని ఆయన హెచ్చరించారు.
సమాజం తన ఆశలను, భయాలను ఒక రక్షకుడిగా భావించే వ్యక్తిపై ఉంచుతుంది. కానీ నాయకులను పూజించే వస్తువులుగా మార్చినప్పుడు ప్రజాస్వామ్యం అరుదుగా మాత్రమే మనుగడ సాగిస్తుంది. ఒకే ఒక్క వ్యక్తిలో విముక్తిని వెతుక్కోవడానికి అలవాటుపడిన ప్రజలు, గణతంత్ర జీవితాన్ని నిలబెట్టే అలవాట్లను– అంటే సంశయాత్మకత, చర్చ, భాగస్వామ్యం, బాధ్యతలను కోల్పోతారు. ఎంత ప్రతిభావంతుడైన వ్యక్తయినా సమాజం పట్ల ఉన్న బాధ్యతలకు అతీతుడు కాడు. నెహ్రూ, అంబేడ్కర్ తమ సొంత రీతిలో భారతదేశానికి నేర్పడానికి ప్రయత్నించిన పాఠం కూడా ఇదే. వ్యక్తుల కంటే వ్యవస్థలే ముఖ్యమని, అధికారం తన కంటే పెద్దదైన దానికి జవాబుదారీగా ఉండాలనేది గణతంత్ర భావం. ప్రజాస్వామ్యాలకు మార్గదర్శకులు కావాలి, కానీ వారితో పాటు సద్విమర్శకులు కూడా తప్పనిసరిగా కావాలి.
వ్యక్తి పూజా సంస్కృతిలోని విషాదం ఏంటంటే, అది మన సొంత ఆలోచనా శక్తిని ఇతరులకు కుదువబెట్టేలా చేస్తుంది. కేవలం ఒక వ్యక్తిపై ఉన్న అభిమానాన్ని దేశభక్తిగా పొరబడేలా చేస్తుంది. చరిత్ర అనేది కోట్ల మంది ప్రజల శ్రమ ద్వారా కాకుండా, కేవలం అసాధారణ కథానాయకుల ద్వారానే నిర్మితమవుతుందని నమ్మేలా అది మనల్ని ప్రలోభపెడుతుంది. ఒక గణతంత్రం నిజమైన ప్రమాణం– అది అసాధారణ నాయకులను తయారుచేయగలదా లేదా అనేది కాదు; వారిపై ఆధారపడకుండా తనను తాను నిరంతరం పునరుద్ధరించుకోగలదా లేదా అనేదే!
వ్యక్తి పూజ అనేక అనర్థాలకు దారితీస్తుంది. రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థలు అంటే చట్టసభలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం వంటివి నిర్వీర్యమై, వ్యక్తుల నిర్ణయాలే ‘నా మాటే శాసనం’ అనే విధంగా మారతాయి. నాయకుడి నిర్ణయాలను ప్రశ్నించే హక్కును ప్రజలు, చివరికి పాలకవర్గం కూడా కోల్పోతుంది. ‘పరిశీలన’ స్థానంలో ‘అంధభక్తి’ చేరి ప్రజాస్వామ్య పర్యవేక్షణ దెబ్బతింటుంది. జవాబుదారీతనం లేకుండాపోతుంది. ప్రతి సమస్యకూ ఒకే ఒక్క ‘రక్షకుడు’ పరిష్కారం చూపుతాడనే భ్రమలో ప్రజలు తమ పౌర బాధ్యతలను, విమర్శనాత్మక ఆలోచనను వదులుకుంటారు. అపరిమితమైన ప్రజాదరణ, ప్రశ్నించలేని అధికారం కాలక్రమేణా ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్ష లేదా పరోక్ష నిరంకుశత్వంగా మారుస్తాయి. అంబేడ్కర్ హెచ్చరించినట్లుగా, రాజకీయాల్లో భక్తి లేదా వ్యక్తి పూజ అనేది ప్రజాస్వామ్య పతనానికి, నిరంకుశత్వానికి కచ్చితమైన మార్గం.
వ్యక్తి పూజ అనేది ఒక్కరోజులోనో లేదా ప్రజల ప్రమేయంతోనో స్వతంత్రంగా పుట్టదు. నాయకుడు లేదా అతని అధికార యంత్రాంగమే వ్యూహాత్మకంగా అతనిని ఒక ‘రక్షకుడిగా’, ‘అపరిమిత శక్తిమంతుడు’గా ప్రచారం కల్పిస్తుంది. నాయకులు తమను తాము దైవాంశసంభూతులుగా లేదా ప్రశ్నించలేని నాయకులుగా చిత్రీకరించుకోవడం ద్వారా తమ తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటారు. ప్రశ్నించే పౌరులను లేదా విమర్శకులను ‘దేశద్రోహులు’గా ముద్ర వేస్తారు.
తీవ్రమైన పేదరికం, భయం, అజ్ఞానం లేదా సామాజిక అభద్రతలో ఉన్న ప్రజలు ఒక అద్భుత శక్తి కోసం ఎదురుచూడటం సహజం. అయితే, ఆ అమాయకత్వాన్ని లేదా అభద్రతను తమ వ్యక్తిగత అధికార దాహానికి వాడుకోవడం నాయకుడి తీవ్రమైన నైతిక వైఫల్యం. దేశంలోని నేటి నిశ్శబ్ద ఎమర్జెన్సీ కాలంలో ఈ విషయాలు అత్యంత ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ప్రజలే అప్రమత్తతతో వ్యవహరించడం అవసరం.
ఎ. అజశర్మ
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ
ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా