Share News

ప్రజలు ఓర్పుకు ఓటేశారు!

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:02 AM

2024 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి జనం ఎంత స్ట్రయిక్‌ రేట్ ఇచ్చారో, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే స్ట్రయిక్‌ రేట్ ఇచ్చారు. అప్పుడు 92శాతం స్ట్రయిక్‌ రేట్ అయితే, ఇప్పుడు 94శాతం అంటున్నారు...

ప్రజలు ఓర్పుకు ఓటేశారు!

2024 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి జనం ఎంత స్ట్రయిక్‌ రేట్ ఇచ్చారో, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే స్ట్రయిక్‌ రేట్ ఇచ్చారు. అప్పుడు 92శాతం స్ట్రయిక్‌ రేట్ అయితే, ఇప్పుడు 94శాతం అంటున్నారు. జనసేన వరకు అయితే అప్పుడూ ఇప్పుడూ 100శాతమే. కూటమికి అందిన ఈ విజయానికి క్రెడిట్ అంతా రాజకీయంగా చైతన్యవంతులైన తెలుగు ప్రజలదే. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినవారు వీలైనంత వినమ్రంగా తమ గెలుపును జనాదేశంగా భావించి, ప్రజలపట్ల తమ బాధ్యతలను వీలైనంత చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. సమాజ ప్రతీఘాత శక్తుల బారినుంచి పౌర సమాజాన్ని ప్రజలు రక్షించుకున్న ఈ అపురూప సందర్భాన్ని కూటమి నేతలు గుర్తించాలి. పనిలో పనిగా ప్రజలు అక్కడక్కడా ఎందుకు ఓడించారో కూటమి పెద్దలు ఆత్మావలోకనం చేసుకోవడం మంచిది.

రాజకీయ, అధికార, ప్రభుత్వ ఉద్యోగ యంత్రాంగాల్లో అవినీతి అనేది పెద్దగా పట్టించుకోవలసిన అంశంగా పరిగణించని మానసిక స్థితికి ప్రజలు చేరుకున్నారు. వృత్తి ఏదైనా, డబ్బు సంపాదనే ముఖ్యం అనే రీతిగా సమాజం రూపాంతరం చెందింది. ఆ సంపాదన సక్రమమా అక్రమమా అని పట్టించుకునే స్థితిలో సమాజం లేదు. ‘వాళ్లకు టైమొచ్చినప్పుడు వాళ్లు తింటారు. వీళ్లకు టైమొచ్చినప్పుడు వీళ్లు తింటారు. లేకపోతే రాజకీయాల్లో ఎందుకు ఉంటారు!?’ అని సూత్రీకరించేవారు బోలెడంతమంది తారసపడుతున్నారు. కూటమిలో కూడా చాలామంది వ్యక్తులు వారి రాజకీయ ప్రత్యర్థులకు అవినీతిలో ఏ మాత్రం తగ్గరని కూటమి శ్రేయోభిలాష విశ్లేషకులు సైతం చాలా సందర్భాలలో తేల్చి చెప్పారు. కానీ కనీస‍ం కూటమి వారు వైసీపీతో పోలిస్తే అంత ప్రమాదకర వ్యక్తులు కాదని జనం నమ్మారు. వైసీపీ వారు ‘క్రిమినల్‌ గ్యాంగులు’ అనే అభిప్రాయం జనంలో బలంగా ఏర్పడడం వల్ల వారిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.


ఏ పాలనా వ్యవస్థలో అయినా ఆత్మగౌరవంతో బతికే స్వేచ్ఛ ముఖ్యం. తమకు నచ్చిన రీతిలో చట్టబద్ధ జీవనానికి పూచీ పడగల పరిస్థితులు కలిగి ఉండడం జనానికి ముఖ్యం. కూటమి పాలనలో ప్రజలకు ఆ భరోసా నూరు శాతం లభించింది. చంద్రబాబు నాయుడు హయాంలో ‘పొలిటికల్ క్రైమ్’ రేట్ బాగా తగ్గింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ యువనేత నారా లోకేశ్‌, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను నోటికి వచ్చినట్టుగా దుర్భాషలాడే ‘స్వేచ్ఛ’ను కూటమి ప్రత్యర్థులు ఆనందిస్తున్నారంటే, రాజకీయ ప్రశాంతత కోసం అలాంటి ఓర్పును కూటమి ప్రభుత్వం పాటిస్తున్నదనీ, ఎవరూ పాలకులకు భయపడాల్సిన అవసరం లేని వాతావరణాన్ని కల్పించిందనీ అర్థం. ఈ ప్రశాంతతనే ప్రజలు కోరుకున్నది. అందుకే ‘క్రిమినల్ గ్యాంగ్’లను ఈ స్థానిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కాపాడుకున్నారు. వైసీపీ భాష, భావం, మారణకాండ దృక్పథం, రప్పా రప్పా వ్యవహార శైలి మారనంత కాలం... వారికి వ్యతిరేకంగా ప్రజల తీర్పు కొనసాగుతూనే ఉంటుంది, కూటమి పాలన మంచీ చెడులతో సంబంధం లేకుండా!

భోగాది వేంకటరాయుడు

ఇవి కూడా చదవండి..

యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...

Updated Date - Nov 12 , 2026 | 01:02 AM